సాక్షి, చేవెళ్ల: అతివేగం, అజాగ్రత్త ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. పలువురికి గాయాలవగా.. నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చేవెళ్ల మండలంలోని కేసారం బస్‌స్టేజీ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తల్లీకూతుళ్లతో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు, బాదితులు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్‌లోని లింగపల్లి మయూరినగర్‌కు చెందిన భార్యభర్తలు రవికుమార్, స్రవంతి(30) తమ ఇద్దరు కూతూళ్లు మోక్ష, ధ్రువిక(5)తో కలిసి ఆల్టో కారులో హైదరాబాద్ నుంచి తాండూరు (కరన్‌కోట్) వెళ్తున్నారు. రవికుమార్ తాండూరు సమీపంలోని సిమెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఉదయం ఫ్యాక్టరీకి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్నాడు. చేవెళ్ల మండలంలోని కేసారం గేట్‌వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవా.. వీరి ముందున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు రోడ్డు పక్కకు వెళ్లిఆగిపోయింది. అదే వేగంతో ఉన్న ఇన్నోవా.. స్విఫ్ట్ వెనకాలే వస్తున్న రవికుమార్ ఆల్టో కారును ఢీకొట్టింది. దీంతో ఆల్టో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టగా.. ఇన్నోవా కారు రోడ్డుపై బోల్తాపడింది. బోల్తాపడిన ఇన్నోవా కారును ఆ వెనకాలే వస్తున్న మరో ఇన్నోవా కారు ఢీకొట్టినా.. ఇందులో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదమేమీ జరగలేదు. ఆల్టోలో ఉన్న రవికుమార్‌తో పాటు మోక్షకు తీవ్రగాయాలయ్యాయి. పక్కసీట్లో కూర్చున్న స్రవంతి, ధ్రువిక కారులోనే ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందారు.
చదవండి: మాదాపూర్: ‘ఓయో’పై దాడి.. 8 మంది అరెస్ట్
బోల్తాపడిన ఇన్నోవా కారులో సయ్యద్ ఫైజల్(21) తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఇందులో ప్రయాణిస్తున్న యువకులు జాఫర్, అలీ, రిజ్వాన్, అన్వర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడనుంచి పలువురు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: గచ్చిబౌలి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్ చేసి..
పార్టీకోసం వెళ్లి..
ఇన్నోవాకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు ఆదివారం చేవెళ్లలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకోసం హాజరయ్యారు. రాత్రి అక్కడే ఉండి విందు చేసుకుని, ఉదయాన్నే హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
బర్త్ డే కోసం వచ్చి..
రవికుమార్ చిన్న కూతురు ధ్రువిక పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఉండే తల్లిదండ్రులు, అత్తామామల వద్దకు వచ్చాడు. హైదరాబాద్‌లోని మయూరినగర్‌లోని లింగంపల్లి వీరి స్వస్థలం. ఉద్యోగ రీత్యా తాండూరులో ఉంటున్న రవికుమార్ కూతురు పుట్టిన రోజు వేడుకల కోసం శనివారం తమ తల్లిదండ్రులు ఉండే లింగపల్లి చేరుకున్నారు. ఆదివారం చార్మినర్ ప్రాంతంలోని అత్తగారి ఇంటికి వెళ్లి అక్కడ రాత్రి ఉన్నారు. తిరిగి సోమవారం ఉదయం ఉద్యోగంకోసం తాండూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రవికుమార్, పెద్ద కూతురు మోక్షలు గాయాలతో బయటపడగా.. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని వెళ్తున్న చిన్న కూతురు ధ్రువిక, భార్య మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment