డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌..: విజయానికి కావాలి ఓ డ్రెస్‌! | Dress for Success is an international not-for-profit organization that empowers women | Sakshi
Sakshi News home page

డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌..: విజయానికి కావాలి ఓ డ్రెస్‌!

Published Sat, Mar 12 2022 12:21 AM | Last Updated on Sat, Mar 12 2022 12:21 AM

Dress for Success is an international not-for-profit organization that empowers women - Sakshi

వివిధ రంగాలలో ‘ఆమె’ స్థానం మహోన్నతంగా ఎదుగుతోంది. దానికి తగినట్టు ‘ఆమె’ ఆహార్యం మారుతోంది. స్థానిక, భాష, సంస్కృతులకు భిన్నంగా ఉద్యోగిగా ‘ఆమె’కు సరైన డ్రెస్‌ ఉండాలి. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వృత్తిపరమైన వస్త్రధారణ ‘ఆమె’కు తప్పనిసరి అవసరం అంటోంది ‘డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌’. లాభాపేక్షలేని ఈ సంస్థ పుట్టింది అమెరికాలోనే అయినా ప్రపంచంలోని పాతిక దేశాలకుపైగా విస్తరించింది. ఎదుగుతున్న మహిళకు ‘డ్రెస్‌’ అవసరం కొత్తగా పరిచయం చేస్తోంది.

వృత్తి, ఉద్యోగాలలో సరైన వస్త్రధారణ మహిల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. ‘ఇంటర్వ్యూల సమయంలో వస్త్రధారణ కారణంగా పెరిగే ఆత్మవిశ్వాసాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. పనికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మన ఆహార్యం ద్వారా తెలిజేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆఫీసు పనిలో మరిన్ని విజయాలు, అవకాశాలను సొంతం చేసుకోగలరు’ అంటున్నారు ‘డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌’ నిర్వాహకులు.

మిలియన్లకు పైగా మహిళలు
డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌ సంస్థ కార్యకలాపాలను న్యూయార్క్‌ నగరంలో 1997లో ప్రారంభించారు. ఆస్త్రేలియా, ఇటలీ, మెక్సికో, నెదర్లాండ్స్, పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్, నేపాల్, నైజీరియా, సింగపూర్‌... మొదలైన 25 దేశాలలో దాదాపు 150 నగరాలకు విస్తరించి, 1.2 మిలియన్లకు పైగా మహిళలు స్వయం సమృద్ధి సాధించడంలో సహాయపడింది. ‘మీ దుస్తులు ఎలా విరాళంగా ఇవ్వచ్చు. సంస్థకు ఎలా మద్దతు ఇవ్వవచ్చు, వాలంటీర్‌గా పాల్గొనడం లేదా ఇతర మార్గాల్లో సహాయం ఇవ్వచ్చు’ అనే విషయాల్లోనూ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారానూ స్పష్టం చేస్తుంది.  

ఘన చరిత్ర
ప్రపంచవ్యాప్తంగా మహిళ విజయం కోసం పనిచేసే ‘డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌’ ప్రధాన కేంద్రం న్యూయార్క్‌లో ఉంది. ఇది గ్లోబల్‌ అనుబంధ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది. నాన్సీ లుబ్లిన్‌ అనే న్యాయశాస్త్ర విద్యార్థిని 1996లో తన ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన 5 వేల డాలర్లను వేలాది మందికి ఉపయోగపడేలా చేయాలనుకుంది. మన్‌హట్టన్‌లోని ఒక చర్చి నేలమాళిగలో ‘డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌’ని స్థాపించింది. ఆ బేస్‌మెంట్‌ బోటిక్‌ నుంచి ‘డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌’ మిషన్‌ ఉత్తర అమెరికా అంతటా కొద్ది కాలంలోనే వ్యాపించి, ఆపై ప్రపంచమంతటా విస్తరించింది. ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో మహిళలందరూ వారి స్థానం, భాష, ఆచారాలు లేదా సంస్కృతితో సంబంధం లేకుండా ఎదుర్కొనే సవాలు ఇది అని డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌ నిరూపిస్తుంది. ‘ప్రతి యేటా 14,000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు, పురుషులు తమ సమయాన్ని, ప్రతిభను మా అనుబంధ సంస్థలకు ఉదారంగా విరాళంగా ఇస్తున్నారు’ అంటున్నారు నిర్వాహకులు.

రెజ్యూమ్‌లతోనూ సాయం
చాలా మంది మహిళలు పేదరిక స్థాయి లేదా దిగువ స్థాయిలోనే జీవిస్తున్నారు. ‘ఆమె’ తన జీవితంలో కొత్త పునాదిని నిర్మించుకోవడానికి సంస్థ చేదోడుగా ఉంటుంది. బాధిత మనస్తత్వాన్ని విజయంగా మార్చడంలో సహాయపడుతుంది. రెజ్యూమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో, ఇంటర్వ్యూలలో ఎలా పాల్గొనాలో కూడా సహాయం చేస్తుంది. ‘నా జీవితం నిజంగా అద్భుతమైనది. వాళ్లు నా కోసం చాలా చేశారు. సక్సెస్‌ కోసం డ్రెస్, షూస్, మంచి సూట్‌ ధరిస్తే నేను చాలా అందంగా కనిపిస్తానని తెలియజేశారు. ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉన్నాననే నమ్మకం నాకు కలిగింది. ఇది చాలా అద్భుతంగా ఉంది’ అంటారు ఈ సంస్థ నుంచి సాయం పొందిన మహిళ సోని.

ప్రపంచంపై మీదైన ముద్ర వేయడానికి ఒక కొత్త అవకాశాన్ని జోడిస్తుంది డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌. ‘యువర్‌ అవర్, హర్‌ పవర్‌’ క్యాంపెయిన్‌తో ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి వేతనంలో ఒక గంట లేదా అంత కంటే ఎక్కువ సమయంలో పొందే మొత్తాన్ని విరాళంగా ఇవ్వచ్చని కూడా సూచిస్తోంది. మీరు కనిపించే తీరును బట్టి ప్రజలు మీకు ప్రతిస్పందిస్తారు అనే ఆలోచనతో అన్ని దేశాల్లోనూ మహిళలకు ప్రియమైన నేస్తంగా మారుతోంది డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌. మహిళాభ్యుదయానికి పాటు పడే ఇలాంటి సంస్థలు మన ముంగిట్లోకీ రావాలని కోరుకుందాం.             

మతాలకు అతీతంగా
‘బొటిక్‌కు వచ్చిన క్లయింట్‌ తన వృత్తికి తగిన దుస్తులను ఎంచుకోవడం అనేది కష్టమైన ప్రక్రియ. ఆమె అభిరుచికి అనుగుణంగా సరైన ఎంపిక ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెబుతున్నారు వాలంటీర్‌ జైనాబ్‌. ‘ఆన్‌లైన్‌ ద్వారాను వారికి సరైన గైడెన్స్‌ ఇస్తుంటాం. ఇంటర్వ్యూ లేదా కొత్త ఉద్యోగానికి తగిన దుస్తులను ఎంచుకోవడంలో మహిళలకు సహాయం చేస్తుంటాను. మా అనుబంధ సంస్థల ఈవెంట్‌లలో కూడా పాల్గొంటుంటాను’ అని వివరిస్తారు జైనాబ్‌. గృహహింస కారణంగా బాధపడుతున్న మహిళల పరిస్థితిని అర్థం చేసుకొని, వారు కొత్త జీవితాన్ని పొందడానికి సహాయం చేయడంలోనూ, వారి విజయానికి పాటు పడటంలోనూ ఈ ప్రోగ్రామ్‌లు ఉపయోగపడతాయని వివరిస్తారామె.

లాభాపేక్షలేకుండా..
పురుషాధిక్యత అధికంగా ఉన్న దేశాలపైన దృష్టి పెట్టింది డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌. అక్కడి అనుబంధ సంస్థల ద్వారా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడానికి, ఇమిగ్రేషన్‌ సేవలు, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు, విద్యా సంస్థలు, గృహ హింసతో బాధపడేవారికి షెల్టర్లతో సహా అనేక ఇతర లాభాపేక్షలేని సంస్థలతో కలిసి పని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఘనతను సొంతం చేసుకుంది డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌. ‘మహిళలందరూ ఉన్నతంగా మారడానికి పెద్ద కలలు కనాలని కోరుకుంటున్నాను. ఒకరినుంచి ఒకరు స్ఫూర్తి పొందాలి. మా ప్రాథమిక దృష్టి మహిళలకు శిక్షణ ఇవ్వడం మీదనే. దాని వల్ల వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం’ అంటున్నారు ఖాట్మండూలోని డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌ ఫౌండర్‌ అమృత. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement