గ్రామ స్వరాజ్యం జాడేది? | Konagala Mahesh Article On Gram Swaraj In Telangana | Sakshi
Sakshi News home page

గ్రామ స్వరాజ్యం జాడేది?

Published Thu, Oct 3 2019 2:07 AM | Last Updated on Thu, Oct 3 2019 2:07 AM

Konagala Mahesh Article On Gram Swaraj In Telangana - Sakshi

భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం నేడు కనుమరుగవుతోంది. దేశానికి స్వాతంత్య్రం  సాధించిన అనంతరం, గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లిన నాడే అసలైన ప్రజాస్వామ్యమని గాంధీజీ ప్రకటించారు. స్థానిక పరిపాలన బలోపేతం చేయాలన్న గాంధీజీ స్పూర్తితో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణలు చేసింది. తద్వారా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ గుర్తింపు తీసుకొచ్చి, రక్షణ కల్పించారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో పాలన ఇందుకు భిన్నంగా, గత నెల రోజులుగా గ్రామాల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన సాగుతోంది. స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్‌ వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు, సర్పంచులు, మండల (ఎంపీటీసీ), జిల్లా (జడ్పీటీసీ) ప్రాదేశిక సభ్యులను స్థానిక ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక పరిపాలన నిర్వహించడం, ఆయా గ్రామాలలోని ప్రజలకు కనీస సౌకర్యాలు తాగు నీరు, పారిశుద్ధ్యం, రోడ్డు నిర్మాణం లాంటి బాధ్యతలు నిర్వహిస్తారు. 

కానీ, ముఖ్యమంత్రి, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను ఒకొక్కరిని ఒక్కో గ్రామానికి స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించారు. ఇక వీళ్ళ డ్యూటీ ఏమిటంటే, గ్రామ సభలు నిర్వహించి, గ్రామంలో అబివృద్ధి సమస్యలను గుర్తించి, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి బాధ్యతలు చేపట్టడమేనట. మరీ, స్థానిక ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు ఏం చేయాలే?. స్థానిక సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకుల పైన ప్రభుత్వ ఉద్యోగి అజమాయిషీ ఏంటి? ఇది  ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క‘ అనే ప్రజాస్వామ్య మూల సూత్రాలను విస్మరించటం కాదా? 

గ్రామ ప్రణాళికల పేరుతో హడావుడిచేయడం ముఖ్యమంత్రికి ఇది మొదటిసారి కాదు. గతంలో ఇదే ఎజెండాను  గ్రామ జ్యోతి పేరుతో అమలుచేశారు. ఎంపీటీసీలను విస్మరించి, వాళ్ళను ఈ కార్యక్రమంలో భాగస్వామ్య చేయకుండానే నిర్వహించారు. అప్పుడు కూడా, ఇదే తరహాలో గ్రామ ప్రణాళికలు రూపొందించినారు. కానీ, అవి చెత్తబుట్ట దాఖలైనాయి. ఇప్పుడు కూడా తమకు ఏదో మేలు జరుగుతుందన్న నమ్మకం సామాన్య ప్రజలలో కనబడుతలేదు. అందుకే ప్రజలు రాక గ్రామ సభలు నాలుగు గోడల మధ్య తూతుమంత్రంగా జరుగుతున్నాయి. అందులో రూపొందించే ప్రణాళికలు సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో జరుగాల్సిన పనులలో జేసీబీలు వాడుతున్నారు. రోడ్ల మరమ్మతులు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాలకు, గ్రామ పంచాయతీలకు కార్యాలయ భవనాలు లేని దుస్థితి నెలకొంది.

మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ కార్యాలయలలో రోజువారీగా నిర్వహించవలసిన బాధ్యతలు నిర్వహించే సమయం ఏది?. అసలే, రెవెన్యూ సిబ్బంది భూరికార్డుల శుద్ధీకరణ పనిలో బిజీగా ఉన్నారు. రైతుల పాసుపుస్తకాలలో పొరపాట్లు ఒకరి భూమి మరొకరికి, ఎక్కువ భూమి ఉంటే తక్కువ, తక్కువగా భూమి ఉంటే ఎక్కువ రాసినవి సరిచేసే సమయంలో, ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రావటంతో వాళ్ళ అసలు పని పక్కకుపోయింది. వికారాబాద్‌ జిల్లాలో పంచాయితీ సెక్రటరీలు పని ఒత్తిడి తగ్గించాలని ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో కొంతమంది ఉద్యోగులకు మెమోలు జారీ చేసారు. నల్గొండ జిల్లా ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదంతా చూస్తుంటే, నాకు 2004 ఎన్నికలు గుర్తొస్తున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాలపై విసుగుచెంది ఉద్యోగులు కన్నెర్ర చేశారు. నోడల్‌ అధికారుల పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. జన్మభూమి తదితర కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టటానికి నాడు పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. ఇంచుమించు, ఇదే ఆవేదన తెలంగాణలో చూస్తున్నాము. 

కేసీఆర్‌ స్థానిక సంస్థలను బలహీన పరిచే స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను ఉపసంహరించుకోవాలి. స్థానిక ఖనిజ సంపదపై అధికారం స్థానిక సంస్థలకే అప్పగించి, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నినాదాన్ని బలోపేతం చేయాలని ఆశిస్తున్నాము. మన జాతిపితకు అప్పుడే అసలైన నివాళి.


కొనగాల మహేష్‌ 
వ్యాసకర్త జాతీయ సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ
మొబైల్‌: 9866776999

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement