ఏడాదిగా ఎదురుచూపు
► జాతీయ రహదారి నిర్మాణంపై జిల్లావాసుల ఆశలు
► గతేడాది జనవరిలోనే ప్రకటించిన కేంద్రమంత్రి గడ్కరీ
► ‘హైదరాబాద్– భైంసా’పూర్తయితే.. బాసరకు మెరుగుకానున్న రవాణాసేవలు
భైంసా(ముథోల్): దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో బాసర సరస్వతీ ఆలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చదువుల తల్లి కొలువైన ఈ ప్రాంతానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే ఇక్కడే ఉన్న ట్రిపుల్‌ఐటీలో రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చిన విద్యార్థులు చదువుతున్నారు. బాసర పుణ్యక్షేత్రానికి ఆనుకుని గోదా వరి ప్రవహిస్తోంది. నదిపై బాసర వద్ద రైలు, వాహనాలు వెళ్లేందుకు రెండు వేర్వేరు వంతెనలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరకు హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి నిర్మిస్తామని గతేడాది జనవరిలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు గాను 1800 కిలోమీటర్ల పొడవైన 12 మార్గాలను జాతీయ రహదారులు గా మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు.
అం దులో నిర్మల్‌జిల్లాకు సైతం అవకాశం దక్కింది. హైదరాబాద్– నర్సాపూర్– మెదక్– ఎల్లారెడ్డి–బాన్సువాడ–బోదన్–బాసర– భైంసా వరకు 230 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించనున్నట్లు తెలిపారు. ఏడాదిగా నిర్మల్ జిల్లావాసులు ఈ జాతీయ రహదారి విస్తరణ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే బాసరకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని ఇక్కడి వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఇబ్బందులే...
బాసరకు చేరుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాలోని భైంసా వరకు 65 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని పొడవైన రోడ్డు మార్గం ఉంది. రెండు జిల్లాలను కలిపే ఈ రహదారి అధ్వానంగా ఉంది. భైంసా నుంచి నిజామాబాద్ వరకు ఉన్న ఈ మార్గంలో నిజాం కాలంలో నిర్మించిన వంతెనలు ఉన్నా యి.ప్రస్తుతం బాసర మండలం బిద్రెల్లి గ్రామం వద్ద వాగుపై కొత్తవంతెన నిర్మిస్తున్నారు.
ఇక నిజామాబాద్ జిల్లాలో యంచ గ్రామం నుంచి సారంగాపూర్ వరకు ఉన్న రహదారిపై లెక్కకు మించి స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి డిచ్‌పెల్లి వరకు ప్రయాణం సాఫీగా సాగినా.. అక్కడి నుంచి బాసర వరకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలుగు వరుసల జాతీయరహదారిపై హైదరా బాద్ నుంచి డిచ్‌పెల్లికి చేరుకునేందుకు తక్కువ సమయంలోనే వస్తున్నారు. అయితే డిచ్‌పెల్లి నుంచి బాసర చేరుకునేందుకు రెండు గంటల సమయం పడుతుండడం గమనార్హం. నిజామాబాద్ నుంచి భైంసా వరకు ఉన్న 65 కిలోమీటర్ల రోడ్డును విస్తరించకపోడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్న ఈ మార్గంపై అందుకు తగ్గట్లు రోడ్డు విస్తరణ చేయలేదు. పైగా గ్రామాల్లో నుంచి వెళ్లే ఈ రోడ్డు గుండా ప్రమాదాలు జరుగకుండా స్థానికులు ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడుతుంది. రెండు జిల్లాలను కలిపే ఈ రహదారి నాణ్యత ప్రమాణాలు కొరవడడంతో తరచూ చెడిపోయి ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతున్నాయి.
రహదారి నిర్మిస్తే...
గతేడాది జనవరిలో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి ప్రకటించిన విధంగా హైదరాబాద్–నర్సాపూర్–బాసర–భైంసా వరకు 230 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మిస్తే ఇబ్బందులు దూరమవుతాయి. రహదారి విస్తీర్ణం మెరుగై రాష్ట్రవ్యాప్తంగా బాసరకు వచ్చే భక్తులకు ఏ ఇక్కట్లు ఉండవు. కొత్తగా నిర్మించబోయే ఈ జాతీయ రహదారి నుంచి నేరుగా బాసరకు చేరుకోవ చ్చు. పైగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుం చి వచ్చే భక్తులు ఈ మార్గం నుంచి బాసరకు చేరుకునే వీలు ఉంటుంది.
జిల్లావాసులకు సౌకర్యం....
ఇప్పటికే డివిజన్ కేంద్రమైన భైంసా మీదుగా 61వ జాతీయ రహదారి నిర్మాణం కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే నిర్మల్ – కళ్యాణి(ముంబాయి) జాతీయ రహదారిని ని ర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. జిల్లా కేంద్రమైన నిర్మల్ నుంచి తానూరు మండలం బెల్‌తరోడ వరకు 55కిలోమీటర్ల రోడ్డును రూ. 200 కోట్లతో నిర్మించారు. తానూరు మండలం బెల్‌తరోడ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వర కు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే బాసర వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో ఇబ్బందులు దూరమవుతాయి.
ఇప్పటికే బాసర వచ్చే భక్తులు భైంసా చేరుకుని 61వ జాతీయరహదారి నుంచి నిర్మల్ వెళ్లి అక్కడి నుంచి 44వ జాతీయ రహదారిపై ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకుంటున్నా రు. ఇప్పటికే భైంసా డివిజన్‌కు 44, 61 జాతీయ రహదారులు అనుసంధానమయ్యాయి. నూతనంగా హైదరాబాద్ నుంచి భైంసా వరకు నిర్మిం చే కొత్త జాతీయ రహదారి అనుసంధానంతో ఇటు బాసరతోపాటు డివిజన్ ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు దూరంకానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. భైంసా డివిజన్‌వ్యాప్తంగా చాలా గ్రామాలకు కొత్తగా రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర మీదుగా హైదరాబాద్ నుంచి భైంసా వరకు జాతీయ రహదారి నిర్మాణానికి గాను సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1800 కిలోమీటర్ల మేర 12 మార్గాల్లో నిర్మించే జాతీయ రహదారుల్లో హైదరాబాద్– నర్సాపూర్– బాన్సువాడ–బోదన్–భైంసా వరకు 230 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగనుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత అవకాశం ఉంది.
– గడ్డిగారి విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే