న్యూఢిల్లీ: వెనకబడిన కుటుంబానికి చెందిన అంబేడ్కర్ ముందుకెళ్లకుండా చాలా మంది అవహేళన చేశారని ప్రధాని మోదీ తెలిపారు. వారందరి ప్రయత్నాలను అంబేడ్కర్ విఫలం చేసి రాజ్యాంగ నిర్మాతగా నిలిచారన్నారు. దేశం పేదలు, వెనకబడిన వర్గాలకే చెందుతుందని మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఉన్నత, ధనవంతుల కుటుంబంలో పుట్టడంతో సంబంధం లేకుండా పేదల ఇంట పుట్టినా లక్ష్య సాకారం కోసం అంబేడ్కర్ అహర్నిశలు శ్రమించి విజయం సాధించారని ప్రశంసించారు.
ఐక్యంగా గ్రామ్ స్వరాజ్ అభియాన్
‘చాలా మంది అంబేడ్కర్‌ను అవహేళన చేశారు. వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ముందుకెళ్లొద్దని ఆయన్ను వెనక్కు లాగేందుకు అనుక్షణం ప్రయత్నించారు. ఆయన అభ్యుదయ భావాలను అడ్డుకున్నారు. కానీ నేటి పరిస్థితి భిన్నంగా ఉంది. అంబేడ్కర్ కలలుగన్న పేదలు, వెనకబడిన వర్గాల నవభారతం చిత్రం మన ముందుంది’ అని తెలిపారు. అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
భవిష్యత్‌ను ముందే చూసి..
‘దశాబ్దాల క్రితం అంబేడ్కర్ భారత్‌లో పారిశ్రామికీకరణ గురించి మాట్లాడారు. కొత్త ఉద్యోగాల కల్పన అభివృద్ధి గురించి చెప్పారు. నేడు అంబేడ్కర్ కోరిన నవభారత స్వప్న దృశ్యాన్ని నిజం చేసేలా మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోర్టులు, జలమార్గాల అభివృద్ధినీ ఆయన గుర్తించారు’ అనిపేర్కొన్నారు. భారత్‌లో దేశ విభజన, రెండో ప్రపంచ యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే టీమ్ ఇండియా స్ఫూర్తికి అంబేడ్కర్ పునాదులు వేశారని మోదీ పేర్కొన్నారు. సమాఖ్యవిధానం గురించి మాట్లాడారని దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని సూచించారన్నారు.
సహకారాత్మక సమాఖ్య విధానమనే మంత్రాన్నే నేటి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాంమనోహర్ లోహియా, చరణ్ సింగ్, దేవీలాల్ తదితర నేతలు వ్యవసాయం, రైతులను దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా చూశారని ప్రశంసించారు. ‘దుక్కిదున్నటం, మట్టిపై దృష్టిపెట్టడాన్ని మరిచిపోతే మనల్ని మనం మరిచిపోయినట్లే’ అని గాంధీజీ సూక్తిని గుర్తుచేశారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరచాలన్న శాస్త్రి ఆలోచనలను, రైతుల ఆదాయం రెట్టింపుచేసేందుకు ఉద్యమాన్ని తీసుకురావాలన్న లోహియా సిద్ధాంతాలనూ జ్ఞప్తికి తెచ్చారు. రైతులు అధునాతన సాంకేతికతను ఒంటబట్టించుకోవాలన్న 1979నాటి చరణ్ సింగ్ ప్రసంగాన్నీ గుర్తుచేశారు.
నివారణే అసలైన మార్గం
అనారోగ్యం తలెత్తిన తర్వాత ఇబ్బందులు పడేకంటే.. నిరోధక చర్యలపైనే ప్రజలు దృష్టిపెట్టాలని ప్రజలందరికీ మోదీ సూచించారు. ‘వ్యాధి నిరోధించడానికి పెద్ద ఖర్చు కూడా ఉండదు. త్వరగా నయమయ్యేందుకు దోహదపడుతుంది.నివారణ ద్వారా వ్యక్తిగతంగా లాభం పొందటంతోపాటు కుటుంబం, సమాజానికీ మేలు చేసినవారమవుతాం’ అని ప్రధాని పేర్కొన్నారు. వ్యాధి నివారణమార్గాల్లో యోగా ఒకటని ఆయన సూచించారు.
2025 కల్లా దేశంలో క్షయ వ్యాధి లేకుండా చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా పదికోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆరోగ్య భారతం స్వచ్ఛ భారతమంత ముఖ్యమైనదన్నారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయన్నారు. ప్రజలకు తక్కువధరకే ఔషధాలు అందించేందుకు దేశవ్యాప్తంగా 3వేల జనఔషధి కేంద్రాలను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. వైద్యకళాశాలల్లో సీట్ల సంఖ్యనూ పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment