Self-sufficiency
-
బొమ్మల కొలువు
పండుగకు బొమ్మలను కొలువుదీర్చడం లేదామె. బొమ్మల తయారీ ‘కొలువు’ను పండగ చేస్తున్నారు. బొమ్మలతో ‘చక్కటి కొలువు’కు మార్గం వేస్తున్నారు. మన బొమ్మల నుంచి మన చేనేతల వరకు... సంప్రదాయ కళల పురోగతికి బాట వేస్తున్నారామె. ‘‘కళకు రాజపోషణ అవసరమే. కానీ కళ జీవించాల్సింది కేవలం దాతల దయాదాక్షిణ్యాల మీద మాత్రమే కాదు. కళ స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే ఆ కళకు గుర్తింపు, కళాకారులకు గౌరవం లభిస్తాయి’’ అన్నారు చిత్రాసూద్. ఆమె హైదరాబాద్‌లో కార్పొరేట్రంగంలో ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేస్తున్నారు. సమాజానికి చేయాలనుకున్న పనులను ఒక సుమహారంగా మలుచుకున్నారు. తన ప్రవృత్తిలో భాగంగా గొల్లభామ చీరలు, బొబ్బిలి నేత, ఇకత్ లక్ష వత్తుల చీర వంటి తెలుగు వారి సిగ్నేచర్ వీవింగ్‌కు సహజ రంగులను మేళవిస్తున్నారు. కొండపల్లి బొమ్మల కళాకారులు వృత్తిని వదిలి ఇతర ఉపాధి మార్గాల వైపు మరలుతున్న పరిస్థితిని గమనించి ఆ కళను పరిరక్షించే పనిలో పడ్డారామె. ఆ వివరాలతోపాటు తాను ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన పరిస్థితులను సాక్షితో పంచుకున్నారు చిత్రాసూద్. తమిళనాడు నుంచి తెలంగాణకు ‘‘మా పూర్వికులది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి. అమ్మవైపు విశాఖపట్నం. ఇరువైపుల కుటుంబాలూ తమిళనాడులో స్థిరపడ్డాయి. నాన్న కుటుంబం చెన్నైలో, అమ్మ వాళ్లు మధురైలో. అలా నేను పుట్టిన ప్రదేశం మధురై, పెరిగింది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి వచ్చేశాం. ఆ తర్వాత స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్థిరపడ్డారు. అలా నా చదువు సింగరేణిలో, పాల్వంచలో సాగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... నేను నా బాల్యంలోనే నాగరక భారతాన్ని, గ్రామీణ భారతాన్ని దగ్గరగా చూడగలిగాను. అప్పట్లో తలెత్తిన అనేక సందేహాలే ఇప్పుడు నేను చేస్తున్న పనుల కారకాలు. గ్రామీణ మహిళలు, పిల్లల్లో చైతన్యం లేకపోవడం, చదువు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం అప్పట్లో నాలో ఆలోచనను రేకెత్తించేవి, కానీ వాటిని ఎలా పరిష్కరించాలో తెలియదు. అలాగే నా తొలి ఉద్యోగంలో నేను చూసిన పరిస్థితులు కూడా ఆందోళనకరమైనవే. అది హైదరాబాద్ శివారులో ఉన్న కెమికల్ ఇండస్ట్రీ. ఆ జిలెటిన్ తయారీ పరిశ్రమలో ఏడెనిమిదేళ్ల పిల్లలు పని చేసేవాళ్లు. పొడులను జల్లెడ పట్టడం వంటి పనిని ఆటలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్లు. తామెంత విపత్కరమైన పని చేస్తున్నారనేది తెలియని అమాయకత్వం వారిది. నా చదువు నా ఉన్నతికి మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా ఏదైనా చేయాలని గట్టిగా అనిపించిన సందర్భం కూడా అదే. నాలో అస్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఒక రూపాన్ని ఇవ్వడం పదేళ్ల కిందట మొదలైంది. చదువులో రాణిస్తూ ఉన్నత చదువులకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో సమాజానికి మా వంతు చారిటీ మొదలు పెట్టాం. ఆ టాస్క్‌లో మా హస్బెండ్ అనిల్ సూద్ సహకరిస్తున్నారు. చేనేతల్లో నాచురల్ కలర్స్ వాడకం, కొండపల్లి బొమ్మల కళ పరిరక్షణలో ‘అభిహార’ సంస్థ నిర్వాహకురాలు చిత్ర అనుభవాన్ని కలుపుకుని ముందుకుపోతున్నాను. కళలో సామాజిక మార్పు! ఏ కళలనైనా దాతల సహకారంతో ఎంతకాలమని పరిరక్షించగలం? కళ తనకు తానుగా స్వయంసమృద్ధి సాధించాలి. అప్పుడే కళకు, కళాకారులకు గౌరవం. అందుకే మహిళలకు శిక్షణ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇవ్వడంతోపాటు మార్కెట్ సౌలభ్యత కోసం పని చేస్తున్నాను. కొండపల్లిలో ఉండే మహిళలను తీసుకువచ్చి హైదరాబాద్‌లోని సప్తపర్ణిలో ఎగ్జిబిషన్ పెట్టించడంలో నా ఉద్దేశాలు రెండు నెరవేరాయి. ఒకటి గ్రామీణ మహిళలకు తమ బొమ్మలకు ప్రపంచంలో ఉన్న ఆదరణ ఎలాంటిదో తెలియాలి, అలాగే కొనేవాళ్లు ఏం కోరుకుంటున్నారో అర్థం కావాలి. అలాగే ఒక అద్భుతమైన కళను సంపన్నుల లోగిళ్లను చేరగలిగితే ఆ కళకు రాజపోషణకు దారి వేసినట్లే. ఈ రెండూ సాధ్యమయ్యాయి. ఎప్పుడూ చేసే దశావతారాలు, ఎడ్లబండ్ల నుంచి కళాకారుల నైపుణ్యాన్ని టేబుల్ టాప్స్, మొబైల్ ఫోన్ స్టాండ్ వంటి రోజువారీ వాడుక వస్తువుల తయారీకి విస్తరించగలిగాం. అలాగే ఒక కళ ఆవిర్భవించినప్పుడు అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఒక రూపం సంతరించుకుని ఉంటుంది. ఆ రూపాలను కాలానుగుణంగా మార్చుకోవాలి. అందుకే కళను ధార్మికత పరిధి నుంచి సామాజిక పరిధికి విస్తరించాల్సిన అవసరాన్ని నేర్పిస్తున్నాం. ఈ బొమ్మలను లాంకో కంపెనీ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వ హస్తకళాకృతుల సంస్థలు లేపాక్షి, గోల్కొండలు పెద్ద ఆర్డర్లతో ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఏమిటంటే... కళను పరిరక్షించడం అనేది పెద్దమాట. కళ ద్వారా ఉపాధి పొందడం ప్రధానం. అప్పుడే కళ కలకాలం నిలుస్తుంది, కళాకారులు తమ ఉనికిని గర్వంగా చాటుకోగలుగుతారు. నా సర్వీస్‌తో ఎన్ని కుటుంబాలు, ఎన్ని కళారూపాలు స్వయంసమృద్ధి సాధించాయనేది నాకు మిగిలే సంతృప్తి’’ అన్నారు చిత్రాసూద్. వృత్తులకు, కళలకు ఇల్లే యూనివర్సిటీగా ఉండేది. పుస్తకం–కలం లేకుండానే విస్తృతమైన జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అయ్యేది. కాలం మారింది, ప్రపంచీకరణ మన సంప్రదాయ వృత్తులను కాలగర్భంలో కలిపేస్తున్న తరుణంలో మన కళల జ్ఞానాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. దానికి శాస్త్రబద్ధత కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఈ సైన్స్ ఏ పుస్తకంలోనూ లేదు! కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రానికి అనుబంధంగా సహజ రంగుల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సొరకాయ ఆకులతో చెక్కకు రంగు అద్దవచ్చని ఇంతవరకు ఏ పుస్తకమూ చెప్పలేదు. కొండపల్లి బొమ్మల కళాకారులకు మాత్రమే తెలిసిన సైన్స్ అది. ఇక చేనేతల్లో గొల్లభామ, బొబ్బిలి, ఇకత్ చీరల్లలోనూ నేచురల్ కలర్స్ ప్రయోగం మొదలైంది. ఈ రంగాల్లో ఉన్న జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడం కూడా మా తదుపరి ప్రాజెక్టుల్లో ఒకటి. భూమండలాన్ని ప్రమాదం అంచుల్లోకి నెట్టివేస్తున్న కారకాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కాలుష్యం ప్రధానమైనది. అందుకే మనవంతుగా కొన్ని అడుగులు వేయగలిగితే, మరికొందరి చేత వేయించగలిగితే... ఆ తర్వాత ఈ నేచర్ మూవ్మెంట్ దానంతట అదే ముందుకు సాగుతుంది. – చిత్రాసూద్, యాక్టివిస్ట్, రివైవల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కో – ఫౌండర్, అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ‘మహిళ’ శ్రమ చర్చకే రాదు! మహిళ స్థితిగతులు మారాలంటే ఆర్థిక స్వావలంబన సాధించాలనేది జగమెరిగిన సత్యం. మన వ్యవస్థలన్నింటిలోనూ మహిళలను సహాయక పనులకే పరిమితం చేయడంతో వారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు. మహిళలకు కూడా ఆర్టిజన్ కార్డ్ ఇప్పించడానికి పని చేస్తున్నాను. అలాగే వేతనపెంపు విషయంలో మహిళల పని గురించి చర్చ కూడా ఉండడం లేదు. ఎంతగా శ్రమించినప్పటికీ మహిళకు గుర్తింపు ఉండదు, ఆదాయం తక్కువ. ఈ పరిస్థితిని మార్చడానికి ‘అభిహార’ అనే వేదిక ద్వారా పని చేస్తున్నాను. కొండపల్లి బొమ్మలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తోంది. ఏపీ ప్రాథమిక పాఠశాలల్లో బోధన పరికరాలు కొండపల్లి కళాకృతులే. నేను హార్టికల్చర్ విద్యార్థిని కావడంతో నాకు తెలిసిన సైన్స్‌ని హస్తకళల రంగానికి మేళవిస్తున్నాను. హస్తకళల రంగంలో విశేషమైన కృషి చేస్తున్న ఉజ్రమ్మ, సురయ్యా హసన్బోస్, జగదరాజప్పలు నాకు గురువులు. నా ఆకాంక్షలు, చిత్ర ఆలోచనలు ఒకే తీరుగా సాగడంతో మా ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. – సుధారాణి ముళ్లపూడి, సీఈవో, అభిహార సోషల్ ఎంటర్ప్రైజ్ – వాకా మంజులారెడ్డి -
NITI Aayog governing council: జీఎస్టీ వసూళ్లు పెరగాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్‌గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమావేశానికి రాలేదు. రాష్ట్రానికో జీ20 టీమ్ నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలేమన్నాయంటే... వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు. చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్సుమన్ బెరీ అన్నారు. కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. -
స్థానిక ఉత్పత్తులే కొనండి
అహ్మదాబాద్: భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రజలంతా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 25 ఏళ్ల పాటు ఇలా స్థానిక ఉత్పత్తుల్నే కొంటే దేశంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్నారు. ‘‘స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరిగితే అందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి. అందుకోసమే వోకల్ ఫర్ లోకల్ పథకం తెచ్చాం’’ అని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ స్వయంసమృద్ధిని సాధనకు కృషి చేస్తున్నందున మనం కూడా అదే బాటన ముందుకెళ్లాలన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా గుజరాత్‌లోని మోర్బిలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. దేశం నాలుగు దిక్కులా హనుమంతుడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన హనుమాన్జీ చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాన సిమ్లాలో 2010లో ఇలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. దక్షిణాన రామేశ్వరంలో సన్నాహాలు సాగుతున్నాయి. 3 రోజులు గుజరాత్‌కు మోదీ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో సోమవారం నుంచి మోదీ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని పీఎం కార్యాలయం వెల్లడించింది. అల్లర్లపై మాట్లాడరేం? శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. విద్వేష ప్రసంగాలు, మతహింస ఘటనలపై ఆయన స్పందించకపోవడం దారుణమంటూ సోనియాగాంధీ (కాంగ్రెస్), శరద్‌పవార్ (ఎన్సీపీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), ఎంకె స్టాలిన్ (డీఎంకే) సహా 13 విపక్ష పార్టీల అధ్యక్షులు ధ్వజమెత్తారు. శనివారం వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మతఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతి, సహనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఖండించకపోతే ఆయన మౌనాన్ని మద్దతుగా తీసుకుని మత విద్వేషకులు మరింత రెచ్చిపోతారన్నారు. ఇలాంటి కుట్రదారులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
డ్రెస్ ఫర్ సక్సెస్..: విజయానికి కావాలి ఓ డ్రెస్!
వివిధ రంగాలలో ‘ఆమె’ స్థానం మహోన్నతంగా ఎదుగుతోంది. దానికి తగినట్టు ‘ఆమె’ ఆహార్యం మారుతోంది. స్థానిక, భాష, సంస్కృతులకు భిన్నంగా ఉద్యోగిగా ‘ఆమె’కు సరైన డ్రెస్ ఉండాలి. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వృత్తిపరమైన వస్త్రధారణ ‘ఆమె’కు తప్పనిసరి అవసరం అంటోంది ‘డ్రెస్ ఫర్ సక్సెస్’. లాభాపేక్షలేని ఈ సంస్థ పుట్టింది అమెరికాలోనే అయినా ప్రపంచంలోని పాతిక దేశాలకుపైగా విస్తరించింది. ఎదుగుతున్న మహిళకు ‘డ్రెస్’ అవసరం కొత్తగా పరిచయం చేస్తోంది. వృత్తి, ఉద్యోగాలలో సరైన వస్త్రధారణ మహిల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. ‘ఇంటర్వ్యూల సమయంలో వస్త్రధారణ కారణంగా పెరిగే ఆత్మవిశ్వాసాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. పనికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మన ఆహార్యం ద్వారా తెలిజేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆఫీసు పనిలో మరిన్ని విజయాలు, అవకాశాలను సొంతం చేసుకోగలరు’ అంటున్నారు ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ నిర్వాహకులు. మిలియన్లకు పైగా మహిళలు డ్రెస్ ఫర్ సక్సెస్ సంస్థ కార్యకలాపాలను న్యూయార్క్ నగరంలో 1997లో ప్రారంభించారు. ఆస్త్రేలియా, ఇటలీ, మెక్సికో, నెదర్లాండ్స్, పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్, నేపాల్, నైజీరియా, సింగపూర్... మొదలైన 25 దేశాలలో దాదాపు 150 నగరాలకు విస్తరించి, 1.2 మిలియన్లకు పైగా మహిళలు స్వయం సమృద్ధి సాధించడంలో సహాయపడింది. ‘మీ దుస్తులు ఎలా విరాళంగా ఇవ్వచ్చు. సంస్థకు ఎలా మద్దతు ఇవ్వవచ్చు, వాలంటీర్‌గా పాల్గొనడం లేదా ఇతర మార్గాల్లో సహాయం ఇవ్వచ్చు’ అనే విషయాల్లోనూ సంస్థ వెబ్సైట్ ద్వారానూ స్పష్టం చేస్తుంది. ఘన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మహిళ విజయం కోసం పనిచేసే ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ ప్రధాన కేంద్రం న్యూయార్క్‌లో ఉంది. ఇది గ్లోబల్ అనుబంధ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది. నాన్సీ లుబ్లిన్ అనే న్యాయశాస్త్ర విద్యార్థిని 1996లో తన ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన 5 వేల డాలర్లను వేలాది మందికి ఉపయోగపడేలా చేయాలనుకుంది. మన్‌హట్టన్‌లోని ఒక చర్చి నేలమాళిగలో ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ని స్థాపించింది. ఆ బేస్మెంట్ బోటిక్ నుంచి ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ మిషన్ ఉత్తర అమెరికా అంతటా కొద్ది కాలంలోనే వ్యాపించి, ఆపై ప్రపంచమంతటా విస్తరించింది. ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో మహిళలందరూ వారి స్థానం, భాష, ఆచారాలు లేదా సంస్కృతితో సంబంధం లేకుండా ఎదుర్కొనే సవాలు ఇది అని డ్రెస్ ఫర్ సక్సెస్ నిరూపిస్తుంది. ‘ప్రతి యేటా 14,000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు, పురుషులు తమ సమయాన్ని, ప్రతిభను మా అనుబంధ సంస్థలకు ఉదారంగా విరాళంగా ఇస్తున్నారు’ అంటున్నారు నిర్వాహకులు. రెజ్యూమ్లతోనూ సాయం చాలా మంది మహిళలు పేదరిక స్థాయి లేదా దిగువ స్థాయిలోనే జీవిస్తున్నారు. ‘ఆమె’ తన జీవితంలో కొత్త పునాదిని నిర్మించుకోవడానికి సంస్థ చేదోడుగా ఉంటుంది. బాధిత మనస్తత్వాన్ని విజయంగా మార్చడంలో సహాయపడుతుంది. రెజ్యూమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో, ఇంటర్వ్యూలలో ఎలా పాల్గొనాలో కూడా సహాయం చేస్తుంది. ‘నా జీవితం నిజంగా అద్భుతమైనది. వాళ్లు నా కోసం చాలా చేశారు. సక్సెస్ కోసం డ్రెస్, షూస్, మంచి సూట్ ధరిస్తే నేను చాలా అందంగా కనిపిస్తానని తెలియజేశారు. ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉన్నాననే నమ్మకం నాకు కలిగింది. ఇది చాలా అద్భుతంగా ఉంది’ అంటారు ఈ సంస్థ నుంచి సాయం పొందిన మహిళ సోని. ప్రపంచంపై మీదైన ముద్ర వేయడానికి ఒక కొత్త అవకాశాన్ని జోడిస్తుంది డ్రెస్ ఫర్ సక్సెస్. ‘యువర్ అవర్, హర్ పవర్’ క్యాంపెయిన్‌తో ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి వేతనంలో ఒక గంట లేదా అంత కంటే ఎక్కువ సమయంలో పొందే మొత్తాన్ని విరాళంగా ఇవ్వచ్చని కూడా సూచిస్తోంది. మీరు కనిపించే తీరును బట్టి ప్రజలు మీకు ప్రతిస్పందిస్తారు అనే ఆలోచనతో అన్ని దేశాల్లోనూ మహిళలకు ప్రియమైన నేస్తంగా మారుతోంది డ్రెస్ ఫర్ సక్సెస్. మహిళాభ్యుదయానికి పాటు పడే ఇలాంటి సంస్థలు మన ముంగిట్లోకీ రావాలని కోరుకుందాం. మతాలకు అతీతంగా ‘బొటిక్కు వచ్చిన క్లయింట్ తన వృత్తికి తగిన దుస్తులను ఎంచుకోవడం అనేది కష్టమైన ప్రక్రియ. ఆమె అభిరుచికి అనుగుణంగా సరైన ఎంపిక ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెబుతున్నారు వాలంటీర్ జైనాబ్. ‘ఆన్లైన్ ద్వారాను వారికి సరైన గైడెన్స్ ఇస్తుంటాం. ఇంటర్వ్యూ లేదా కొత్త ఉద్యోగానికి తగిన దుస్తులను ఎంచుకోవడంలో మహిళలకు సహాయం చేస్తుంటాను. మా అనుబంధ సంస్థల ఈవెంట్లలో కూడా పాల్గొంటుంటాను’ అని వివరిస్తారు జైనాబ్. గృహహింస కారణంగా బాధపడుతున్న మహిళల పరిస్థితిని అర్థం చేసుకొని, వారు కొత్త జీవితాన్ని పొందడానికి సహాయం చేయడంలోనూ, వారి విజయానికి పాటు పడటంలోనూ ఈ ప్రోగ్రామ్‌లు ఉపయోగపడతాయని వివరిస్తారామె. లాభాపేక్షలేకుండా.. పురుషాధిక్యత అధికంగా ఉన్న దేశాలపైన దృష్టి పెట్టింది డ్రెస్ ఫర్ సక్సెస్. అక్కడి అనుబంధ సంస్థల ద్వారా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడానికి, ఇమిగ్రేషన్ సేవలు, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు, విద్యా సంస్థలు, గృహ హింసతో బాధపడేవారికి షెల్టర్లతో సహా అనేక ఇతర లాభాపేక్షలేని సంస్థలతో కలిసి పని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఘనతను సొంతం చేసుకుంది డ్రెస్ ఫర్ సక్సెస్. ‘మహిళలందరూ ఉన్నతంగా మారడానికి పెద్ద కలలు కనాలని కోరుకుంటున్నాను. ఒకరినుంచి ఒకరు స్ఫూర్తి పొందాలి. మా ప్రాథమిక దృష్టి మహిళలకు శిక్షణ ఇవ్వడం మీదనే. దాని వల్ల వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం’ అంటున్నారు ఖాట్మండూలోని డ్రెస్ ఫర్ సక్సెస్ ఫౌండర్ అమృత. -
టెక్నాలజీలో స్వయం సమృద్ధి కావాలి
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగాలలో దేశం స్వయంసమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. చివరి అంచెవరకూ సర్వీసుల అందజేత, భారీ ఉపాధి కల్పనలో ఇవి కీలక పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విడివడి ఉండదని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో దగ్గరగా కనెక్టయి ఉండే రంగమని ‘సాంకేతిక ఆధార అభివృద్ధి’పై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం వేగవంత డెలివరీ, పౌరులకు సాధికారత కల్పిస్తున్న డిజిటల్ ఎకానమీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆధారితమై ఉన్నట్లు వివరించారు. సాధారణంగా టెలికమ్యూనికేషన్, అందులోనూ 5జీ టెక్నాలజీ ప్రధానంగా వృద్ధికి ఊతమివ్వడమేకాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించగలదని మోదీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 5జీ మొబైల్ సర్వీసులు ప్రారంభమయ్యేందుకు వీలుగా అవసరమైన స్పెక్ట్రమ్ వేలాన్ని 2022లో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వెబినార్‌లో ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని వివిధ శాఖల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. మెడికల్ పరికరాలపై టెక్నాలజీ కీలక పాత్ర పోషించే మెడికల్ పరికరాలను తయారు చేయడంపై దృష్టిపెట్టవలసి ఉన్నదని మోదీ వెబినార్‌లో గట్టిగా చెప్పారు. తద్వారా డిమాండుకు అనుగుణంగా పరికరాలను సరఫరా చేయగలమని తెలియజేశారు. దేశీ స్టార్టప్ పరిశ్రమకు ప్రభుత్వం వివిధ దశలలో సహకరిస్తుందని అభయమిచ్చారు. మేకిన్ ఇండియా ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాభివృద్ధి దగ్గర నుంచి తయారీ వరకూ అవాంతరాలు లేని పురోగతికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సైతం కాంగ్రెస్ నుద్దేశించి చేసిన తన ప్రసంగంలో స్వయం సమృద్ధి ప్రాధాన్యతను నొక్కి చెప్పినట్లు ప్రస్తావించారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న ప్రపంచ వ్యవస్థలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టడం ద్వారా ముందుకుసాగడం కీలకమని వ్యాఖ్యానించారు. దేశంలో తయారీ రంగానికి దన్నునిచ్చే బాటలో 14 కీలక రంగాలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రస్తావించారు. పౌర సేవలలో ఆప్టికల్ ఫైబర్ వినియోగం, ఈవేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ అంశాలలో ఆచరణసాధ్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. మౌలిక సదుపాయాల పురోగమనం టెక్నాలజీ ఆధారితమని, ప్రజా పంపిణీ వ్యవస్థ సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో కనెక్టయి ఉన్నదని వివరించారు. -
హిప్.. చిప్.. భారత్!
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా స్వీయ సమృద్ధి సాధించడమే కాకుండా, చైనా మార్కెట్‌పై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది. సెమీ కండక్టర్లు, డిస్ప్లే తయారీ, డిజైన్ కంపెనీలకు అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందించడం వల్ల.. ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి దారితీస్తుందని కేంద్రం పేర్కొంది. కేబినెట్ సమావేశం వివరాలను ఐటీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో సెమీ కండక్టర్లకు కీలక పాత్ర ఉందన్నారు. లక్ష్యాలు..: మూలధన, సాంకేతిక సహకారాన్ని ఈ పథకం కింద కంపెనీలు పొందొచ్చు. అర్హులైన దరఖాస్తులకు ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధుల సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్ప్లే ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్‌లు, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సెమీ కండక్టర్ డిజైన్లకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల (భూమి, నీరు, విద్యుత్తు, రవాణా, పరిశోధన సదుపాయాలు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం పనిచేయనుంది. కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్‌లు, రెండు డిస్ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిపాదిత పథకం కింద కనీసం 15 కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డిజైన్ అనుసంధాన ప్రోత్సాహక పథకం (డీఎల్ఐ) కింద ప్రాజెక్టు ఏర్పాటు వ్యయంలో 50 శాతాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, ఐదేళ్లపాటు విక్రయాలపై 6–4 శాతం మేర ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ‘‘దేశీయంగా 100 వరకు సెమీకండక్టర్ డిజైన్ ఫర్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్, చిప్సెట్లు, సిస్టమ్ ఆన్ చిప్స్, సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలకు మద్దతు లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి’’ అని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలిపింది. ఈ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి వీలుగా అంతర్జాతీయ నిపుణులతో సెమీకండక్టర్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. 1.35 లక్షల మందికి ఉపాధి వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం కింద దేశంలోకి 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. టాటా గ్రూపు ఇప్పటికే సెమీకండక్టర్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించగా.. వేదాంత గ్రూపు సైతం ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది. రెండు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ కంపెనీలు, రెండు డిస్ప్లే తయారీ కంపెనీలు ఒక్కోటీ రూ.30,000–50,000 కోట్ల స్థాయి పెట్టుబడులతో వచ్చే నాలుగేళ్లలో ముందుకు రావచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అంచనా వేస్తోంది. ఆవిష్కరణలు, తయారీకి ఊతం: ప్రధాని మోదీ సెమీకండక్టర్లకు సం బంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు, తయారీకి ఊతమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు మరింత మద్దతు న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. యూపీఐ, రూపే డెబిట్ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐతో రూ.2,000 వరకు చెల్లింపులపై అయ్యే వ్యయాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్ చెల్లింపులకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించారు. -
సంపూర్ణ ‘సహకారం’తో స్వయం సమృద్ధి
సాక్షి, అమరావతి: సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా, పరస్పర సహకారమే లక్ష్యంగా, సంపూర్ణ సహకారాన్ని పొందడమే ఉద్దేశంగా సహకార సంఘాల వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వయం సమృద్ధే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ ఇవి కొనసాగుతాయి. సహకార సంఘాల నుంచి సభ్యులు నగదును అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని.. సొంత కాళ్లపై నిలబడగలిగేలా చేసేందుకు ఈ వారోత్సవాలు తోడ్పడాలన్నది లక్ష్యం. గ్రామీణ యువత తమ సొంత సహకార సంఘాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా సహకార వ్యవస్థను పటిష్టం చేయొచ్చు. ఈ సంఘాల్లో ప్రజలు క్రియాశీల పాత్ర పోషించేలా చేసి, వారి పొదుపు మొత్తాలు ఏదో ఒక ఉత్పాదకతకు ఉపయోగపడేలా చేయడం కోసం ఈ సహకార ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. లక్ష్యం బాగానే ఉన్నా రానురాను ఈ సంఘాల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సహకార సంఘాల్లో మరింత మంది చేరేలా ప్రోత్సహించాలని సంకల్పించింది. సహకార వారోత్సవాల్లో భాగంగా.. సహకార సంఘాల ప్రయోజనాలు, వాటి పని తీరు మరింత మందికి చేరువయ్యేలా ప్రచారం చేస్తారు. తెలుసుకున్న సమాచారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు ఇతరులకు కూడా వివరిస్తుంటారు. సమాచార మార్పిడితో పాటు ఇతరులకు మనం ఎంతమేర ఉపయోగపడగలం అనే భావాన్ని ప్రోత్సహించడం చేస్తుంటారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైనందున వాటిని కూడా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలకు సూచించింది. రాష్ట్రంలో పరిస్థితి.. రాష్ట్రంలో సహకార సంఘాలు చట్టపరమైన హోదా కలిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా ఉంటున్నాయి. వీటి అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సహకార సంఘాల నియంత్రణకు రాష్ట్రంలో రెండు చట్టాలున్నాయి. ఒకటి.. 1964 చట్టాన్ని 2001లో సవరించారు. సహకార సూత్రాలకు అనుగుణంగా సహకార సంఘాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ నియంత్రణను కొంత వరకూ తగ్గించడమే దీని లక్ష్యం. రెండోది.. మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం.రాష్ట్రంలో సుమారు 67,268 సహకార సంఘాలున్నాయి. అవి.. వాటిలో రాష్ట్రస్థాయి సహకార సంఘాలు 10, కాగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 13, ప్రాథమిక సహకార సంఘాలు 2,037, పాల సహకార సంఘాలు 90, మార్కెటింగ్ సహకార సంఘాలు 13, గిరిజన సహకార సంఘం 1, చేనేత సహకార సంఘాలు 470, చక్కెర మిల్లుల సహకార సంఘాలు 10, సేవా రంగ సహకార సంఘాలు 1414, ఇతరత్రా సంఘాలు 63,210 ఉన్నాయి. అయితే వీటిలో పలు సంఘాలు పనిచేయడం లేదని ఇటీవలి ఆడిట్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. పీఏసీఎస్‌లను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం నడుంకట్టింది. నాబార్డ్ సహకారంతో ఈ ప్రక్రియ సాగుతోంది. -
ఏడాదికి రూ.లక్ష ఆదాయం!
సాక్షి, హైదరాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరిన్ని ప్రణాళికలు రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం వచ్చేటట్టు చర్యలు చేపట్టనుంది. ఈ లక్ష్యసాధనకు ‘లక్షపతి ఎస్‌హెచ్‌జీ మహిళ’అనే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వైవిధ్యరంగాల్లో జీవనోపాధి అవకాశాల కల్పన ద్వారా స్వయంసమృద్ధిని సాధించడం దీని ఉద్దేశం. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా రెండున్నర కోట్ల గ్రామీణ మహిళలకు లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఈ సంఘాలకు అవసరమైన సహకారం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దేశంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో భాగంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, ట్రాన్ఫర్మేషన్ రూరల్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులతో కలసి గత బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. మహిళలకు మరిన్ని జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చే అంశాలపై చర్చించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి వ్యవసాయం, అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటి అంశాల ద్వారా విభిన్న అవకాశాలను అందించి వార్షిక ఆదాయం కనీసం లక్ష రూపాయలు ఉండేలా చూడాలని అధికారులు నిర్ణయించారు. ఈ లక్ష్య సాధనకు స్వయంసహాయక బృందాలు, గ్రామీణ సంస్థలు, క్లస్టర్ స్థాయి సమాఖ్యలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఈ లక్ష్యసాధనలో పౌర సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర ప్రైవేట్ సంస్థల సహకారాన్ని తీసుకోనున్నారు. రాష్ట్రాలు ఈ దిశలో ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ సూచించింది. గ్రామీణ మహిళలకు మద్దతుగా.. జాతీయ జీవనోపాధి మిషన్ ద్వారా 6,768 బ్లాకుల్లో 70 లక్షల స్వయం సహాయక బృందాల ద్వారా 7.7 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ప్రారంభ పెట్టుబడిని అందించడంతోపాటు ఈ బృందాలకు ప్రతి ఏడాది రూ.80 వేల కోట్ల నిధులను సమకూరుస్తున్నారు. బ్యాంకుల నుంచి స్వయం సహాయక బృందాలు పెట్టుబడుల రూపంలో తీసుకున్న రుణాలను జీవనోపాధి అవకాశాల మెరుగుకు ఉపయోగిస్తుండటంతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. అయితే, గ్రామీణ ప్రాంత మహిళలు గౌరవప్రదంగా జీవించి సుస్థిర అభివృద్ధి సాధించడానికి వారి వార్షిక ఆదాయం లక్ష రూపాయలుగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది. లక్ష అనేది శుభప్రదంగా, స్ఫూర్తి కల్పించే విధంగా ఉంటుందని ‘లక్షపతి ఎస్‌హెచ్‌జీ మహిళ’కార్యక్రమానికి రూపకల్పన చేసింది. -
సుస్థిర అభివృద్ధికి పరిశోధనలు అవసరం
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని శాస్త్రవేత్తలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో శాస్త్ర పరిజ్ఞానానిది ముఖ్య పాత్ర అని నొక్కి చెప్పారు. దేశ సుస్థిర అభివృద్ధి, శ్రేయస్సుకు పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు ఎంతో కీలకం అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పుదుచ్చేరి నుంచి ఆమె వర్చువల్‌గా మాట్లాడారు. కొత్త ఆవిష్కరణల పేటెంట్ల దరఖాస్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఔషధ ముడిపదార్థాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి రావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే వాటిని ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. -
మేకింగ్ ఆఫ్ ఎ క్వీన్.. పచ్చళ్ల మహారాణి
నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోయింది. చెల్లిని తీసుకుని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది డుజోమ్. అక్కాచెల్లెళ్లు టీనేజ్ లోకి వస్తుండగా అమ్మమ్మ కూడా చనిపోయింది. మారుతల్లి ఉన్నా తల్లి కాలేకపోయింది. ఆమె దగ్గర కనాకష్టంగా బతికి ఇంటర్మీడియెట్ అవగానే రాజధాని ఇటానగర్ వెళ్లిపోయింది. అదే ఆమె జీవితానికి మలుపయింది. ఇప్పుడామె ‘పికిల్ క్వీన్’! పచ్చళ్ల సామ్రాజ్ఞి. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారులు ఇంకొకర్ని తమ దారి లోకి రానివ్వరు. కానీ డుజోమ్.. నిరుపేద గృహిణుల స్వయం సమృద్ధి కోసం వారికి పచ్చళ్ల మేకింగ్‌లో, మార్కెటింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. యదే డుజోమ్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా అమ్మమ్మ చనిపోవడంతో డుజోమ్, ఆమె చెల్లెలు మళ్లీ తండ్రి చెంతకే వారు చేరవలసి వచ్చింది. తండ్రి ఒక్కడే లేడు ఆ ఇంట్లో! ఇంకో ‘అమ్మ’ కూడా ఉంది. తనను, చెల్లిని ఆమె ఎంత హింసపెట్టిందో డుజోమ్ కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. డుజోమ్ ఇప్పుడు పచ్చళ్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ‘అరుణాచల్ పికిల్ హౌస్’ అంటే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో పెద్ద పేరు. అయితే పికిల్ హౌస్ ప్రారంభం రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా అటువైపే రాలేదు! ‘పికిల్ క్వీన్’గా ప్రసిద్ధి చెందిన డుజోమ్ తన వ్యాపారం గురించి మాత్రమే చూసుకోవడం లేదు. ఆర్థికంగా అసహాయులైన గృహిణులనూ చూసుకుంటోంది. వారిని చేరదీసి పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇస్తోంది. పచ్చళ్ల మార్కెటింగ్ గురించి టిప్స్ ఇస్తోంది. అలా ఇటానగర్‌లోని ఎందరో గృహిణులను గ్రూపులుగా చేసి, ఉపాధి నైపుణ్యాలను నేర్పిస్తోంది. అసలు ఇదంతా ఆమెకు ఎలా చేతనైనట్లు?! ‘‘జీవితంలో కష్టాలు తప్పవు. ఆ కష్టాల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికీ నిరాశ చెందకూడదు’’ అంటుంది డుజోమ్. డుజోమ్కు ఇప్పుడు 29 ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ‘అరుణాచల్ పికిల్ హౌస్’ను ప్రారంభించింది. ఈ నాలుగు నెలల్లో పికిల్ క్వీన్ అయింది! ∙∙ పినతల్లి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఈ పన్నెండేళ్లలో నెలకింతని డబ్బును దాచిపెట్టగలిగింది డుజోమ్. ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకుంది. లేబుల్ మేకింగ్ నేర్చుకుంది. పదార్థాలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుంది. పచ్చళ్ల తయారీ మెళకువలను మణిపుర్ వెళ్లిప్పుడు అక్కడ కొంతమంది మహిళల నుంచి శ్రద్ధగా గ్రహించింది. అరుణాచల్‌ప్రదేశ్ తిరిగొచ్చాక పచ్చళ్ల తయారీ పద్ధతులలో శాస్త్రీయంగా శిక్షణ పొందింది. ఆ క్రమంలో పికిల్ హౌస్ అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఎనిమిది మంది సిబ్బంది ఆమెకు చేదోడుగా ఉన్నారు. వారంతా గృహిణులు. లేమిలో, కుటుంబ సమస్యల కుంగుబాటులో ఉన్నవారు. వారిని పెట్టుబడి లేని భాగస్వాములుగా చేర్చుకుంది. అమ్మకాల వల్ల వస్తున్న లాభాలను వారికి పంచుతోంది. వ్యాపారాన్ని మరింతగా పెంచాలన్న ఆలోచనలో ఉంది. డుజోమ్ తనకు తానుగా వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్లను రుచికరంగా తయారు చేయడంలో నిపుణురాలు. ప్రత్యేకించి ఆమె పెట్టే.. చేపలు, పోర్క్, చికెన్, అల్లం, వంకాయ, కాప్సికమ్, బంగాళదుంప, పనస, ముల్లంగి నిల్వ పచ్చళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే డిమాండ్ కూడా. చెల్లెలు కూడా ఇప్పుడు ఆమెతోనే ఉంటోంది. ఇటానగర్ ఆమె అమ్మ తరఫు వారు ఉండే పట్టణం. అందుకనే డుజోమ్ అక్కడ స్థిరపడింది. -
స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్ స్థాయి పెరుగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచశాంతి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సుస్థిరంగా ఉండేందుకు ఇది సాయపడుతుందని పేర్కొన్నారు. రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి గురువారం ప్రధాని ప్రసంగించారు. రక్షణ సామర్థ్యాల్లో స్వావలంబన సాధించడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతం రక్షణ కల్పనలో భారత్ పాత్ర పెరుగుతుందన్నారు. వ్యూహాత్మక సంబంధాలను బట్టి పలు మిత్ర దేశాలకు రక్షణ సరఫరాదారుగా కూడా మారుతుందని తెలిపారు. ‘ప్రపంచదేశాల్లో భారత్ అతిపెద్ద రక్షణ వస్తువుల దిగుమతిదారుగా ఉంది. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు గతంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రక్షణ పరికరాల దిగుమతులపై విధించిన నిషేధంతో దిగుమతులకు అడ్డుకట్ట పడటంతోపాటు దేశీయ పరిశ్రమ బలోపేతం అవుతుంది. నిషేధం జాబితాలో మరిన్ని వస్తువులను కూడా త్వరలో చేరుస్తాం’అని తెలిపారు. నూతన విధానంతో దేశీయ ఉత్పత్తి పెరగడంతోపాటు ప్రైవేట్ రంగం సాయంతో సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆటోమేటిక్ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఉభయతారకంగా పనిచేస్తుందని వివరించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. దేశీయ సాంకేతికత, సామగ్రిని ఉపయోగించుకుని యుద్ధంలో పోరాడి, విజయం సాధించడానికి మించిన సంతృప్తి మన జవాన్లకు మరేదీ లేదన్నారు. తరువాతి తరం సైనిక సంపత్తి అభివృద్ధిలో దేశీయ పరిశ్రమతో కలిసి ముందుకు సాగుతామన్నారు. -
స్వయం సమృద్ధి.. స్వావలంబన
సాక్షి, న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు గజాల దూరం’మంత్రం ద్వారా ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరం నిబంధనను ప్రచారం చేయడం ముదావహమన్నారు. కరోనా కారణంగా చాలా మార్పులు వచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలు గతంలో బహిరంగంగా, వ్యక్తిగతంగా కలుస్తూ జరిగేవని, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నామని వివరించారు. సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులు కరోనాను కట్టడి చేయడంలో తాము చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ‘ప్రజలను అనుమానించడం, గౌరవించడం (సస్పెక్ట్.. రెస్పెక్ట్)’విధానాన్ని అవలంబించాలని ప్రధానికి జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక సర్పంచ్ సూచించారు. కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారని పుణెకు చెందిన యువ మహిళా సర్పంచ్ ప్రియాంకను ప్రధాని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, గ్రామంలోనే తయారు చేసిన మాస్క్‌లను ప్రజలకు పంపిణీ చేశామని, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ను అందించామని ఆమె వివరించగా, ప్రధాని ఆమెను ప్రశంసించారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ– గ్రామ స్వరాజ్’ పోర్టల్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ– ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది. -
పల్లెలు స్వయం సమృద్ధి సాధించాలి
అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం: సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ‘గ్రామజ్యోతి’ ప్రారంభం వరంగల్: ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ లక్ష్యంతోనే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని చెప్పారు. సోమవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘భారతీయులంతా వ్యక్తిగతంగా గొప్పవాళ్లే గానీ సంఘంగా మంచి పనులు చేయడంలో మాత్రం విఫలమైతున్నరు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే స్వయం సమృద్ధి సాధ్యం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఎన్నికలు, రాజకీయాలు, గొడవలు, విసుగులు పక్కనబెట్టి సమష్టిగా అభివృద్ధి చేసుకుందాం. మంచి చేసేటప్పుడు వ్యతిరేకించేవాళ్లు ఎప్పుడూ ఉంటరు. వాళ్లను పట్టించుకోకుండా ముందుకు పోవాలె. సంఘటితంలో గొప్ప శక్తి ఉంది. గంగదేవిపల్లిలా ఐక్యంగా ముందుకు పోతే వ్యతిరేక స్వభావులందరికీ సమాధానం చెప్పొచ్చు. బంగారు తెలంగాణ సాధించుకోవాలె. గ్రామాలన్నీ స్వయం సమృద్ధి సాధిస్తెనే అది సాధ్యం. ఊళ్లె ఎవరన్న ఉపాసంతోని ఉంటె ఊరికి ఇజ్జతి ఉంటదా? ఊళ్లో అందరు ఒకలా ఉండరు. కొందరు కొంత మీదికి, కొందరు కిందికి ఉంటరు. అందరు కలిసి ఉన్నంతలో మంచిగ బతికేలా ఒకరికొకరు సహకరించుకోవాలి. గ్రామంలో ఒకరికి చెప్పుల దుకాణం పెట్టించి అందరూ అక్కడే కొనుగోలు చేస్తే ఒకరికి ఉపాధి కలుగుతుంది. అలాగే ఓ ఆడ, మగకు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి ఊళ్లో అందరూ అక్కడే బట్టలు కుట్టించుకుంటే ఊరి అవసరాలు తీరుతయి. వారికి ఉపాధి ఉంటుంది. వ్యవసాయంలోనూ పద్ధతులు మారాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేందుకు డ్రిప్ బాగా ఉపయోగపడుతుంది. నేను రైతునే. అనుభవంతో చెబుతున్నా. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘ఎవరో ఏదో చేయాలనే భావన వద్దు. మనలో ఎంత శక్తి ఉందో ఆలోచిస్తలేం. గ్రామాన్ని చక్కగా పెట్టుకోవాలి. చాలా గ్రామాలు పరిశుభ్రత విషయంలో బాగా లేవు. గ్రామంలోని అందరూ కలిసి ఒక్క రోజు చీపురు పడితే చెత్త అనేది కనిపిస్తదా. సంఘటితంగా కదిలితే అన్ని జరుగుతయి. సంఘటితంగా అభివృద్ధి సాధిస్తున్న గంగదేవిపల్లి, అంకాపూర్(నిజామాబాద్ జిల్లా)ను అందరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడే బంగారు తెలంగాణ సాకారమైతది’’ అని పేర్కొన్నారు. గ్రామంపై వరాల జల్లు.. గంగదేవిపల్లిపై సీఎం వరాల జల్లు కురిపించారు. గ్రామంలో రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మోటారు లేని వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పించేలా చూస్తం. ఈ ఊరిలో ఇళ్లులేని పేదలు ఉన్నరు. 80 కుటుంబాలకు డబుల్బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నం. వీటిని వెంటనే మొదలుపెట్టండి. గంగదేవిపల్లికి ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తున్న. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ పని పూర్తి చేస్తరు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేస్తున్న. గ్రామంలోని పెద్ద కుంటను మిషన్ కాకతీయలో అభివృద్ధి చేస్తాం. రెండు చెక్ డ్యామ్‌లు నిర్మిస్తాం. గంగదేవిపల్లి వాసులు నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌ను సందర్శించాలి. రెండు బస్సులు ఏర్పాటు చేస్త. అందరు వెళ్లి రండి. ప్రగతి రిసార్ట్స్‌లో ప్రత్యేక మొక్కలు ఉన్నయి. వాటిని తెచ్చి పెడదాం. పరిసరాలను బాగా పెట్టుకుందాం. గంగదేవిపల్లి దోమలు లేని గ్రామం కావాలి. మొత్తానికి గంగదేవిపల్లి బంగారం కావాలి. ఏది చూసినా బాగుండాలి. చూసిరావాలిరా గంగదేవిపల్లి.. అనేట్లుగా ఉండాలి’’ అని అన్నారు. రాంపూర్ అభివృద్ధికి కోటి చెక్కు గంగదేవిపల్లి సభ అనంతరం ముఖ్యమంత్రి నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం మేడపల్లి-రాంపూర్‌లో జరిగిన గ్రామజ్యోతి సభలో మాట్లాడారు. యశోద హాస్పిటల్ నిర్వాహకులు గోరుగంటి రవీందర్రావు, సురేందర్‌రావు, దేవేందర్‌రావు తమ సొంతూరు రాంపూర్ అభివృద్ధి కోసం రూ.కోటి చెక్కును ఈ సభలో ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం 35 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. మేడపల్లి-రాంపూర్ అభివృద్ధి కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏడాదిలో మళ్లీ వస్తా.. ‘‘గంగదేవిపల్లికి నేను రాలే. ఈ ఊరి స్ఫూర్తి నన్ను రప్పించింది. 24 ఏళ్లుగా గ్రామస్తులు ఐక్యంగా చేస్తున్న కృషితో విదేశాల్లోనూ ఈ ఊరి శక్తి తెలిసింది. అంతర్జాతీయంగా గంగదేవిపల్లి ఆదర్శంగా నిలిచింది. అన్ని ఊళ్లు ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. ఒకరినొకరు మంచిగ పలకరించుకోవాలె. మోటు మాటలు బంద్ జేయాలె. ఒకరినొకరు తిట్టుకోవద్దు. ఏడాదిలోనే మళ్లీ గంగదేవిపల్లికి వస్తా’’ అని కేసీఆర్ చెప్పారు. అంతకుముందు సీఎంకు గ్రామస్తులు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. కాలినడకన సీఎం స్థానికులను పలకరిస్తూ గ్రామం గురించి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రూ.10 కోట్లు మంజూరు గ్రామంలోని వివిధ పనుల కోసం రూ.7.28 కోట్లు కావాలని ముఖ్యమంత్రికి గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ విన్నవించింది. ఈ ప్రతిపాదనలకు స్పందించిన కేసీఆర్ గ్రామాభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మీరు అన్నట్లు రూ.7.28 కోట్లు కాదు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్న. రేపే(మంగళవారం) ఈ నిధులను జిల్లా కలెక్టర్ వద్ద పెడుతం. ఈ నిధులతో ఏ పనులు చేయాలనేది గ్రామ సభలో నిర్ణయించుకోవాలి’’ అని పేర్కొన్నారు. -
సవాళ్లను స్వీకరించాలి
న్యూఢిల్లీ: దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న రక్షణ, వైద్యం వంటి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయాలని ఐఐటీలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ కీలక రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల తయారీని ఐఐటీలు సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ విద్యా సంస్థలను గొప్ప శక్తి వనరులుగా అభివర్ణించిన మోడీ.. సైన్స్ విశ్వవ్యాప్తం కానీ సాంకేతిక పరిజ్ఞానం మాత్రం స్థానికమేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడి రాష్ర్టపతి భవన్లో జరిగిన ఐఐటీల గవర్నర్లు, డెరైక్టర్ల బోర్డులన్నింటి చైర్మన్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో ఐఐటీలు మార్పు తీసుకురావాలన్నారు. సామాన్య ప్రజల రోజువారీ జీవనంలో ఉపయోగపడేలా కొత్త పరిష్కారాలు చూపించే ప్రాజెక్టులను ఐఐటీలు చేపట్టాలని మోడీ పిలుపునిచ్చారు. సున్నితమైన ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే నైపుణ్యాలు భారత్‌కు లేవనడాన్ని తాను ఒప్పుకోనన్నారు. ఇక రాష్ర్టపతి ప్రణబ్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఐఐటీలు కృషి చేయాలని, ప్రపంచంలోని ఉత్తమ విద్యా సంస్థలతో పోటీ పడాలని అభిలషించారు. ఈ దిశగా సుపరిపాలనకు రోడ్‌మ్యాప్ రూపొందించుకోవాలని ఐఐటీల మండలికి సూచించారు. భారత దిగుమతులను తగ్గించే విధంగా దేశీయ టెక్నాలజీలను అభివృద్ధిపరచాలని కూడా ప్రణబ్ పిలుపునిచ్చారు.