తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
సాక్షి, హైదరాబాద్: పార్టీపరంగా అంతర్గత దిద్దుబాటు చర్యలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు, నాసిరకం నాయకత్వం లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తాజాగా ఇద్దరు అధికార ప్రతినిధులపై వేటు వేసింది. పీసీసీ అధికార ప్రతినిధులు సీహెచ్ ఉమేశ్‌రావు(సిరిసిల్ల), కొనగాల మహేశ్(వేములవాడ)ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. అధికార టీఆర్‌ఎస్‌తో లాలూచీ వ్యవహారాలు నడిపిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నియోజకవర్గాల్లో గ్రూపులను పెంచి పోషిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరే కాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా మంది నేతలపై పార్టీ నాయకత్వం నిఘా ఉంచిందని, పార్టీ లైన్ తప్పి వ్యవహరిస్తున్న వారందరికీ ఇదే నిర్ణయం వర్తిస్తుందని హెచ్చరికలు పంపింది.
15 రోజుల క్రితమే ఫిర్యాదులు
ఉమేశ్, మహేశ్‌పై 15 రోజుల క్రితమే పార్టీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. నియోజకవర్గంలో గ్రూపు తగాదాలకు పాల్పడుతున్నారని, డీసీసీ నిర్ణయాలకు కట్టుబడి ఉండకుండా స్వతంత్ర కార్యాచరణతో గందరగోళం సృష్టిస్తున్నారని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మృత్యుంజయం ఉమేశ్‌పై ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి వద్దకు మహేశ్ కాంగ్రెస్ నేతలను తీసుకెళుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిపై విచారణ జరిపిన క్రమశిక్షణా సంఘం ప్రాథమిక ఆధారాలున్నాయంటూ పార్టీకి నివేదిక ఇచ్చింది. దీంతో వీరిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమగ్ర విచారణలో వీరిపై వచ్చిన ఫిర్యాదులు నిజమని తేలితే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తప్పిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చాలామందిపై కూడా..
గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలపై పార్టీపరంగా నిఘా పెట్టామని పీసీసీ నేతలు చెబుతున్నారు. పార్టీ నియమావళికి కట్టుబడని నేతలను గుర్తించే పనిలో ఉన్నామని, త్వరలోనే వారిపైనా చర్యలుంటాయని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమేశ్, మహేశ్ తరహాలోనే కొందరిపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీపరంగా నేతలంతా ఒక్కతాటిపై ఉండేలా అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను పార్టీ పదవుల నుంచి తప్పించడం ఇతరులకు హెచ్చరికలు పంపడమేననే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment