సాక్షి, హైదరాబాద్/వరంగల్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 23 ఏళ్ల ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఆమె మృతిపట్ల ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
‘గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక అకాల మరణం.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ ఔత్సాహికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిళ్లను గుర్తుచేస్తుంది. గ్రూప్2కు సన్నద్ధమవుతున్న ప్రవళిక.. ఉద్యోగ పరీక్షల వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు. విద్యార్థులు దైర్యంగా ఉండండి. నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక పంపాలి’ అంటూ తమిళిసై పేర్కొన్నారు..
అంతిమయాత్రలో స్పల్ప ఉద్రిక్తత
వరంగల్‌లోని దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో నిర్వహించిన ప్రవళిక అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేయూ, ఓయూ జేఏసీ విద్యార్థుల ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి జేఏసీ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థుల చొక్కాలు చినిగాయి.
కాగా గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన ప్రవళిక అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్‌స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని కోరారు.
తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం
గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యతో ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో విషాదం అలుముకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. జయ- లింగయ్య దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కాగా..కూతురు ప్రవళిక ఉన్నత విద్యను అభ్యసించి గ్రూప్-2ప్రిపేర్ కోసం హైదరాబాద్ హాస్ట్‌లో ఉంటుంది.
ప్రవళిక అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓయు, కేయు జేఏసీ ప్రతినిదులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యా అని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. టీఎస్‌పీఎస్సీ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల ఎక్సిగ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment