konagala Mahesh
-
ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. తెలంగాణలో మొదలైన థర్డ్ వార్
-
‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు.తెలంగాణ నలుమూలల నుంచి పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య ఆశాజ్యోతి అయిన నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఆ ఆస్పత్రిని కాదని ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం నిమ్స్‌లో పనిచేసే డాక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అక్కడ పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కూడా అవమానపరచినట్లేనని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ హోదాలో నిమ్స్ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచాల్సింది పోయి ఆయనే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లడాన్ని బట్టి నిమ్స్‌లో మౌలిక సౌకర్యాలు లేవని అర్థమవుతోందని విమర్శించారు. చదవండి: ఈటలపై సస్పెన్షన్ వేటు? -
దేశ హితం కోసం కలిసి ఉద్యమిద్దాం
అవినీతి, దోపిడీ గుణం, అధికార దర్పం తలకెక్కిన నియంతల కబంధహస్తాల నుండి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దండు కడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళను తరిమికొట్టిన స్వాతంత్య్ర సంగ్రామం, రజాకార్లను తరిమికొట్టిన తెలంగాణ సాయుధ పోరాటాలే స్ఫూర్తిగా భారత్ బంద్‌లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 19 రాజకీయ పార్టీలు దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చాయి. దీనికి భారతదేశ రాజకీయాల గతిని మార్చే శక్తి ఉంది. గతంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగినప్పటికీ దీనికి ఓ ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏడేండ్లలో బీజేపీ దేశాన్ని ఆగం చేసిన తీరూ, జాతీయ ఆస్తులను ఒక్కరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టిన వైనం, అమలు కాని ఎన్నికల హామీలు, అడ్రస్ లేని అచ్ఛే దిన్, పెరిగిన నిరుద్యోగం, తగ్గిన జీడీపీ, పెగాసస్ గూఢచర్యం, రఫేల్ కుంభకోణం, కరోనా వైఫల్యాలు, రైతుల పాలిట శాపంగా మారిన నల్ల వ్యవసాయ చట్టాలు తదితర ప్రజావ్యతిరేక విధానాల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవటానికి కలిసికట్టుగా నడుం బిగిస్తున్న సందర్భమిది. నాడు కాంగ్రెస్ హయాంలో 10 శాతం వృద్ధిరేటు సాధించిన జీడీపీ, ఇపుడు మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తిరోగమనంలో 0 శాతం కంటే తక్కువగా నమోదయింది. బంగ్లాదేశ్ కంటే వెనుకబడిన పరిస్థితి. 60% చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడితే వాటిని గాలికి వదిలేసి, 72 వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద కార్పొరేట్ కంపెనీలకు పంచి పెట్టారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ దేశాన్ని; భారత రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, భారత్ పెట్రోలియం, ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల వంటి జాతీయ ఆస్తులను నిర్మిస్తే, మోదీ 7 ఏండ్లలో వాటిని తన అనుయాయులకు అమ్మేస్తున్నాడు. ఎన్నికల సందర్భంగా, యువతకు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. పార్లే–జీ బిస్కెట్ తయారీ సంస్థ మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఫోర్డ్కార్ల పరిశ్రమ దేశం వదలి పోయింది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు, యువతకు ఉద్యోగాలు కావాలని అడిగితే, అమిత్ షా పకోడీ షాపులు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరుల జీవితాలలోకి తొంగి చూస్తున్నది. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ వాడి దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసి, కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారనే అంశంపై, పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. మెజారిటీ ప్రజల మద్దతుతో ఏర్పడిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలను కూల్చి, కాంగ్రెస్ శాసనసభ్యులను చీల్చి, అనైతికంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు మోదీ–షా ద్వయం. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఈ కుట్రలకు కాంగ్రెస్ కూటమి అధికారం కోల్పోయింది. కానీ రాజస్తాన్‌లో బీజేపీ పాచిక పారలేదు. ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తెచ్చి, రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయంచుకునే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయ కల్పన) బిల్లు–2020 సెక్షన్–13 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మరియు ఏ ఇతర వ్యక్తులపైనగాని కేసులు వేయరాదు. సెక్షన్–15 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో తలెత్తిన వివాదాలు సివిల్ కోర్టు విచారణ పరిధిలోకి రావు. ఈ రెండు నిబంధనలూ రాజ్యాంగ విరుద్ధమైనవి. కాంట్రాక్టు వ్యవసాయం రైతుల స్వేచ్ఛను హరించే యత్నం. తమ గొంతు నొక్కే చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ పొలిమేరలలో ఆందోళన చేస్తే, ఆ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. 2014లో ఉన్న ధరలు 2021 వరకు 200 శాతం పెరిగాయి. ప్రపంచంలో ఎక్కడా సాధ్యపడని ఒక వింత మోదీ హయాంలో ఆవిష్కృతమైంది. నిత్యావసరమైన ఉల్లిగడ్డ, సౌకర్యమైన పెట్రోలు, విలాసమైన బీరు... ఈ మూడూ ఒకే ధర రూ.100కు దొరుకుతున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దేశ హితం కోరుకునే పార్టీలు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, ప్రజలు పాల్గొని భారత్ బంద్‌ను విజయవంతం చేయాలి. అది మన బాధ్యత. కొనగాల మహేష్ వ్యాసకర్త ఏఐసీసీ సభ్యులు ‘ మొబైల్: 9866 776999 (నేడు జరగనున్న ‘భారత్ బంద్’ సందర్భంగా) -
Pegasus: భయపెడుతున్న గూఢచార గుర్రం
నిన్న, మొన్న పార్లమెంట్ దద్దరిల్లింది కరోనా, కరువు గురించిన వాగ్బాణాల వల్ల కాదు. కరోనాకు మించిన రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ కాపీయింగ్, స్వేచ్ఛను కరువు చేసే కొత్త గూఢచార సాఫ్ట్వేర్ పెగసస్ గురించి. వ్యక్తుల సమాచారం, కదలికలు, ఫొటోలు, మాట్లాడే కాల్స్ రికార్డు చేసే ఇజ్రాయిల్‌కు చెందిన ఈ పెగసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం కొన్నది. దాంతో వందలాదిమంది జర్నలిస్టులు, ఉద్యమకారులు, పార్లమెంట్ సభ్యులు, అధికారుల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం అంతా ఇంటలిజెన్స్ వ్యవస్థకు చేరిపోతుంది. ఈ ఉచ్చులో ప్రతి పక్షాలే కాదు, ప్రభుత్వ మంత్రులు, ఎంపీలూ ఉండటం విశేషం. ఇజ్రాయిలీ నిఘా వ్యవస్థ పేరు మొస్సాద్ (మృత్యువు). మృత్యుముఖంలోకి అనేక దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను నెట్టివేసే స్పైవేర్ ఇజ్రాయిల్ నుంచే ఇతర దేశాలకు వచ్చింది. పెగసస్ అంటే గ్రీకు ఇతిహాసాల్లో రెక్కల గుర్రం. డ్రోన్‌తో ఎట్లా అయితే, ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చో, అంతకంటే సునా యాసంగా స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆ వ్యక్తికి తెలియకుండా ఆ ప్రాంతంలోని ఫొటోలు, మాటలు రికార్డు చేసి పంపగలదు ఈ పెగసస్. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశాడని విన్నాంగానీ, జైశ్రీరామ్ వారసులు ఇట్లా ఎగిరే అశ్వంతో వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు తెస్తారని అనుకోలేదు. కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఫోన్ హ్యాక్ చేయడం భార తీయ చట్టాలు అంగీకరించని తప్పుడు పద్ధతి అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పెగసస్‌తో బీజేపీ భార తీయ జాసూస్ పార్టీ అయిందన్నారు. బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ మాత్రం, ఫోన్ ట్యాపింగ్‌కు పెట్టింది పేరయిన కాంగ్రెస్ తమ మీద స్నూపింగ్ అభియోగం చేయడం హాస్యా స్పదం అన్నారు. రాహుల్ గాంధీ అన్ని ఫోన్ నంబర్లు, రాజకీయా లతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సంభాషించేవి కూడా స్నూప్ అవుతున్నట్లు రూఢీ అయ్యింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, గుజరాత్ ఎన్నికల తీరుపై విమర్శలు చేసిన అశోక్ లవాస, జర్నలిస్టు సుశాంత్ సింగ్‌తో పాటు నిఫావైరస్పై గొప్ప పరిశోధనలు చేసిన వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ కూడా ఈ జాబి తాలో ఉన్నారు. నాపై నిఘానా అని వాపోయారు కాంగ్. ఈ సాఫ్ట్వేర్ బట్టబయలుకు ముందే, భీమ్–కోరేగావ్ కేసులో అరెస్టయిన అంబేడ్కర్ మనుమడు ఆనంద్ తేల్తుంబ్డే తన ఫోన్ హ్యాక్ అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో మూడేళ్ల నుండి జైళ్ళో ఉన్న రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్లలోకి మాల్వేర్ చొప్పించినట్లు ఆర్సనాల్ కన్సల్టెన్సీ అనే అమెరికా డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ బహిర్గతం చేసింది. పెగసస్ ఆమ్నెస్టీ సంస్థ ఫోన్ నంబర్లను కూడా స్నూపింగ్ చేసింది. అంతర్గత ఎన్‌స్క్రిప్షన్‌ను పెగసస్ హ్యాక్ చేసిందని వాట్సాప్ మండిపడింది. వంద మంది నేరస్థులు తప్పించు కున్నా ఒక్క నిరపరాధికి శిక్ష పడవద్దన్న స్ఫూర్తికి భిన్నంగా, ఎవరిని జైళ్ళో వేయాలనుకుంటే వారి కంప్యూటర్లోకి తప్పుడు సమాచారం చొప్పిస్తే సామాన్యుల పరి స్థితి ఏమిటి? ఇంకా రాజద్రోహం కేసులు అవసరమా, 70 యేండ్ల స్వాతంత్య్రం తరువాత కూడా బ్రిటిస్ వలసకాలం చట్టాలతో కాలం వెళ్ళదీద్దామా అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెగసన్ గూఢచర్యంపై కూడా స్పందిం చాలి. రానున్న కాలంలో ప్రజాస్వామిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బలోపేతం కాకుండా ఎగిరే గూఢాచారి గుర్రం అధికా రంలో ఉన్న పార్టీకి ఉపయోగ పడితే, అందుకు ప్రతిచర్య దేశ వ్యాపిత ఆందోళనగా రూపుదిద్దుకోవలసిందే. - డా. చెరుకు సుధాకర్ వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు పార్లమెంటరీ కమిటీ వేయండి! ‘పెగసస్’ సెగతో వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు మొదటి రోజే హీటెక్కాయి. దేశ పౌరుల వ్యక్తిగత గోప్యత అంగట్లో సరుకైందనే వార్తతో యావ ద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం యథేచ్ఛగా పౌరుల జీవితాలలోకి తొంగిచూస్తున్నాయి. ఇజ్రాయిల్‌కి చెందిన ఎన్.ఎస్.ఓ అనే సంస్థ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన పెగసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను వాడి దేశంలోని ప్రతిపక్ష నాయకుల, ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్, సుప్రీం కోర్టు చీఫ్‌జస్టిస్ కుటుంబ సభ్యుల, సీనియర్ జర్నలిస్టుల, అనేక సామాజిక ఉద్యమకారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనీ, వారి వ్యక్తిగత విషయాలను తస్కరిస్తున్నారని ఆమ్నెస్టీ, ఫొర్బిడెన్ స్టోరీస్ పరిశోధనా సారాంశం. కాంగ్రెసు పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, తన టీంలోని 5 మంది నేతల ఫోన్లు, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీల నాయకుల ఫోన్లు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తదితరుల ఫోన్లు పెగసస్ అనే మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసి, కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారనే అంశంపై వరుసగా రెండవ రోజూ పార్లమెంట్ స్తంభించిపోవటం చూశాం. తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తోటి శాసన సభ్యులతో సాధారణ ఫోన్‌కాల్‌లో మనసువిప్పి మాట్లాడటానికి వణుకుతున్నారంటే పరిస్థితి అర్థమౌతుంది. సొంత పార్టీ నేతలనే వదిలిపెట్టడం లేదంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న కీలక నాయకులు, కీలక శాఖల ఉన్నతాధికారుల పరిస్థితి మనం ఊహించవచ్చు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్–21 ప్రకారం, భారత పౌరులందరికీ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫోన్ హ్యాకింగ్/ట్యాపింగ్ ఆర్టికల్–21కు విరుద్ధం. కానీ, నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వాలే వారి వ్యక్తిగత ఫోన్లు హ్యాక్ చేసి, సమాచారం తస్కరిస్తే ఎలా? ఈ అంశంపై నిజాలు నిగ్గుతేల్చటానికి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ, పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలి. - కొనగాల మహేష్ వ్యాసకర్త: ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ మొబైల్ : 9866776999 (మోదీ ప్రభుత్వపు ‘పెగసస్’ కుట్రకు నిరసనగా, నేడు కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్‌భవన్’ చేపట్టింది) -
హైదరా‘బాధలకు’ బాధ్యులెవరు?
నిజాం కాలంలోనూ, నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ నగర రోడ్లపై రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారని గతమంతా ఘనకీర్తి. కానీ, నేడు రాజధాని మెయిన్ రోడ్లు, కాలనీలు మూసీనది మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. చిన్న వానలకే హైదరాబాద్ చిగురుటాకుల వణుకుతున్నది. లోతట్టు ప్రాంతాలు, పేదలు నివసిస్తున్న బస్తీల బాధలు వర్ణనాతీతం. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. ఎటుచూసినా, రోడ్లమీద నదులు ప్రవహిస్తున్నట్టు వరద ప్రవాహం కనబడుతోంది. జి.హెచ్.ఎం.సి ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో, హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారానికి తెరలేపింది. కానీ, హైదరాబాద్‌లో కురిసిన ఒక్క గంటసేపు వర్షం, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు చూపినట్టయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరం కంటే గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు, సచివాలయం ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్‌ను మినరల్ వాటర్‌తో నింపుతామన్నారు. మరీ, ఒక్కపూట వర్షానికే మనుషులు, కార్లు, లారీలు బైక్‌లు కొట్టుకుపోయే దుస్థితి ఎందుకొచ్చింది? నిన్నటి దాకా కరోనా, ఇప్పుడు వరదలు. హైదరాబాద్ వాసుల కష్టాలకు బాధ్యులు ఎవరు? నీరు పల్లమెరుగు. లోతట్టు ప్రాంతాల్లో, నీటి ప్రవాహ మార్గాలకు అడ్డంగా కబ్జాదారులు నిర్మాణాలు చేపట్టారు. జి.హెచ్.ఎం.సి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అనధికార కట్టడాలను, వాటి నిర్మాణ దశలోనే అడ్డుకుంటే సమస్య ఇంత తీవ్రరూపు దాల్చేది కాదు. ఇపుడు ఆ నిర్మాణాలను ఎల్ఆర్ఎస్ పేరుతో అక్రమ నిర్మాణం రెగ్యులరైజ్ చేస్తామంటున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పన కుంటుపడింది. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణనికి, నిర్వహణకు నోచుకోలేదు. జూబ్లీహిల్స్‌లో అర కిలోమీటర్ దూరానికి ఒక రోడ్డు చొప్పున నాలుగు లైన్ల రోడ్లు, సైబర్ సిటీలో కొండలు చీల్చి, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వెంచర్ల చుట్టూ రోడ్లు వేయటానికి పురపాలకశాఖ చూపిన శ్రద్ధ సగటు మనిషి తిరిగే బిజీ రోడ్ల మరమ్మతులపై చూపకపోవడం శోచనీయం. గవర్నర్ నివాసం రాజ్‌భవన్ ముందే, కార్లు మునిగే వరద ప్రవహిస్తుంది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక చెరువులా మారింది. ఇంత జరుగుతున్నా జి.హెచ్.ఎం.సి సిబ్బంది సహాయక చర్యలు అంతంత మాత్రమే. ఒకవైపు పేదల ఇండ్లు వరదలకు మునిగిపోయి, తినటానికి తిండిలేక ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడుతుంటే, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి వర్షం పడితే నీళ్ళు రాక నిప్పు వస్తుందా అని హేళన చేస్తూ, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నపుడు, కేసీఆర్ నేనున్నాననే భరోసానూ ఇవ్వలేదు. ఇంతవరకు 25 మందిని పొట్టన పెట్టుకుని, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసిన హైదరాబాద్ వరదలను ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించాలి. 150 కాలనీలలో నిరాశ్రయులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వటానికి అవసరమైన నిధులను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ద్వారా మంజూరు చేయాలి. సర్వం కోల్పోయిన చిన్న పిల్లలకు, మహిళలు, వృద్ధులకు యుద్ధప్రాతిపదికన పాలు, ఆహార పదార్థాలు అందజేయాలి. మొదటి ప్రాధాన్యతగా విద్యుత్ సదుపాయాల పునరుద్ధరణ కోసం స్తంభాలు, వైర్లు, ట్రాన్సా్ఫర్మర్లకు అవసరమైన బడ్జెట్ వెంటనే విడుదల చేయాలి. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. కొనగాల మహేష్ వ్యాసకర్త ఏఐసీసీ సభ్యులు మొబైల్ : 98667 76999 -
కొత్త సచివాలయం అవసరమా?
నగరం నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో, ఠీవిగా నిలబడి, నాడు తెలుగు రాష్ట్రాల పరి పాలన వ్యవస్థను సమర్థ వంతంగా నిర్వహించిన సచివాలయం నేడు నేలమట్టం అవుతోంది. సువిశాలమైన భవనాలు, రాష్ట్రంలో ఏ మూలకైనా పరిపాలన వ్యవహారాలు సమీక్షించగలిగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగియున్న సచివాలయంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏం ఇబ్బందులు ఉన్నాయి? అంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనకు సరిపోయిన కార్యాలయాల సమూహం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేందుకు సరిపోదా? తెలంగాణ కొత్త రాష్ట్రమే, కానీ, సచివాలయం, అసెంబ్లీ, ఇతర రాష్ట్ర కార్యాలయాలు లేని రాష్ట్రం కాదు. అన్ని సౌకర్యాలు, హంగులు ఉన్నప్పటికీ, సీఎంగా ప్రమాణం చేసిన నాటినుంచి సచివాలయానికే రాని కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు? దేశంలోని 90% సచివాలయాలతో పోలిస్తే మన ఇప్పటి సచివాలయమే కొత్తది, పైగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినది. ఎన్నో రాష్ట్రాలలో చెక్క బల్లల మీద పాలన సాగుతోంది. పరిపాలన విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతారే తప్ప రంగులద్దిన అద్దాల మేడలు చూసి కాదని పెద్దలు గ్రహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొత్త ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ఉండగా, వందల కోట్ల రూపాయల ఖర్చు చేసి కొత్తగా ప్రగతి భవన్ నిర్మించిండు. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేట్ దవాఖానలో బెడ్లు దొరకడంలేదు. కాళ్ళా వేళ్ళా పడి ఒక బెడ్ సాధిస్తే, లక్షల రూపాయల బిల్లులు కట్టాల్సిన దుస్థితి. ఇక గాంధీ, ఉస్మానియా, ఛాతీ దావాఖానలో రోగుల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో మనకు తెలుసు. పరిస్థితులు సర్దుకునేదాకా, అన్ని వసతులతో కూడిన విశాలమైన సచివాలయ భవన సముదాయాలను, కరోనా పాజిటివ్ పేషెంట్ వార్డులుగా ఉపయోగించాలనే డిమాండ్ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేతపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాల్సిన బోనులో నిలబడి, ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం సరి కాదు. ఇప్పుడు రూ. 600 కోట్లు అంచనాతో కొత్త సచివాలయం నిర్మిస్తున్నారు. ఇది ముమ్మాటికీ దుబారా వ్యయమే. ఇప్పటికైనా, కేసీఆర్ ప్రస్తుత సచివాలయం కూల్చివేతను ఆపాలి. కొత్త సచివాలయ నిర్మాణం ఆలోచనను విరమించుకోవాలి. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేం దుకు పాటుపడాలి. కావాలంటే నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేయాలి, దానికి ప్రతిపక్షాల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం, ఇప్పటికే 2 లక్షల 80 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో పొదుపు నియమాలను పాటించాలి. అతిగా ఆర్భాటాలు, డంబాచార ప్రచారాలకు, తన వ్యక్తిగత కీర్తి ప్రతిష్టల కోసం ప్రజాధానాన్ని వృ«థా చేయరాదు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధం. వ్యాసకర్త: కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు మొబైల్ : 98667 76999 -
ట్రంప్ రాకతో ఒరిగిందేంటి?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మొదటిసారి పర్యటించిన నేపథ్యంలో ఇంటా బయటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రంప్ పర్యటనలో సానుకూల చర్చలు జరిగి, హెచ్1బి వీసాల జారీ నిబంధనలు, పాల, పౌల్ట్రీ ఉత్పత్తులకు అనుమతులు, డబ్లు్య.టి.ఓ. అత్యంత అనుకూల దేశాల లిస్టు నుంచి భారత్ తొలగింపు, అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని కుట్రపూరితంగా అభివృద్ధి చెందిన 20 దేశాల లిస్టులో చేర్చటం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్‌పై స్పష్టమైన వైఖరి తదితర అంశాలపై స్పష్టత వస్తుందని ఆశించాము.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం మరొక ముఖ్యమైన అంశం. కానీ, పర్యటనలో ఈ కీలక అంశాలపై ఏమాత్రం దృష్టిసారించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రయోజనాలు మరిచి, ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్ మరియు వారి కుటుంబ సభ్యుల సేవలో తరించారు. ఈ విషయాలను ఉటంకిస్తూ, అంతర్జాతీయ మీడియా ట్రంప్ భారత పర్యటనను తూర్పారబట్టింది. ఇక ట్రంప్ పర్యటన లోతుల్లోకి వెలితే, మోదీ దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ మోడల్ అభివృద్ధి అనే బూటకపు ప్రచారం చాటున ఉన్న మకిలిని ట్రంప్ గారికి కనబడకుండా గోడ కట్టి, తద్వారా దేశ ప్రజల కళ్ళు తెరిపించారు. గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల డబ్బు ఖర్చు చేసి జనాన్ని తరలించి స్టేడియం నింపారు. మొదటి రోజు పూర్తిగా పొగడ్తలకు కేటాయించారు. మోదీ పొగడ్తలతో ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తగా, ట్రంప్ ఇంకో అడుగు ముందుకేసి మోదీ దేశభక్తికి, ఆయన చాయ్ అమ్మినట్టు జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇస్తూ పోయారు. ఇక గాంధీ నడయాడిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్, విజిటర్ రిజిస్టర్లో మన జాతిపిత మహాత్మా గాంధీ పేరును కూడా ప్రస్తావించకుండా, మోదీని పొగడడం చూస్తే సబర్మతి ఆశ్రమం యొక్క ఔన్నత్యం ట్రంప్ గారికి తెలియదు, కేవలం ఫొటోలకు పోజులు ఇవ్వటానికి సందర్శించారని అర్థమవుతుంది. నాడు–నేడు ఎప్పుడైనా అమెరికా దృష్టిలో భారత్ కేవలం వాళ్ళ ఉత్పత్తులు, రక్షణ పరికరాలు అమ్ముకునే పోటెన్షియల్ మార్కెట్ మాత్రమే. అమెరికా జాతీయ సంపదకు ప్రవాస భారతీ యులు కూడా ఎంతో దోహదపడుతున్నారు. ఈ ఏడాది 2020 చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. అక్కడ సుమారు 40 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. కిందటి ఎన్నికల్లో కేవలం 16% మాత్రమే ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేసినట్టు కొన్ని సర్వేలు తేల్చడంతో, రాబోయే ఎన్నికలును దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ పర్యటనకు వచ్చారు. ఒక రోజంతా ట్రంప్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికి, అక్కడి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కలిసే అవకాశం ఇవ్వకపోవటం, రాష్ట్రపతి విందుకు కూడా పిలువకపోవటం మోదీ ప్రభుత్వం యొక్క వివక్ష. ఒకవేళ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండివుంటే ఆ ముఖ్యమంత్రిని పిలిచేవారే కదా! ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల్లో అక్కడి ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చిన మోదీ కేజ్రీవాల్‌కు ఇవ్వకపోవడం గమనిం చాలి. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కరచాలనంతో సరిపెట్టుకోగా, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం పంపకపోవటం భారతీయ జనతా పార్టీ వివక్షకు తార్కాణం. మోదీ వ్యక్తిపూజ కోసం వెచ్చించిన సమయాన్ని కుదించి, కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల అంశాలను వివరించాల్సింది. నిత్యం భారతీయత గురించి ప్రవచించే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, ట్రంప్ పర్యటనలో భారత దేశ విదేశాంగ విధానం, దౌత్య నియమాల పరిధిని దాటి దేశ ప్రతిష్టను దిగజార్చారు. ఒక స్టేట్ గెస్ట్‌కు ఇవ్వవలసిన ప్రాధాన్యం కంటే అతిగా చేయడం ప్రధాని కుర్చీ ప్రభను పెంచదు. మోదీ, మన దేశ ఎజెండా పక్కకు పెట్టి, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి పరిమితమైనారు. మోదీ తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాల కోసం వెంపర్లాడి, భారతదేశ ప్రజల ఆత్మగౌరవం ట్రంప్ వద్ద తాకట్టుపెట్టిన తీరు బాధాకరం. వ్యాసకర్త: కొనగాల మహేష్, జాతీయ సభ్యులు, ఏఐసీసీ, మొబైల్ : 98667 76999 -
మహా కూటమి ‘మహో’దయం
మహారాష్ట్రలో రాజకీయ పోరు రసవత్తరంగా ముగి సింది. ఈ పోరులో కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన కూటమి, ప్రభుత్వ ఏర్పా టుద్వారా మహోదయానికి శ్రీకారం చుట్టింది. ఈ మొత్తం ఎపిసోడ్లో శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం దక్కగా, బీజేపీ మహాగుణపాఠం నేర్చుకుంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెం బ్లీలో, ఏ రాజకీయ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 145ను చేరుకోలేకపోవడంతో హంగ్ ఏర్పడింది. సీఎం పీఠం పంచుకునే విషయమై బీజేపీ–శివసేనల మధ్య రాజకీయ విభేదం తలెత్తింది. బీజేపీ తాము కేంద్రంలో అధికారంలో ఉండటంతో తమ వాదన చెల్లుబాటు అవుతుందనే భావనతో శివసేనను లెక్కచేయలేదు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన శివసేన కొత్త మిత్రులను వెతుక్కుంది. పలు చర్చల తరువాత కనీస ఉమ్మడి ప్రణాళికతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్– ఎన్సీపీ–శివసేనల మధ్య అంగీకారం కుది రింది. మహారాష్ట్ర ఎపిసోడ్లో గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొదటగా బీజేపీని ఆహ్వానించిన గవర్నర్, తరువాత శివసేన, ఆ తరువాత ఎన్సీపీని ఆహ్వానించారు. కానీ, గవర్నర్ ఎన్సీపీకి ఇచ్చిన గడువు పూర్తికాకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కేంద్ర కేబినేట్ ఆ సిఫార్సును ఆమోదించడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. దీనిపై కూటమి నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అత్యవసర అంశంగా పరిగణించిన కోర్టు విచారణ చేపట్టింది. ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతుంటే, హడావుడిగా అర్ధరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తేసిన గవర్నర్.. చీకట్లోనే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. అనూహ్యంగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఎరగా వేసి, ఎన్సీపీ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన బలం చూపిస్తామని బీజేపీ భావించింది. కానీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్ వైపు నిలబడటంతో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మరోవైపు కూటమి వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నవంబర్ 27, సాయంత్రం లోపు, అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేయాలని, ఫ్లోర్ టెస్ట్ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన తర్వాత తన ఓటమిని ముందే అంగీకరించిన ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దేశంలో బీజేపీ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. ఈ ఉదంతంతో తెలుగు రాష్ట్రాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాల్సింది. అక్కడ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు, పదవుల ఆశ చూపినా ఏ ఒక్కరూ వాటికి లొంగలేదు. కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన ఎమ్మెల్యేలు పార్టీల కోసం నిలబడ్డారు.162 మంది కూటమి ఎమ్మెల్యేలు ఒక్కటిగా ప్రతిజ్ఞ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, అనంతర పరిణామాలు, భవిష్యత్ మరాఠా రాజకీయాలను మలుపుతిప్పే రెండు ముఖ్యమైన సమీకరణాలను తెరపైకి తెచ్చాయి. ఒకటి, ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని ఠాక్రే కుటుంబం నుంచి మనవడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల్లో పోటీచేసి గెలి చారు. ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారి ఒకరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నారు. ఇక రెండవ విషయం, మరాఠా యోధుడు శరద్ పవార్ తరువాత ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇన్ని రోజులు శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్ మరియు కూతురు సుప్రియా మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు, తన అన్న శరద్ పవార్‌కు వ్యతిరేకంగా, అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపటంతో, ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి పవార్ వారసురాలు సుప్రియాకు మార్గం సుగమమైంది. మహారాష్ట్రలో ఈ మహా కూటమి ‘మహో’దయంతో, దేశంలో బీజేపీ ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మినహా చెప్పుకోదగిన ఏ ఒక్క పెద్ద రాష్ట్రాలలోనూ అధికారంలో లేకుండా పోయింది. మహా రాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శివసేనల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి. వ్యాసకర్త: కొనగాల మహేష్, జాతీయ సభ్యులు, ఏఐసీసీ మొబైల్ : 98667 76999 -
గ్రామ స్వరాజ్యం జాడేది?
భారత జాతిపిత మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం నేడు కనుమరుగవుతోంది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన అనంతరం, గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లిన నాడే అసలైన ప్రజాస్వామ్యమని గాంధీజీ ప్రకటించారు. స్థానిక పరిపాలన బలోపేతం చేయాలన్న గాంధీజీ స్పూర్తితో గత కాంగ్రెస్ ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణలు చేసింది. తద్వారా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ గుర్తింపు తీసుకొచ్చి, రక్షణ కల్పించారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో పాలన ఇందుకు భిన్నంగా, గత నెల రోజులుగా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రజాప్రతినిధులైన వార్డు మెంబర్లు, సర్పంచులు, మండల (ఎంపీటీసీ), జిల్లా (జడ్పీటీసీ) ప్రాదేశిక సభ్యులను స్థానిక ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక పరిపాలన నిర్వహించడం, ఆయా గ్రామాలలోని ప్రజలకు కనీస సౌకర్యాలు తాగు నీరు, పారిశుద్ధ్యం, రోడ్డు నిర్మాణం లాంటి బాధ్యతలు నిర్వహిస్తారు. కానీ, ముఖ్యమంత్రి, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను ఒకొక్కరిని ఒక్కో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇక వీళ్ళ డ్యూటీ ఏమిటంటే, గ్రామ సభలు నిర్వహించి, గ్రామంలో అబివృద్ధి సమస్యలను గుర్తించి, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి బాధ్యతలు చేపట్టడమేనట. మరీ, స్థానిక ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకులు ఏం చేయాలే?. స్థానిక సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకుల పైన ప్రభుత్వ ఉద్యోగి అజమాయిషీ ఏంటి? ఇది ‘ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క‘ అనే ప్రజాస్వామ్య మూల సూత్రాలను విస్మరించటం కాదా? గ్రామ ప్రణాళికల పేరుతో హడావుడిచేయడం ముఖ్యమంత్రికి ఇది మొదటిసారి కాదు. గతంలో ఇదే ఎజెండాను గ్రామ జ్యోతి పేరుతో అమలుచేశారు. ఎంపీటీసీలను విస్మరించి, వాళ్ళను ఈ కార్యక్రమంలో భాగస్వామ్య చేయకుండానే నిర్వహించారు. అప్పుడు కూడా, ఇదే తరహాలో గ్రామ ప్రణాళికలు రూపొందించినారు. కానీ, అవి చెత్తబుట్ట దాఖలైనాయి. ఇప్పుడు కూడా తమకు ఏదో మేలు జరుగుతుందన్న నమ్మకం సామాన్య ప్రజలలో కనబడుతలేదు. అందుకే ప్రజలు రాక గ్రామ సభలు నాలుగు గోడల మధ్య తూతుమంత్రంగా జరుగుతున్నాయి. అందులో రూపొందించే ప్రణాళికలు సంగతి ఇంకా చెప్పనవసరం లేదు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో జరుగాల్సిన పనులలో జేసీబీలు వాడుతున్నారు. రోడ్ల మరమ్మతులు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాలకు, గ్రామ పంచాయతీలకు కార్యాలయ భవనాలు లేని దుస్థితి నెలకొంది. మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ కార్యాలయలలో రోజువారీగా నిర్వహించవలసిన బాధ్యతలు నిర్వహించే సమయం ఏది?. అసలే, రెవెన్యూ సిబ్బంది భూరికార్డుల శుద్ధీకరణ పనిలో బిజీగా ఉన్నారు. రైతుల పాసుపుస్తకాలలో పొరపాట్లు ఒకరి భూమి మరొకరికి, ఎక్కువ భూమి ఉంటే తక్కువ, తక్కువగా భూమి ఉంటే ఎక్కువ రాసినవి సరిచేసే సమయంలో, ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రావటంతో వాళ్ళ అసలు పని పక్కకుపోయింది. వికారాబాద్ జిల్లాలో పంచాయితీ సెక్రటరీలు పని ఒత్తిడి తగ్గించాలని ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో కొంతమంది ఉద్యోగులకు మెమోలు జారీ చేసారు. నల్గొండ జిల్లా ఓ పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదంతా చూస్తుంటే, నాకు 2004 ఎన్నికలు గుర్తొస్తున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాలపై విసుగుచెంది ఉద్యోగులు కన్నెర్ర చేశారు. నోడల్ అధికారుల పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. జన్మభూమి తదితర కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టటానికి నాడు పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. ఇంచుమించు, ఇదే ఆవేదన తెలంగాణలో చూస్తున్నాము. కేసీఆర్ స్థానిక సంస్థలను బలహీన పరిచే స్పెషల్ ఆఫీసర్ల పాలనను ఉపసంహరించుకోవాలి. స్థానిక ఖనిజ సంపదపై అధికారం స్థానిక సంస్థలకే అప్పగించి, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నినాదాన్ని బలోపేతం చేయాలని ఆశిస్తున్నాము. మన జాతిపితకు అప్పుడే అసలైన నివాళి. కొనగాల మహేష్ వ్యాసకర్త జాతీయ సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మొబైల్: 9866776999 -
యూరియా కష్టాలు ఎవరి పాపం?
గత నెల రోజులుగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పంటలకు డోకా లేదు, ఈ ఫసలు గట్టెక్కుతం అనుకున్న రైతన్నలను ఈ ఖరీఫ్ సీజన్లో ’యూరియా’ కొరత తీవ్రంగా బాధపెడుతోంది. రైతులు ఆధార్ కార్డులు చేతబట్టి, డీ.సీ.ఎం.ఎస్.ల ముందు వారం రోజుల పాటు తిరిగితే తప్ప యూరియా బస్తాలు దొరకడం లేదు. పగలు– రాత్రి అని తేడా లేకుండా వంతుల వారిగా రైతులు క్యూలో నిలబడుతున్నారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు తిండితిప్పలు మానేసి యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు వదులుతున్నారు. అసలు రైతులకు ఇన్ని బాధలు ఎందుకు? ఈ పరిస్థితికి రావటానికి కారణం ఎవరు? ఈ యూరియా కొరత పాపం ఎవరిది? యూరియా మన రాష్ట్రంలో తయారీ కాదు. మహారాష్ట్ర, బిహార్ లాంటి పక్క రాష్ట్రాల మీద ఆదారపడాల్సిందే. సీజన్ ప్రారంభంలోనే అంచనా వేసిన మొత్తం ఎరువులను మన రాష్ట్రానికి తెచ్చి, మార్కుఫెడ్ గోదాములలో నిల్వచేసుంటే రైతులకు ఈ కష్టాలు వచ్చేవి కాదు. వర్షాలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతూనే పంటలు పచ్చగా కావాలంటే రైతులు యూరియా మందు వేయాల్సిన పరిస్థితి. అసలే ఇక్కడ మన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే, మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను నాలుగు రోజులపాటు పక్క రాష్ట్రం కర్ణాటకకు మళ్ళిం చారు. రైతులు వేసే అడుగు మందుల ద్వారా మొక్కజొన్న కర్రలకు, పత్తి చెట్లకు పూర్తి బలం చేకూర్చాలంటే తేమ అధికంగా ఉన్నపుడే యూరియా వేయవలిసి ఉంటుంది. కాలం పోతే (వానలు ఆగిపోతే) పదును లేకపోతే, ఆరుగాలం చేసిన కష్టం మట్టిలో కల్సిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, ఖరీఫ్ సీజన్ ప్రారంభించడానికి ముందే, ఈ సీజన్లో ఎంత యూరియా అవసరం పడుతుందనే లెక్కలు అంచనా వేసి, దానికనుగుణంగా యూరియా నిల్వ సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ, రాష్ట్ర వ్యవసాయ మంత్రి, అధికారులు ఏ ముందస్తు చర్యలూ చేపట్టలేదు. దీంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ. 267. కానీ, యూరియా కొరతను సాకుగా చూపి కొన్ని ప్రాంతాల్లో పెర్టిలైజర్ దుకాణాదారులు ఒక్కొక్క యూరియా బస్తా మీద రూ. 50 పెంచి అమ్ముతున్నారు. మొన్న దుబ్బాక మండల కేంద్రంలో యూరియా కోసం క్యూలో నిలబడి, అలసిపోయి ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. సీఎం సొంత ఇలాకాలో ఎరువుల కొరత ఒక రైతు ప్రాణం తీసింది. వ్యవసాయ మంత్రి రైతుల కష్టాలను హేళన చేస్తూ వెకిలిగా, అసంబద్ధంగా మాట్లాడారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరో వారం రోజుల్లో పత్తి, మొక్కజొన్న పంటలు పూతకు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి సకాలంలో యూరియా అందించకపోతే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. తరువాత రాబోయే వారం, పది దినాల్లో వరి పొలాలకు యూరియా ఎక్కువ అవసరం. కనీసం ఇప్పటికైనా, ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి, యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తెప్పించి, రైతులకు అందుబాటులో ఉంచి, పంటలను కాపాడాలి. వ్యాసకర్త: కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యులు మొబైల్ : 98667 76999 -
కాంగ్రెస్‌లో నూతన ఉత్తేజం!
ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత, రాహుల్ గాంధీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి అన్ని అనుకూలతలున్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తుంది. జమిలీ ఎన్నికల మాట అటుంచి, రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోనున్నారన్న ప్రచారం ఎక్కువైంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ దూకుడు పెంచింది. ఏఐసీసీ ప్లీనరీలో చెప్పినట్టుగా కార్యకర్తలకు అధిష్టానానికి ఉన్న అడ్డుగోడలను కూల్చివేసే ప్రక్రియ తెలంగాణ నుంచే ఆరంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీకి అన్ని సంద ర్భాలలో కేసీఆర్ మద్దతుగా నిలవటంతో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ‘బి–టీం’గా వ్యవహరిస్తోందని తేలి పోయింది. దీనితో సెటిలర్లలో, విభజన హామీలుS అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే మార్గమనే భావన ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ, అన్యాయం చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలని చూస్తున్న తరుణంలో, రాహుల్ పర్యటన తెలం గాణ ప్రజలకు భరోసా ఇవ్వనుంది. మోదీ రూపంలో ప్రజలను పట్టిపీడిస్తున్న ధరల పెరుగుదల, జీఎస్టీ భారం, బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత, అసహనం, దళితులపై దాడులు, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం తదితర అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న ద్రోహాలను రాహుల్ తన రెండు రోజుల పర్యటనలో ఎత్తిచూపనున్నారు. ఇక రాహుల్ గతంలో నామకరణం చేసినట్టు ‘మినీ మోదీ’ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎమ్మెల్యేల పదవీ కాలం రద్దు, ప్రాజెక్టుల్లో అవినీతి, ఇసుక మాఫియా, నేరెళ్ల ఘటన, కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తించకపోవటం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో స్తబ్దత, అభయ హస్తం పింఛన్లు, ఊసే లేని కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, నిర్లక్ష్యానికి గురవుతున్న ఆరోగ్యశ్రీ, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరసనలు, రేషన్ డీలర్ల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు రైతు బీమా పేరుతో తెచ్చిన పథకం 60 ఏళ్ళు నిబంధన ఇలా ప్రజలు అసంతృప్తితోవున్న అనేక అంశాలు గ్రేటర్ వేదికగా, యావత్ తెలంగాణ ప్రజల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను రాజకీయాలకు అతీతంగా సందర్శించి, విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా, ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వస్తారంటే టీఆర్ఎస్ నేతలు దీన్నీ వివాదాస్పదం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అన్ని సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పని చేస్తుంటే, టీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం అనుమతి ఇవ్వొద్దని పోటీగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి యూనివర్సిటీ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ, పార్టీ కార్యక్రమాలతో పాటు, సమాజంలోని అనేక రంగాల ప్రజలను రాహుల్ ఈ పర్యటనలో కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కూడా కలవరం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలమైన రాజకీయ శక్తి అని భావించి, ఈ మధ్యనే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు రాహుల్ పర్యటనను తమ ఉనికిని చాటుకోవడానికి అనువైన సమయంగా భావిస్తుండటంతో పాత–కొత్త కలయికతో పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగనుంది. ఊహించినట్టుగా ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లోపే వచ్చినా ఈ పర్యటనలో రాహుల్ స్ఫూర్తితో పనిచేసి, మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని, అధికారంలోకి రావాలనే ఊపు పార్టీ శ్రేణులలో కనబడుతుంది. -కొనగాల మహేష్(వ్యాసకర్త సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ -98667 76999) -
కాంగ్రెస్‌లో క్రమ‘శిక్ష’ణ
సాక్షి, హైదరాబాద్: పార్టీపరంగా అంతర్గత దిద్దుబాటు చర్యలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు, నాసిరకం నాయకత్వం లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తాజాగా ఇద్దరు అధికార ప్రతినిధులపై వేటు వేసింది. పీసీసీ అధికార ప్రతినిధులు సీహెచ్ ఉమేశ్‌రావు(సిరిసిల్ల), కొనగాల మహేశ్(వేములవాడ)ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. అధికార టీఆర్ఎస్తో లాలూచీ వ్యవహారాలు నడిపిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నియోజకవర్గాల్లో గ్రూపులను పెంచి పోషిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరే కాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా మంది నేతలపై పార్టీ నాయకత్వం నిఘా ఉంచిందని, పార్టీ లైన్ తప్పి వ్యవహరిస్తున్న వారందరికీ ఇదే నిర్ణయం వర్తిస్తుందని హెచ్చరికలు పంపింది. 15 రోజుల క్రితమే ఫిర్యాదులు ఉమేశ్, మహేశ్‌పై 15 రోజుల క్రితమే పార్టీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. నియోజకవర్గంలో గ్రూపు తగాదాలకు పాల్పడుతున్నారని, డీసీసీ నిర్ణయాలకు కట్టుబడి ఉండకుండా స్వతంత్ర కార్యాచరణతో గందరగోళం సృష్టిస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మృత్యుంజయం ఉమేశ్‌పై ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి వద్దకు మహేశ్ కాంగ్రెస్ నేతలను తీసుకెళుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిపై విచారణ జరిపిన క్రమశిక్షణా సంఘం ప్రాథమిక ఆధారాలున్నాయంటూ పార్టీకి నివేదిక ఇచ్చింది. దీంతో వీరిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమగ్ర విచారణలో వీరిపై వచ్చిన ఫిర్యాదులు నిజమని తేలితే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తప్పిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చాలామందిపై కూడా.. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలపై పార్టీపరంగా నిఘా పెట్టామని పీసీసీ నేతలు చెబుతున్నారు. పార్టీ నియమావళికి కట్టుబడని నేతలను గుర్తించే పనిలో ఉన్నామని, త్వరలోనే వారిపైనా చర్యలుంటాయని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమేశ్, మహేశ్ తరహాలోనే కొందరిపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీపరంగా నేతలంతా ఒక్కతాటిపై ఉండేలా అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించడం ఇతరులకు హెచ్చరికలు పంపడమేననే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. -
వేములవాడ టీ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు
సాక్షి, సిరిసిల్లా : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు మరో సారి భగ్గుమన్నాయి. తాజాగా సిరిసిల్లా జిల్లాలో కొనగాల మహేశ్, ఆది శ్రీనివాస్ వర్గాలుగా విడిపోయ్యాయి. దీంతో వేములవాడ పట్టణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం పాల్గొన్న సమావేశాన్ని మహేశ్ వర్గం వారు పూర్తిగా బహిష్కరించడంతో సొంత నియోజకవర్గంలోనే పొన్నంకు చుక్కెదురైంది. మాజీ ఎంపీ ప్రభాకర్ ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి.. ఆయన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్‌తో సహా, మనోహర్ రెడ్డి, చంద్రశేఖర్, గంగాధర్, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు దూరంగా ఉన్నారు. వీరంతా కలసి కోరుట్లలో క్యాంప్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వేములవాడలో పార్టీని కాపాడుకునే విషయమై ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేశ్ హైదరాబాద్ నుంచి చక్రం తిప్పుతున్నారు. -
అక్షరాలా నైతిక విజయమే
సందర్భం బీజేపీ నాయకత్వంపైకి ఎంత గంభీర ప్రకటనలు గుప్పించినప్పటికీ గుజరాత్ ఎన్నికల్లో దాని పరిస్థితి చావుతప్పి కన్నులొట్టిపోయినంత పనయింది. పరాజయంలోనూ రాహుల్ నైతిక విజయం సాధించినట్లే అయింది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన గుజరాత్ ఎన్నికల ఫలి తాలు వెలువడి నాలుగురోజు లైనా ఫలితాలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రాజకీయ విశ్లేషకులు మొదలుకుని సామాన్యులదాకా, గుజరాత్ ఎన్నికను 2019 సాధారణ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ అని భావించటమే ఈ చర్చకు కారణం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీని సొంతగడ్డపై ఓడించి, వారి ప్రజావ్యతిరేక విధానాలకు, ఒంటెత్తు పోకడలకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకుంది. రాజకీయ విలువలకు, అజెండాకు కట్టుబడి ఎన్నికల ప్రచారం సాగించింది. మరోవైపు మోదీ అభివృద్ధి అంశాన్ని, ఎన్నికల ప్రణాళికను మచ్చుకైనా ప్రస్తావించకుండా, విలువలకు తిలోదకాలిచ్చి, గుజరాత్ ప్రాంతీయ సెంటిమెంటు, కుల, మత సెంటిమెంటునే కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్‌ను కూడా ఎన్నికల ప్రచార అజెండాగా మార్చారు. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి ఒక దశలో కాంగ్రెస్ ముందంజలో ఉండటం చూసి బీజేపీ అగ్రనాయకత్వం వణికిపోయింది. చివరికి, చావు తప్పి కన్ను లొట్టపోయి 99 స్థానాలతో బయటపడింది. మోదీ దేశప్రధాని నుంచి గుజరాత్ ప్రధాని స్థాయికి దిగజారి 34 ఎన్నికల ర్యాలీలలో కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. అయినా, అన్నింటినీ ఎదుర్కొని అన్నీ తానై రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా నిలుపడమే కాకుండా, మోదీకి దీటైన ప్రత్యర్థి తానేనని, బీజేపీ మిత్రపక్షాలు సైతం ఒప్పుకునేలా రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. అందుకే, గుజరాత్ తీర్పును కాంగ్రెస్ పార్టీ నైతిక విజయంగా భావిస్తుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కొత్త పంథాను ఎంచుకుని అందరినీ ఆకట్టుకున్నారు. మోదీ ఎంత దిగజారి మాట్లాడినా, రాహుల్ ఎక్కడా తొందర పడక, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. జీఎస్టీని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని రాహుల్ నామకరణం చేశారు. ‘‘ఆలు సే సోనా నహీ నికేలేగా’’ ఆలుగడ్డ నుంచి బంగారం తీస్తామని మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ‘‘నేను అబద్ధాలు చెప్పలేను, మీకు తలా 15 లక్షలు ఇవ్వలేను’’, ‘‘మేము త్యాగాలు చేసేవాళ్ళం, మీలాగా హంతకులం కాదు’’ అంటూ మోదీ–అమిత్ షా ధ్వయం నోరు మూయిం చారు. పై అంశాలను కదిí ³తే ఎన్నికల్లో బీజేపీ నష్టపోతుందని భావించిన మోదీ ప్రధాని స్థాయి దిగజార్చి తన మార్కు మత, ప్రాంత సెంటిమెంటును భుజానేసుకున్నారు. మోదీ, తన తల్లిదండ్రులను కూడా ఈ ప్రచారంలో పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్నారు. గుళ్ళు, గోపురాలను ప్రచార అంశాలుగా మార్చారు. చివరకు దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా మోదీ ఎన్నికల ప్రచారంలోకి లాగి ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవాలని చూశారు. గుజరాత్ భౌగోళిక పరిస్థితి దృష్ట్యా చూస్తే సౌరాష్ట్ర– కచ్, ఉత్తర, మధ్య, దక్షిణ గుజరాత్ నాలుగు ప్రాంతాలు. ఉత్తర గుజరాత్ మరియు సౌరాష్ట్ర– కచ్ ప్రాంతాలు కాంగ్రెస్ కంచుకోటలుగా నిలిచాయి. గ్రామీణ ఓటర్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. గుజరాత్‌లోని 7 జిల్లాలలో బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా మనం ఊహించవచ్చు. గుజరాత్ సమాజంలో మెజారిటీ పటేళ్లు, క్షత్రియ, ఆదివాసీ, దళిత, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. ఓబీసీలు, కొలి సామాజిక వర్గాల ఓట్లు కీలక పాత్ర పోషించాయి. గుజరాత్ జనాభాలో 60% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. పట్టణ ప్రాంత ఓట్లతో బీజేపీ గట్టెక్కింది. కానీ, 2014 సాధారణ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్లు (60%)తో పోలిస్తే ఈ ఎన్నికల్లో(49%) 11% ఓట్లు తగ్గాయి. గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పూర్తిస్థాయి పరిణితిని కనబరిచారు. ఆ రాష్ట్రంలో పరస్పరం భిన్న ధ్రువాలైన హార్ధిక్ పటేల్, జిగణేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్ లాంటి కీలక సామాజిక ఉద్యమ నేతలను ఒక్కటిచేసి తన వెంట నడిపిన తీరు కాంగ్రెస్ శ్రేణులనేగాక, యూ.పి.ఎ. బాగస్వామ్య పక్షాలను మెప్పించింది. పాటిదార్లకు విద్యా ఉద్యోగాల్లో కోటా డిమాండ్ చేస్తూ హార్ధిక్ ఆందోళనలు చేస్తే, దానికి వ్యతిరేకంగా అల్పేష్ ఓబీసీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కానీ, రాహుల్ గాంధీ రాజనీతిజ్ఞత ప్రదర్శించి అల్పేష్ ఠాకూర్‌ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించటంతోపాటు, హార్ధిక్‌ను పార్టీకి మద్దతుగా ప్రచారం చేయించడంలో సఫలమయ్యారు. ఇక దళిత నాయకుడు మేవాణినికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకుండా దళితవర్గాల అభిమానం చూరగొన్నారు. దీనితో రాహుల్ కలుపుగోలు నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. మొన్న యూపీ, నేడు గుజరాత్ ఎన్నికలలో రాహుల్ అనుసరించిన వ్యూహంలో సారూప్యత ఉంది. భవిష్యత్ రాజకీయాలకు కొత్త శక్తులను సిద్ధం చేస్తున్నారు. అక్కడ అఖిలేశ్‌తో తాత్కాలికంగా నష్టపోయిన స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు గుజరాత్లో కొత్త రాజకీయ శక్తులను కూడగడుతున్నారు. 2019 ఎన్నికల ముందు మోదీ నిరంకుశ పాలనను ప్రశ్నించే శక్తులను ఏకంచేసే మహత్తరకార్యం రాహుల్ భుజస్కంధాలపై వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికల ఫలితాలు బోనస్ కింద లెక్క. కొద్దిమాసాల్లో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో పార్టీపై దీని జోష్ నేరుగా ఉంటుంది. మోదీకి సొంత రాష్ట్రంలో మూడుచెర్ల నీళ్లు తాగించామని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆ తరువాతి ప్రభావం తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుంది. గుజరాత్ తరహాలో తెలంగాణలో అధికార టి.ఆర్.ఎస్. పార్టీ వ్యతిరేక శక్తులను ఏకంచేస్తూ, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూ తిరుగులేని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. గుజరాత్ నైతిక విజయం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయం. వ్యాసకర్త అధికార ప్రతినిధి, కొనగాల మహేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ : 98667 76999 -
తెలంగాణ పయనం ఎటు?
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛ, స్వపరిపాలన, సామాజిక న్యాయంతో వర్ధిల్లాలని సకల జనులూ ఆశించారు కానీ ఉన్న కాస్త స్వేచ్ఛ కూడా హరించుకుపోతుందని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వం సాధించిన ఘనత ఏదైనా ఉందంటే అన్ని వర్గాల్లో అసంతృప్తిని పెంచడమే. తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేక స్థానం ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి, మహోన్నతమైన ప్రజా ఉద్యమాన్ని గౌరవిస్తూ, 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ సాకారం చేసిన సందర్భం. నాటి జ్ఞాపకాలు ఇప్పటికి మా కళ్లముందు కదలాడుతుం టాయి. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నాం’’ అని చిదంబరం ప్రకటించగానే తెలంగాణ నేలతల్లి పులకరిం చింది. ఆ అర్థరాత్రి ఊరు– వాడ సంబరాల్లో మునిగితేలారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మా ఆనందానికి హద్దులు లేవు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం స్వేచ్ఛ, స్వపరిపాలన, సామాజిక న్యాయంతో వర్ధిల్లాలని ఆశించాం. కాని, తరువాతి కాలంలో కేసీఆర్ నాటి ఉద్యమ లక్ష్యాలను పక్కనపెట్టి, ఉద్యమ స్ఫూర్తికి తిలోదకాలిచ్చారు. తెలంగాణలో ఏ స్వేచకోసం ఇల్లు వాకిలి, భార్యాబిడ్డలను వదిలి 1969 నుంచి 2014 దాకా వివిధ పోరాటాల్లో 1,569 మంది అమరులైనారో ఆ స్వేచ్ఛను టీఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధ తుల్లో స్వేచ్ఛగా నిరసనలు తెలియజేయటానికి అనుమతి లేదు. కోర్టు మెట్లు ఎక్కి అనుమతులు తెచ్చుకున్నా అరెస్టులు చేసి, ఆయా కార్యక్రమాలను విఫలం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో కేసీఆర్ ధర్నాలు లేని తెలంగాణ తెస్తానంటే సుభిక్షంగా పరిపాలిస్తారనుకున్నాం కానీ, ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ ఎత్తేసి ధర్నాలు లేకుండా చేస్తారని ఊహించలేదు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు అడుగుపెట్టకుండా నిర్బంధం అమలుచేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. నాడు ఎకరాకు కోటి రూపాయల పంట పండిస్తానన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ కూటికి లేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక దేవుడిపై భారమేసి బతుకులు వెళ్లదీస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ 4 విడతల వారీగా ఇవ్వడం వల్ల రైతులపై వడ్డీ, అపరాధ వడ్డీ భారం పడింది. వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చి, మాట తప్పారు. కేసీఆర్ తెలంగాణను ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా చేస్తానన్నాడు. కానీ, నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది. ఉద్యమం నాటి విద్యార్థులే నేటి నిరుద్యోగులు. వాళ్లే నాటి ఉద్యమానికి ఇంధనం. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పేరుతో ఉద్యమం నుంచి విరామం ప్రకటించిన ప్రతిసారి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది నాబోటి విద్యార్థులే. తెలంగాణ ఉద్యమంలో వందల పోలీసు కేసులు ఎదుర్కొని నేను 35 రోజులు జైలు జీవితం గడిపినపుడు కూడా బాధపడలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు ఉద్యోగాలు దొరుకుతాయని చదువులు పక్కనపెట్టి, పోటీ పరీక్షలు రాయకుండా ఉద్యమంలో పాల్గొన్న మిత్రులు నేడు ఉద్యోగాల కోసం పోరాడాల్సిన దుస్థితి చూసి బాధపడుతున్నాను. కేసీఆర్ ఇంటికో ఉద్యోగమిస్తానంటే నిరుద్యోగులు ఆశపడ్డారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఏర్పడినాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని, త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ, పావలా వంతు ఉద్యోగాలు కూడా తీసుకోలేదు. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్, సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంయుక్తంగా నిరుద్యోగ యువతపై నిర్వహించిన తాజా సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పల్చబడ్డాయి. కొత్త రాష్ట్రం రాజకీయ సంస్కరణలకు, మంచి సంప్రదాయాలకు శ్రీకారం చుట్టాల్సింది పోయి టీఆర్ఎస్ ఫక్తు దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టింది. ఉద్యమకారులను పక్కనపెట్టి నాడు టీడీపీలో ఉంటూ ఉద్యమాన్ని అవహేళన చేసి, ఉద్యమకారులపై దాడులు చేసి, తప్పుడు కేసులు పెట్టి వేధించిన తలసాని, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి లాంటి వారికి మంత్రి పదవులిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ చేత రాజీనామా చేయించకుండా మంత్రి పదవీ ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటువేయాలని సుప్రీం కోర్టు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి హైకోర్టు దాదాపు 30 సార్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టింది. గతంలో ఒక్కసారి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడా విలువలు కనీసంగా కూడా లేవు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. 42 రోజుల సకలజనుల సమ్మెను విజయవంతం చేయడానికి వాళ్ళు పోరాడిన తీరు ఆమోఘం. కానీ స్వరాష్ట్రంలో వాళ్లకు ఇబ్బందులు తప్పలేదు. ఉద్యమం నాటి ఉద్యోగ సంఘాల నాయకులు నేడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం మరిచారు. ఉద్యోగుల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 లక్షల ఉద్యోగులుంటే, అందులో ఆంధ్రప్రదేశ్ కు 5 లక్షలు తెలంగాణకు 4 లక్షల ఉద్యోగులుగా విభజన జరగాలి. కానీ ఇప్పటికీ కేవలం 58 వేల మందిని మాత్రమే విభజించారు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కనబడుతోంది. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ముందున్న మహిళలకు స్వరాష్ట్రంలో నిరాశే మిగిలింది. రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మహిళకు చోటు ఇవ్వని ఘనత కేసీఆర్‌కు దక్కింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం కరువైంది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల నుంచి స్థానిక పెత్తందారులకు అధికార బదిలీ జరిగింది తప్ప తెలంగాణలో నిజమైన స్వేచ్ఛ, స్వపరిపాలన రాలేదు. ఉద్యమంలో పాల్గొన్న అట్టడుగు వర్గాల ప్రజలకు ఉద్యమ ఫలి తాలు అందలేదు. అమరవీరుల కుటుంబాలు ఇంకా చీకటిలో మగ్గుతున్నాయి. నిరుద్యోగుల జీవితాలు లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లలో తాకట్లలో ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు నివారించే శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏది ఏమైనా, కేసీఆర్ పాలన పట్ల ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయి. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. ఉద్యమ లక్ష్యాల దిశగా ప్రభుత్వం పయనించలేదని పై వివరాలతో మనకు అర్థమౌతుంది. - కొనగాల మహేశ్ వ్యాసకర్త అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మొబైల్ : 98667 76999 -
‘బీజేపీ తెలంగాణ ద్రోహి’
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ నుంచి కనీసం ఒక్కరికి కూడా కేంద్ర మంత్రి అవకాశం ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డజన్(12) కేంద్ర మంత్రులు ఉండగా.. తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురు(3) కేంద్ర మంత్రులుండేవారని తెలిపారు. బీజేపీ ఉత్తర భారతం పార్టీ అని మరోసారి రుజువైందని ఆయన విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని బీజేపీ నుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ- బీజేపీ శాఖ నుంచి కేంద్ర మంత్రులుగా పనిచేసేందుకు ఒక్కరు కూడా సమర్దులు లేరా ? అని సూటిగా అడిగారు. విభజన హీమీలను(హైకోర్టు విభజన, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా..) అమలు చేయలేదు, ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చోటు కూడా లేదు.. తెలంగాణలో బీజేపీ నాయకులు ఏం మోహం పెట్టుకుని తిరుగుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఈ అవమానానికి బదులుగా రాబోయే ఎన్నికల్లో బీజేపీని పాతరేస్తారని అన్నారు. -
స్కూళ్ల రేషనలైజేషన్ వద్దు: కొనగాల
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 4,637 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ డిమాండ్ చేశారు. 20 మంది విద్యార్థుల కంటే తక్కువ వున్న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయలనే కుట్ర జరుగుతోందని, కార్పొరేట్ స్కూళ్లు ఇచ్చే కమీషన్ల కోసమే రేషనలైజేషన్ చేపడుతున్నారని బుధవారం ఆరోపించారు. విద్యార్థుల సంఖ్యను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి స్కూళ్లను మూసివేయలనుకోవడం సరికాదని హితవుపలికారు. రేషనలైజేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ వ్యతిరేకమని, గతంలోనే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని తెలిపారు. అయినా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. స్కూళ్లను మూసేయాలని ప్రభుత్వం భావిస్తే దాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఈ పాఠశాలలను మూసేయడం వల్ల ఉపాధ్యాయ ఉద్యోగాలు తగ్గి, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థలాన్ని డబుల్ బెడ్రూం పథకానికి వాడుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. -
పాపిరెడ్డిని అరెస్ట్ చేయాలి: కొనగల
ఈసెట్ పరీక్ష ఆలస్యంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఈసెట్ పరీక్షను ఐదు గంటలు ఆలస్యంగా నిర్వహించడానికి కారుకులైన ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని అరెస్టు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం నిర్వహించిన ఈసెట్ పరీక్షపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక అనుమానాలున్నాయని చెప్పారు. -
ఎంసెట్ టెండర్లలో అక్రమాలు: కొనగల
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణ పనులను బహిరంగ టెండర్లు పిలవకుండానే మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ సంస్థకు ప్రభుత్వం అప్పగించిందని, దీనిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో అసమర్థంగా, అవకతవకలతో ఎంసెట్‌ను నిర్వహించిన మాగ్నెటిక్ కంపెనీకే ఉన్నత విద్యామండలి బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి జైలులో ఉండేవార న్నారు. మంత్రి కేటీఆర్ జోక్యంతోనే అక్రమాలు జరిగాయని ఆరోపించారు