జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడవాలంటే పల్లెల్లో చేపట్టే ప్రతీ పనిలో ప్రజలను భాగస్వామ్యుల ను చేసినపుడే అధి సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ‘రాజీవ్‌గాంధీ పంచాయతీ సశక్తికరణ్ అభియాన్(ఆర్‌జీపీఎస్‌ఏ)’ పథకా న్ని రూపొందించింది. పథకాన్ని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది.
మన రాష్ట్రానికి చెందిన కమిటీలో సభ్యులుగా మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి, బీఆర్‌జీ ఎఫ్ సలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి రామకృష్ణ, పీఆర్ డిప్యూటీ కమిషనర్ రామారావు, పదవీ విరమణ చేసన పీఆర్ అడిషనల్ కమిషనర్ శంకర్‌రెడ్డి, కన్సల్టెంట్ ఫ్రొఫెసర్ సూర్యనారాయణరెడ్డి ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పా టు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం జెడ్పీ సీఈఓ ఆంజనేయులు అధ్యక్షతన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతి నిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం.. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే పనులు చేపట్టడం ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధించవచ్చన్నారు. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలు అమలు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ఆర్‌జీపీఎస్‌ఏ పథకంలో పరిశీలిస్తారని తెలిపారు. సర్పంచ్ గా గెలవడానికి ఎన్ని ఎత్తులు వేసినా అభివృద్ధి కార్యక్రమా ల్లో, ప్రజలకు న్యాయం చేయడంలో పక్షపాతం చూపించొద్ద ని ప్రజాప్రతినిధులకు సూచించారు.
జెడ్పీ సీఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో చట్టాలను అమలు చేయడంలో ఇబ్బం దులు ఎదురవుతున్నాయన్నారు. గ్రామ సభలు పటిష్టంగా నిర్వహించి, ప్రజల అవసరాలను వారి ద్వారానే గుర్తిస్తే సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. చేపట్టే ప్రతీ పనిలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని, అన్ని శాఖ లు చేసే పనులను ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
ఆర్‌జీపీఎస్‌ఏ కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ఆర్‌జీపీఎస్‌ఏ పథకం ద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయన్నారు. ప్రభుత్వాలకు ఉన్న అధికారాలన్నీ గ్రామ పంచాయతీలకు వర్తింపజేయాలన్న నిబంధన ఆర్టికల్ 40లో ఉందని చెప్పారు. 1959లో చట్టం అమలులోకి వచ్చి 33 ఏళ్లు గడిచినా గ్రామ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడాన్ని అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ గుర్తించి పం చాయతీలను మరింత బలోపేతం చేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించారని తెలిపారు.
అందులో భాగంగానే 1993లో 73, 74వ రాజ్యాంగ సవరణ జరిగింద ని, ఈ సవరణ ద్వారా సుమారు 27 ప్రభుత్వ శాఖలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దేశ ప్రధానికి ఎన్ని అధికారాలున్నాయో గ్రామ స్థాయిలో సర్పంచ్‌కు అన్ని అధికారాలు, విధులు ఉన్నాయని తెలిపా రు. అధికారంలో ఉన్న పార్టీల దయాదాక్షిణ్యాలపై స్థానిక ప్రభుత్వాల భవిష్యత్ అధారపడి ఉండడం దౌర్భాగ్యమన్నా రు.
పెరిగిన జనాభా ప్రకారం డీలిమిటేషన్, రిజర్వేషన్ల పేరిట అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తన చేతులో ఉంచుకున్నందునే ఎన్నికలు సజావుగా జరగడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఈ రెండు అధికారాలు కమిషన్‌కు అప్పగిస్తే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావడమే కాకుండా కాలపరిమితి తీరిన వెంటనే ఎన్నికలు జరిగే అవకాశాలుంటాయని వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లా పరిషత్‌లలో పీఆర్ శాఖకు చెందిన వారు కాకుండా ఇతర శాఖలకు చెందిన వారు సీఈఓలుగా పనిచేస్తున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు పంచాయతీరాజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆర్‌జీపీఎస్‌ఏ కన్సల్టెంట్‌ప్రొఫెసర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ పథకంలోనైనా అభివృద్ధికి మాత్రమే నిధులు కేటాయించగా ఈ పథకంలో గ్రామ పంచాయతీల అభివృద్ధితోపాటు పర్యవేక్షణకు నియమించుకునే సిబ్బంది కోసం నిధులు కేటాయిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ అధికారులతోపాటు ఒక ఇంజినీర్, ఒక డెటా ఎంట్రీ ఆపరేటర్, ఒక అకౌంటెంట్‌ను నియమించుకునే వీలు ఉంటుందని చెప్పారు. కార్యక్రమం లో మాజీ ఎంపీపీ రామచంద్రయ్య(కురవి), మాజీ జెడ్పీటీసీ రవీందర్‌రావు(వర్ధన్నపేట), ఉప సర్పంచ్ కూసం రాజమౌళి(గంగదేవిపల్లి), మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, డీపీఓ ఈఎస్.నాయక్, డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
Published Thu, Aug 29 2013 3:47 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement