
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని శాస్త్రవేత్తలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో శాస్త్ర పరిజ్ఞానానిది ముఖ్య పాత్ర అని నొక్కి చెప్పారు. దేశ సుస్థిర అభివృద్ధి, శ్రేయస్సుకు పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు ఎంతో కీలకం అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పుదుచ్చేరి నుంచి ఆమె వర్చువల్‌గా మాట్లాడారు. కొత్త ఆవిష్కరణల పేటెంట్ల దరఖాస్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఔషధ ముడిపదార్థాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి రావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే వాటిని ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు.