సేఫ్‌జోన్‌గా నల్లమల!
- సందేహాలకు తావిచ్చిన పోలీస్ ఎన్‌కౌంటర్
- ఐదారేళ్లలో 60 మందికి పైగా మావోయిస్టుల మృతి
నల్లమలలో మావోయిస్టులు లేరని చెప్పిన పోలీస్ అధికారులు శాసన సభ సమావేశాల పారంభ రోజునే కాల్పులపై అనుమానాలు ఆంధ్రప్రదేశ్ విడిపోతే మావోయిస్టులు మళ్లీ బలపడతారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికను కేంద్రప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే నల్లమల కేంద్రంగా మావోయిస్టుల కార్యకలాపాలు ప్రారంభం కావడం గమనార్హం.
- ఒక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వస్తుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో గుంటూరు జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
- గత గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్నాడని చెబుతున్న విక్రమ్ ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం అతడిని చంపడానికి ప్రత్యర్థులు కాపుగాసినట్లు సమాచారం.
- కోర్టు నుంచి రిమాండ్‌కు తరలించే క్రమంలో ఏకే 47తో పరారైన సంగతి తెలిసిందే. అయితే అతడిని పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పించి అతను ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్‌కౌంటర్ జరిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- జాన్‌బాబూరావు, విమలక్క, భారతి మూడు నెలలుగా కృష్ణానదీ తీరంలోనే మకాం వేసి మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.
- సున్నిపెంట వద్ద మైదాన ప్రాంతంలో ఉన్న వారిని పట్టుకెళ్లి ఎన్‌కౌంటర్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
- గతంలో కూడా ఇదే ప్రాంతంలో తొమ్మిదిమందిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
- ఈ ఎన్‌కౌంటర్ నుంచి విక్రమ్ బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
- అయితే గాయాలతో విక్రమ్ తప్పించుకున్నాడన్న వాదన సరికాదని, విక్రమ్ కూడా పోలీసుల అదుపులోనే ఉండి ఉండచ్చని మరో వాదన వినిపిస్తోంది.
- దీంతో నల్లమల అడవులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. పీపుల్స్‌వార్ పార్టీ హయాం నుంచి అన్నలకు ఆశ్రయం కల్పించిన నల్లమల ఆ తర్వాత మెల్లమెల్లగా మావోయిస్టుల ఉనికిని కోల్పోయింది.
- 1996 నుంచి నల్లమల అడవులను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు కార్యకలాపాలు సాగించారు.
- మావోయిస్టులు మొట్టమొదటిసారిగా తమ ఉనికిని చాటుకునేందుకు సున్నిపెంట పోలీస్‌స్టేషన్‌ను పేల్చారు.
- ఆ తర్వాత 2001 జూన్ 3వ తేదీన పుల్లలచెరువు ఏఎస్సై కె.పి. ప్రశాంతరావును దారి కాచి మట్టుపెట్టారు.
- 2004లో మావోయిస్టులు తొలిసారిగా చర్చల కోసం ప్రకాశం జిల్లాలోని చినఆరుట్ల నుంచే బయటకు వచ్చారు.
- బయటకు వచ్చిన మావోయిస్టులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
- 2006లో ప్రకాశం జిల్లా ఎస్పీ లడ్హాపై ఒంగోలు నగరంలోనే హత్యాయత్నం చేయడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నల్లమలను జల్లెడపట్టారు.
- ఆ తర్వాత పుల్లలచెరువు మండలం పీఆర్‌పీ తండాలో మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు మట్టా రవికుమార్‌ను, యర్రగొండపాలెం మండలం నెక్కట్టి అడవిలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు మరో ఏడుగురిని ఎన్‌కౌంటర్ చేశారు.
- 2007లో పుల్లలచెరువు మండలం రాచకొండ వద్ద బత్తాయి తోటలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కిరణ్, 2009లో ఇదే మండలం మర్లపాలెం కొండ వద్ద మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవిందనాయక్‌ను, 2010లో మురికిమళ్ల అడవిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు శాఖమూరి అప్పారావును ఎన్‌కౌంటర్ చేశారు.
- ఐదారేళ్లలో 60 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్ అయ్యారు. దీంతో నల్లమలలో ఉండటానికి మావోయిస్టులు సాహసించలేదు.
- నల్లమలలో మావోయిస్టులు లేరని పోలీసులు కూడా అధికారికంగా ప్రకటించారు.
- అయితే శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన రోజునే ఎన్‌కౌంటర్ చేయడం ద్వారా మావోయిస్టులను అణిచివేస్తామనే చంద్రబాబు విధానాన్ని ప్రకటించినట్లు అయ్యిందని పౌరహక్కుల సంఘం నేతలు చెబుతున్నారు.
- జాన్‌బాబూరావు, విమల, భారతీలను పోలీసులు పట్టుకెళ్లి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని వారు ఆరోపించారు.