న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మలిచే లక్ష్యంతో కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీ (చిప్‌లు), డిస్‌ప్లే తయారీ ఎకోసిస్టమ్‌కు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా స్వీయ సమృద్ధి సాధించడమే కాకుండా, చైనా మార్కెట్‌పై ఆధారపడడం తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది.
సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే తయారీ, డిజైన్ కంపెనీలకు అంతర్జాతీయంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందించడం వల్ల.. ఎలక్ట్రానిక్స్ తయారీలో కొత్త శకానికి దారితీస్తుందని కేంద్రం పేర్కొంది. కేబినెట్ సమావేశం వివరాలను ఐటీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే.. ఎలక్ట్రానిక్స్ తయారీలో సెమీ కండక్టర్లకు కీలక పాత్ర ఉందన్నారు.
లక్ష్యాలు..: మూలధన, సాంకేతిక సహకారాన్ని ఈ పథకం కింద కంపెనీలు పొందొచ్చు. అర్హులైన దరఖాస్తులకు ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం నిధుల సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, డిస్‌ప్లే ఫ్యాబ్‌లు, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సిలికాన్ ఫోటోనిక్స్, సెన్సార్ ఫ్యాబ్‌లు, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సెమీ కండక్టర్ డిజైన్‌లకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఇవ్వనుంది.
ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక సదుపాయాల (భూమి, నీరు, విద్యుత్తు, రవాణా, పరిశోధన సదుపాయాలు) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్రం పనిచేయనుంది. కనీసం రెండు గ్రీన్‌ఫీల్డ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్‌లు, రెండు డిస్‌ప్లే ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా ఉంది. ఈ ప్రతిపాదిత పథకం కింద కనీసం 15 కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ల ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
డిజైన్ అనుసంధాన ప్రోత్సాహక పథకం (డీఎల్‌ఐ) కింద ప్రాజెక్టు ఏర్పాటు వ్యయంలో 50 శాతాన్ని ప్రోత్సాహకంగా ప్రభుత్వం సమకూర్చనుంది. అలాగే, ఐదేళ్లపాటు విక్రయాలపై 6–4 శాతం మేర ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ‘‘దేశీయంగా 100 వరకు సెమీకండక్టర్ డిజైన్ ఫర్ ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్, చిప్‌సెట్లు, సిస్టమ్ ఆన్ చిప్స్, సెమీకండక్టర్ డిజైన్ కంపెనీలకు మద్దతు లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి’’ అని ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రకటన తెలిపింది. ఈ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి వీలుగా అంతర్జాతీయ నిపుణులతో సెమీకండక్టర్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.
1.35 లక్షల మందికి ఉపాధి
వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం కింద దేశంలోకి 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతానికి దేశంలో 75 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. టాటా గ్రూపు ఇప్పటికే సెమీకండక్టర్ల తయారీలోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించగా.. వేదాంత గ్రూపు సైతం ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉంది. రెండు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ చిప్ తయారీ కంపెనీలు, రెండు డిస్‌ప్లే తయారీ కంపెనీలు ఒక్కోటీ రూ.30,000–50,000 కోట్ల స్థాయి పెట్టుబడులతో వచ్చే నాలుగేళ్లలో ముందుకు రావచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ అంచనా వేస్తోంది.
ఆవిష్కరణలు, తయారీకి ఊతం: ప్రధాని మోదీ
సెమీకండక్టర్లకు సం బంధించి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు, తయారీకి ఊతమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
డిజిటల్ చెల్లింపులకు మరింత మద్దతు
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు ఇప్పటికే గరిష్టాలకు చేరుకోగా.. వీటిని మరింత ప్రోత్సహించాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. యూపీఐ, రూపే డెబిట్ కార్టులతో చేసే చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వ్యక్తులు వర్తకులకు చేసే డిజిటల్ చెల్లింపులకు అయ్యే వ్యయాలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూపే డెబిట్ కార్డు, భీమ్ యూపీఐతో రూ.2,000 వరకు చెల్లింపులపై అయ్యే వ్యయాలను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో ప్రభత్వం రూ.1,300 కోట్లను ఖర్చు చేయడం వల్ల మరింత మంది డిజిటల్ చెల్లింపులకు ముందుకు వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్‌లో 7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment