నిరుపయోగంగా ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్సులు
సాక్షి, భైంసా: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడమే ధ్యేయంగా వివిధ పథకాలను ప్రవేశపెడుతున్న ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలను కల్పించడంలో విఫలమవుతోంది. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. బాక్సులు ఉన్నా అందులో మందులు ఉండవు. భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో మందులు మచ్చుకైనా కనిపించవు. ఫస్ట్ ఎయిడ్ బాక్సు లు ఉన్నా నామమాత్రంగా కనిపిస్తున్నాయి.
పేరుకే ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స చేసేందుకు వీటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాని బస్సులలో ఫ స్ట్‌ఎయిడ్ బాక్సులు కనిపిస్తున్నప్పటికీ అందులో మందు లు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. దీన్ని చూసిన ప్రయాణీకులు పేరుకే ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు ఉన్నాయని చర్చించుకుంటున్నారు. కొన్ని బస్సులలో ఫస్ట్‌ఎయిడ్ బాక్సులు కనిపించడం లేదు. ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేసినప్పుడు ఎఫ్‌సీ కోసం నామమాత్రంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు సైతం బస్సు రిజస్ట్రేషన్ చేసే సమయంలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కాని అందులో మందులు ఉన్నాయా లేదో పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ఏర్పాటు చేసి అందులో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment