సవాళ్లను స్వీకరించాలి
న్యూఢిల్లీ: దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న రక్షణ, వైద్యం వంటి రంగాల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయాలని ఐఐటీలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ కీలక రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల తయారీని ఐఐటీలు సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ విద్యా సంస్థలను గొప్ప శక్తి వనరులుగా అభివర్ణించిన మోడీ.. సైన్స్ విశ్వవ్యాప్తం కానీ సాంకేతిక పరిజ్ఞానం మాత్రం స్థానికమేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడి రాష్ర్టపతి భవన్‌లో జరిగిన ఐఐటీల గవర్నర్లు, డెరైక్టర్ల బోర్డులన్నింటి చైర్మన్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో ఐఐటీలు మార్పు తీసుకురావాలన్నారు.
సామాన్య ప్రజల రోజువారీ జీవనంలో ఉపయోగపడేలా కొత్త పరిష్కారాలు చూపించే ప్రాజెక్టులను ఐఐటీలు చేపట్టాలని మోడీ పిలుపునిచ్చారు. సున్నితమైన ఉత్పత్తులను దేశీయంగా తయారు చేసే నైపుణ్యాలు భారత్‌కు లేవనడాన్ని తాను ఒప్పుకోనన్నారు. ఇక రాష్ర్టపతి ప్రణబ్ మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఐఐటీలు కృషి చేయాలని, ప్రపంచంలోని ఉత్తమ విద్యా సంస్థలతో పోటీ పడాలని అభిలషించారు. ఈ దిశగా సుపరిపాలనకు రోడ్‌మ్యాప్ రూపొందించుకోవాలని ఐఐటీల మండలికి సూచించారు. భారత దిగుమతులను తగ్గించే విధంగా దేశీయ టెక్నాలజీలను అభివృద్ధిపరచాలని కూడా ప్రణబ్ పిలుపునిచ్చారు.