నీతి అయోగ్ సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ; నీతీ ఆయోగ్ పాలకమండలి ఏడో సమావేశంలో సీఎంలు తదితరులతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది.
23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్‌గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమావేశానికి రాలేదు.
రాష్ట్రానికో జీ20 టీమ్
నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు.
కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రాలేమన్నాయంటే...
వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు.
వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్‌నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు.
చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు
ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్‌ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్‌ఎంఆర్‌లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్‌సుమన్ బెరీ అన్నారు.
కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు
వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్‌నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment