National Highway Construction
-
గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత
దామెర: నాగపూర్– విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూములను లాక్కోవద్దంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. హను మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా, రైతులు ఆం దోళనలకు దిగుతూ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శనివారం ఉదయం అధికారులు ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో తిరిగి సర్వే ప్రారంభించారు. ఏసీపీ శివరా మయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా 163 జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నారు. ఆందోళనలు చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇతరమార్గాల ద్వారా కొందరు రైతులు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఊరుగొండకు చెందిన చెల్పూరి అశోక్ అనే రైతు ఉరేసుకోవడానికి యత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఓదెల రజిత అనే మరో మహిళారైతు ఆత్మహత్యే శరణ్యమని, ఇంటిల్లిపాది పురుగులమందు తాగి చనిపోతామంటూ రోదించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పి సర్వే కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిసరాల్లోని వ్యవసాయబావుల వద్ద, ఎస్సార్ఎస్పీ కెనాల్ వద్ద, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు రెండు 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. -
మర్రి.. వర్రీ..
మండే ఎండల్లో కూడా భాగ్యనగర ప్రాంతం చల్లగా ఉండేదట. ఏప్రిల్‌లో కూడా మంచు కురిసేదని ఇప్పటికీ చెబుతుంటారు. రోడ్లకిరువైపులా అశోకుడు చెట్లను పెంచిన తీరును కాకతీయులు కొనసాగించారు. హైదరాబాద్‌లో ఆ సంప్రదాయాన్ని రెండో నిజాం కూడా కొనసాగించారు. వారి హయాంలో నగరం చుట్టూ అన్ని ప్రధాన రహదారులపై వేల సంఖ్యలో మర్రి వృక్షాలు పెంచారు. నగరానికి దారితీసే అన్ని మార్గాల్లో పందిరి వేసినట్టుగా ఎదిగిన మర్రి వృక్షాలు చల్లటి వాతావరణాన్ని పంచేవి. రహదారుల విస్తరణతో రోడ్లపై ఉన్న వృక్షాలన్నీ కాలగర్భంలో కలిసిపోగా, మిగిలిన ఏకైక రోడ్డు కూడా ఆ జ్ఞాపకాన్ని కోల్పోబోతున్నది. సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ జాతీయరహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. నగర శివారులోని అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ. దూరంలో ఉన్న మన్నెగూడ కూడలి వరకు దీన్ని 60 మీటర్ల వెడల్పుతో ఎక్స్‌ప్రెస్ వే తరహాలో అభివృద్ధి చేయనున్నారు. రూ.929 కోట్లతో విస్తరించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలిచింది. రెండుమూడు నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ శుభవార్తనే. కానీ ఆ రోడ్డులో విస్తరించి ఉన్న ఊడల మర్రి వృక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేవ లం 46 కి.మీ. దూరంలో 890 మర్రిచెట్లున్నాయి. ఇవన్నీ 80 నుంచి నుంచి వంద ఏళ్ల వయసున్న వృక్షాలు. వీటిని తొలగిస్తే, నగరంతో పెనవేసుకున్న నిజాం కాలం నాటి ఊడల మర్రులన్నీ అంతరించినట్టే. రెండేళ్లుగా కసరత్తు.. ఈ రోడ్డును విస్తరించనున్నట్టు ప్రభుత్వం గత ఐదారేళ్లుగా చెబుతోంది. రెండేళ్ల కిందటే అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. మన్నెగూడ నుంచి పరిగిమీదుగా కర్ణాటక సరిహద్దు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరించింది. మన్నెగూడ వరకు నాలుగు వరుసల విస్తరణ బాధ్యత మాత్రం ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉన్నందున, కేంద్రప్రభుత్వం రెండేళ్లకిందట ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. అప్పటినుంచి అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ వృక్షాలను తొలగించేందుకు గతంలో టెండర్లు పిలిచారు. దీంతొ స్వచ్ఛంద సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. వటా ఫౌండేషన్ అనే సంస్థ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి ఫిర్యాదు చేయడంతో, తాత్కాలింగా ఆ వృక్షాల తొలగింపు నిలిచిపోయింది. వాటిని పరిరక్షిస్తామని కేంద్రమంత్రి వారికి హామీ ఇచ్చారు. అనుమానాలెందుకు? ప్రత్యామ్నాయం ఏమైంది? వృక్షాలను తొలగిస్తే పర్యావరణానికి భారీ చేటు తప్పదని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం వేడెక్కకుండా కాపాడుతూ, ప్రాణవాయువునిచ్చే చెట్లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. నగరం చుట్టూ వందేళ్ల వయసుండే వృక్షాలు మాయమైన నేపథ్యంలో, ఈ కొద్ది వృక్షాలనైనా కాపాడుకోవాలి. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో వాటిని మరో చోట నాటాల్సి ఉంది. ఇప్పుడు చేవెళ్ల రోడ్డు విస్తరణలో ఈ ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. కానీ గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ట్రాన్స్‌లొకేషన్‌ను ప్రక్రియను అధికారులు అమలు చేయలేదు. భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. దీంతో చేవెళ్ల రోడ్డుపై ఉన్న భారీ వృక్షాల భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు వ్యయంలో చెట్ల తరలింపు ఖర్చు.. ఈ రోడ్డు విస్తరణకు కేంద్రప్రభుత్వం రూ.929 కోట్లను కేటాయించింది. ఇందులో చెట్ల ట్రాన్స్‌లొకేషన్ ఖర్చులను కూడా చేర్చింది. సమీపంలో ఖాళీ ప్రభుత్వ భూములు, అటవీశాఖ భూములను గుర్తించి వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేయాలనేది ఆలోచన. వృక్షాలను పరిశీలించి వాటిల్లో ట్రాన్స్‌లొకేట్ చేస్తే బతికేవాటిని గుర్తించి తరలిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ‘కొన్నింటికే పరిమితం చేస్తారేమో’ పెద్ద సంఖ్యలో ఉన్న చెట్లను తరలించటం ఖర్చుతో కూడుకున్న పని. అందుకు తగ్గ ఉపకరణాలు కూడా అందుబాటులో లేవు. సచివాలయ నిర్మాణ సమయంలోనూ చాలా చెట్లను కొట్టేశారు. ఇక గండిపేట రోడ్డు విస్తరణలో, తరలింపునకు యో గ్యమైన చెట్లను కూడా నరికేశారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల రోడ్డుపైనా కొన్ని వృక్షాలనే ట్రాన్స్‌లొకేషన్‌కు గుర్తించి మిగతావాటిని నరికేస్తారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ‘‘ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియలో ఉచితంగా సేవలందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సాంకేతిక, ఆర్థిక సహకారం అందించి, స్థలాలు చూపితే వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభిస్తాం’’ అని వటా ఫౌండేషన్ నిర్వాహకులు ఉదయ్‌కృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. కాల్చి.. కూల్చి ఈ రోడ్డుపై భారీ వృక్షాలున్నందువల్ల వాటిని తొలగించటం ఇష్టంలేక రోడ్డు విస్తరణ ప్రాజెక్టు పడేకేసిందంటూ గతంలో ఓ అభిప్రాయం వ్యాపించింది. రోడ్డు విస్తరిస్తే భూములకు డిమాండ్ పెరుగుతుందని, కొందరు రియల్ వ్యాపారులు రైతులను ఎగదోసి మర్రి చెట్లను కూల్చే కుట్రకు తెరదీశారు. రాత్రికి రాత్రి వృక్షాల మొదళ్ల చుట్టూ మంటలు పెట్టి కాల్చివేయించారు. దీంతో చూస్తుండగానే వృక్షాలు నేలకొరిగాయి. ఇలా ఏడాదిన్నరలో ఏకంగా వంద మర్రి చెట్లను కూల్చేయడంతో కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కాల్చివేతలు కొనసాగుతున్నాయి. -
విజయవాడకు మరో హైవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–విజయవాడ మధ్య మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణం కాబోతోంది. పాత రోడ్లతో సంబంధం లేకుండా పూర్తి కొత్తగా నిర్మించబోతున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మీదుగా రూపుదిద్దుకుంటున్న జాతీయ రహదారికి కొనసాగింపుగా మంచిర్యాల నుంచి ఈ కొత్త రోడ్డు మొదలై విజయవాడ వరకు సాగుతుంది. నాలుగు వరుసలు ఉండే ఈ జాతీయ రహదారి మన రాష్ట్రం పరిధిలో 310 కి.మీ. మేర ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ భారత్‌మాల పరియోజన పథకానికి కేంద్రం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, కొన్ని ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారులనే అనుసంధానిస్తుండగా, వీలుపడని చోట్ల పూర్తిగా కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడకు రైల్వేలైన్ ఉన్నట్టుగా రోడ్డు మార్గం సౌకర్యవంతంగా లేదు. దీంతో పాతరోడ్లను వదిలేసి పూర్తిగా కొత్తరోడ్డును నిర్మించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ క్రమంలో ఉత్తరభారతం నుంచి ప్రారంభమయ్యే రోడ్డు నాగ్‌పూర్ మీదుగా తెలంగాణలోని మంచిర్యాల–వరంగల్–ఖమ్మం–విజయవాడ మీదుగా దక్షిణంలోని దిగువభాగానికి చేరుతుంది. మంచిర్యాలకు ముందు కొంత పాత జాతీయ రహదారిని అనుసంధానిస్తూ మిగతా చోట్ల కొంత కొత్త రోడ్డును నిర్మిస్తున్నారు. మంచిర్యాల నుంచి పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఏకంగా 1,450 హెక్టార్ల భూమిని సమీకరిస్తున్నారు. ఇతరత్రా ప్రక్రియలకు ఆరు నెలలు పడుతుందని, ఆ తర్వాత పనులు ప్రారంభించి 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ 2023 నాటికి రోడ్డు సిద్ధమవుతుందని చెబుతోంది. హైదరాబాద్‌పై తగ్గనున్న భారం విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లాలంటే ఎక్కువ మంది హైదరాబాద్ మీదుగానే సాగుతున్నారు. దీంతో ఆ రోడ్డుపై విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతోంది. ప్రత్యామ్నాయంగా మెరుగైన మరో మార్గం లేకపోవటంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రయాణ సమయం పెరుగుతోంది. ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి వస్తే కొన్నిప్రాంతాల ట్రాఫిక్ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా వరంగల్ మీదుగా సాగిపోవచ్చు. స్వరూపం ఇలా రాష్ట్రంలో రోడ్డు నిడివి: 310 కి.మీ సేకరించే భూమి: 1,450 హెక్టార్లు మొత్తం వ్యయం అంచనా: రూ.7,612 కోట్లు ఇందులో భూసేకరణ ఖర్చు రూ.1,078 కోట్లు వంతెనలు: 181 (అందులో పెద్దవి 10) ముసాయిదా నోటిఫికేషన్ జారీ సాక్షి, న్యూఢిల్లీ: నాగ్‌పూర్–విజయవాడ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల–విజయవాడ మధ్య కొత్త జాతీయ రహదారికి ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసినట్టు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. గ్రీన్‌ఫీల్డ్ అలైన్మెంట్ ద్వారా జాతీయ రహదారిని అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే ఏపీలోని అమలాపురం నుంచి పలివెల మీదుగా రావులపాలెం వరకు ఉన్న రహదారిని, పెడన నుంచి విస్సన్నపేట మీదుగా లక్ష్మీపురం వరకు ఉన్న మార్గాన్ని కొత్త జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ ముసాయిదా జారీచేసినట్టు చెప్పారు. మంచిర్యాల–వరంగల్ మధ్య.. నిడివి: 112 కి.మీ. ఖర్చు: రూ.2,500 కోట్లు సేకరించే భూమి: 589 హెక్టార్లు పరిధి: మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలు ప్రధాన పట్టణాలు: మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర వరంగల్–ఖమ్మం మధ్య నిడివి: 107 కి.మీ., ఖర్చు: రూ. 2,250 కోట్లు సేకరించే భూమి: 568 హెక్టార్లు పరిధి: వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలు ముఖ్య పట్టణాలు: ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగ్యెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం ఖమ్మం–విజయవాడ నిడివి 91 కి.మీ., ఖర్చు: రూ.1,820 కోట్లు సేకరించే భూమి: 295 హెక్టార్లు పరిధి: ఖమ్మం, కృష్ణా జిల్లాలు ముఖ్య ప్రాంతాలు: సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి -
ఏడాదిగా ఎదురుచూపు
► జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లావాసుల ఆశలు ► గతేడాది జనవరిలోనే ప్రకటించిన కేంద్రమంత్రి గడ్కరీ ► ‘హైదరాబాద్– భైంసా’పూర్తయితే.. బాసరకు మెరుగుకానున్న రవాణాసేవలు భైంసా(ముథోల్): దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో బాసర సరస్వతీ ఆలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చదువుల తల్లి కొలువైన ఈ ప్రాంతానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే ఇక్కడే ఉన్న ట్రిపుల్‌ఐటీలో రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుతున్నారు. బాసర పుణ్యక్షేత్రానికి ఆనుకుని గోదా వరి ప్రవహిస్తోంది. నదిపై బాసర వద్ద రైలు, వాహనాలు వెళ్లేందుకు రెండు వేర్వేరు వంతెనలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరకు హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి నిర్మిస్తామని గతేడాది జనవరిలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు గాను 1800 కిలోమీటర్ల పొడవైన 12 మార్గాలను జాతీయ రహదారులు గా మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు. అం దులో నిర్మల్‌జిల్లాకు సైతం అవకాశం దక్కింది. హైదరాబాద్– నర్సాపూర్– మెదక్– ఎల్లారెడ్డి–బాన్సువాడ–బోదన్–బాసర– భైంసా వరకు 230 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించనున్నట్లు తెలిపారు. ఏడాదిగా నిర్మల్ జిల్లావాసులు ఈ జాతీయ రహదారి విస్తరణ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే బాసరకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని ఇక్కడి వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్బందులే... బాసరకు చేరుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాలోని భైంసా వరకు 65 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ శాఖ పరిధిలోని పొడవైన రోడ్డు మార్గం ఉంది. రెండు జిల్లాలను కలిపే ఈ రహదారి అధ్వానంగా ఉంది. భైంసా నుంచి నిజామాబాద్ వరకు ఉన్న ఈ మార్గంలో నిజాం కాలంలో నిర్మించిన వంతెనలు ఉన్నా యి.ప్రస్తుతం బాసర మండలం బిద్రెల్లి గ్రామం వద్ద వాగుపై కొత్తవంతెన నిర్మిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో యంచ గ్రామం నుంచి సారంగాపూర్ వరకు ఉన్న రహదారిపై లెక్కకు మించి స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి డిచ్‌పెల్లి వరకు ప్రయాణం సాఫీగా సాగినా.. అక్కడి నుంచి బాసర వరకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలుగు వరుసల జాతీయరహదారిపై హైదరా బాద్ నుంచి డిచ్పెల్లికి చేరుకునేందుకు తక్కువ సమయంలోనే వస్తున్నారు. అయితే డిచ్‌పెల్లి నుంచి బాసర చేరుకునేందుకు రెండు గంటల సమయం పడుతుండడం గమనార్హం. నిజామాబాద్ నుంచి భైంసా వరకు ఉన్న 65 కిలోమీటర్ల రోడ్డును విస్తరించకపోడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ మార్గంపై అందుకు తగ్గట్లు రోడ్డు విస్తరణ చేయలేదు. పైగా గ్రామాల్లో నుంచి వెళ్లే ఈ రోడ్డు గుండా ప్రమాదాలు జరుగకుండా స్థానికులు ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడుతుంది. రెండు జిల్లాలను కలిపే ఈ రహదారి నాణ్యత ప్రమాణాలు కొరవడడంతో తరచూ చెడిపోయి ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. రహదారి నిర్మిస్తే... గతేడాది జనవరిలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి ప్రకటించిన విధంగా హైదరాబాద్–నర్సాపూర్–బాసర–భైంసా వరకు 230 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మిస్తే ఇబ్బందులు దూరమవుతాయి. రహదారి విస్తీర్ణం మెరుగై రాష్ట్రవ్యాప్తంగా బాసరకు వచ్చే భక్తులకు ఏ ఇక్కట్లు ఉండవు. కొత్తగా నిర్మించబోయే ఈ జాతీయ రహదారి నుంచి నేరుగా బాసరకు చేరుకోవ చ్చు. పైగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుం చి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి బాసరకు చేరుకునే వీలు ఉంటుంది. జిల్లావాసులకు సౌకర్యం.... ఇప్పటికే డివిజన్ కేంద్రమైన భైంసా మీదుగా 61వ జాతీయ రహదారి నిర్మాణం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే నిర్మల్ – కళ్యాణి(ముంబాయి) జాతీయ రహదారిని ని ర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. జిల్లా కేంద్రమైన నిర్మల్ నుంచి తానూరు మండలం బెల్తరోడ వరకు 55కిలోమీటర్ల రోడ్డును రూ. 200 కోట్లతో నిర్మించారు. తానూరు మండలం బెల్తరోడ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వర కు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే బాసర వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో ఇబ్బందులు దూరమవుతాయి. ఇప్పటికే బాసర వచ్చే భక్తులు భైంసా చేరుకుని 61వ జాతీయరహదారి నుంచి నిర్మల్ వెళ్లి అక్కడి నుంచి 44వ జాతీయ రహదారిపై ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకుంటున్నా రు. ఇప్పటికే భైంసా డివిజన్‌కు 44, 61 జాతీయ రహదారులు అనుసంధానమయ్యాయి. నూతనంగా హైదరాబాద్ నుంచి భైంసా వరకు నిర్మిం చే కొత్త జాతీయ రహదారి అనుసంధానంతో ఇటు బాసరతోపాటు డివిజన్ ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు దూరంకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. భైంసా డివిజన్వ్యాప్తంగా చాలా గ్రామాలకు కొత్తగా రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర మీదుగా హైదరాబాద్ నుంచి భైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణానికి గాను సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1800 కిలోమీటర్ల మేర 12 మార్గాల్లో నిర్మించే జాతీయ రహదారుల్లో హైదరాబాద్– నర్సాపూర్– బాన్సువాడ–బోదన్–భైంసా వరకు 230 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగనుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత అవకాశం ఉంది. – గడ్డిగారి విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే