సందర్భం
బీజేపీ నాయకత్వంపైకి ఎంత గంభీర ప్రకటనలు గుప్పించినప్పటికీ గుజరాత్ ఎన్నికల్లో దాని పరిస్థితి చావుతప్పి కన్నులొట్టిపోయినంత పనయింది. పరాజయంలోనూ రాహుల్ నైతిక విజయం సాధించినట్లే అయింది.
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన గుజరాత్ ఎన్నికల ఫలి తాలు వెలువడి నాలుగురోజు లైనా ఫలితాలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. రాజకీయ విశ్లేషకులు మొదలుకుని సామాన్యులదాకా, గుజరాత్ ఎన్నికను 2019 సాధారణ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ అని భావించటమే ఈ చర్చకు కారణం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీని సొంతగడ్డపై ఓడించి, వారి ప్రజావ్యతిరేక విధానాలకు, ఒంటెత్తు పోకడలకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకుంది. రాజకీయ విలువలకు, అజెండాకు కట్టుబడి ఎన్నికల ప్రచారం సాగించింది. మరోవైపు మోదీ అభివృద్ధి అంశాన్ని, ఎన్నికల ప్రణాళికను మచ్చుకైనా ప్రస్తావించకుండా, విలువలకు తిలోదకాలిచ్చి, గుజరాత్ ప్రాంతీయ సెంటిమెంటు, కుల, మత సెంటిమెంటునే కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్‌ను కూడా ఎన్నికల ప్రచార అజెండాగా మార్చారు. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి ఒక దశలో కాంగ్రెస్ ముందంజలో ఉండటం చూసి బీజేపీ అగ్రనాయకత్వం వణికిపోయింది. చివరికి, చావు తప్పి కన్ను లొట్టపోయి 99 స్థానాలతో బయటపడింది. మోదీ దేశప్రధాని నుంచి గుజరాత్ ప్రధాని స్థాయికి దిగజారి 34 ఎన్నికల ర్యాలీలలో కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. అయినా, అన్నింటినీ ఎదుర్కొని అన్నీ తానై రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా నిలుపడమే కాకుండా, మోదీకి దీటైన ప్రత్యర్థి తానేనని, బీజేపీ మిత్రపక్షాలు సైతం ఒప్పుకునేలా రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. అందుకే, గుజరాత్ తీర్పును కాంగ్రెస్ పార్టీ నైతిక విజయంగా భావిస్తుంది.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కొత్త పంథాను ఎంచుకుని అందరినీ ఆకట్టుకున్నారు. మోదీ ఎంత దిగజారి మాట్లాడినా, రాహుల్ ఎక్కడా తొందర పడక, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. జీఎస్టీని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని రాహుల్ నామకరణం చేశారు. ‘‘ఆలు సే సోనా నహీ నికేలేగా’’ ఆలుగడ్డ నుంచి బంగారం తీస్తామని మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ‘‘నేను అబద్ధాలు చెప్పలేను, మీకు తలా 15 లక్షలు ఇవ్వలేను’’, ‘‘మేము త్యాగాలు చేసేవాళ్ళం, మీలాగా హంతకులం కాదు’’ అంటూ మోదీ–అమిత్ షా ధ్వయం నోరు మూయిం చారు. పై అంశాలను కదిí ³తే ఎన్నికల్లో బీజేపీ నష్టపోతుందని భావించిన మోదీ ప్రధాని స్థాయి దిగజార్చి తన మార్కు మత, ప్రాంత సెంటిమెంటును భుజానేసుకున్నారు. మోదీ, తన తల్లిదండ్రులను కూడా ఈ ప్రచారంలో పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్నారు. గుళ్ళు, గోపురాలను ప్రచార అంశాలుగా మార్చారు. చివరకు దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా మోదీ ఎన్నికల ప్రచారంలోకి లాగి ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవాలని చూశారు.
గుజరాత్ భౌగోళిక పరిస్థితి దృష్ట్యా చూస్తే సౌరాష్ట్ర– కచ్, ఉత్తర, మధ్య, దక్షిణ గుజరాత్ నాలుగు ప్రాంతాలు. ఉత్తర గుజరాత్ మరియు సౌరాష్ట్ర– కచ్ ప్రాంతాలు కాంగ్రెస్ కంచుకోటలుగా నిలిచాయి. గ్రామీణ ఓటర్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. గుజరాత్‌లోని 7 జిల్లాలలో బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా మనం ఊహించవచ్చు. గుజరాత్ సమాజంలో మెజారిటీ పటేళ్లు, క్షత్రియ, ఆదివాసీ, దళిత, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. ఓబీసీలు, కొలి సామాజిక వర్గాల ఓట్లు కీలక పాత్ర పోషించాయి. గుజరాత్ జనాభాలో 60% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. పట్టణ ప్రాంత ఓట్లతో బీజేపీ గట్టెక్కింది. కానీ, 2014 సాధారణ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్లు (60%)తో పోలిస్తే ఈ ఎన్నికల్లో(49%) 11% ఓట్లు తగ్గాయి.
గుజరాత్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పూర్తిస్థాయి పరిణితిని కనబరిచారు. ఆ రాష్ట్రంలో పరస్పరం భిన్న ధ్రువాలైన హార్ధిక్ పటేల్, జిగణేష్ మేవాని, అల్పేష్ ఠాకూర్ లాంటి కీలక సామాజిక ఉద్యమ నేతలను ఒక్కటిచేసి తన వెంట నడిపిన తీరు కాంగ్రెస్ శ్రేణులనేగాక, యూ.పి.ఎ. బాగస్వామ్య పక్షాలను మెప్పించింది. పాటిదార్లకు విద్యా ఉద్యోగాల్లో కోటా డిమాండ్ చేస్తూ హార్ధిక్ ఆందోళనలు చేస్తే, దానికి వ్యతిరేకంగా అల్పేష్ ఓబీసీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. కానీ, రాహుల్ గాంధీ రాజనీతిజ్ఞత ప్రదర్శించి అల్పేష్ ఠాకూర్‌ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించటంతోపాటు, హార్ధిక్‌ను పార్టీకి మద్దతుగా ప్రచారం చేయించడంలో సఫలమయ్యారు. ఇక దళిత నాయకుడు మేవాణినికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిని నిలపకుండా దళితవర్గాల అభిమానం చూరగొన్నారు. దీనితో రాహుల్ కలుపుగోలు నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. మొన్న యూపీ, నేడు గుజరాత్ ఎన్నికలలో రాహుల్ అనుసరించిన వ్యూహంలో సారూప్యత ఉంది. భవిష్యత్ రాజకీయాలకు కొత్త శక్తులను సిద్ధం చేస్తున్నారు. అక్కడ అఖిలేశ్‌తో తాత్కాలికంగా నష్టపోయిన స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడు గుజరాత్‌లో కొత్త రాజకీయ శక్తులను కూడగడుతున్నారు. 2019 ఎన్నికల ముందు మోదీ నిరంకుశ పాలనను ప్రశ్నించే శక్తులను ఏకంచేసే మహత్తరకార్యం రాహుల్ భుజస్కంధాలపై వేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికల ఫలితాలు బోనస్ కింద లెక్క. కొద్దిమాసాల్లో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో పార్టీపై దీని జోష్ నేరుగా ఉంటుంది. మోదీకి సొంత రాష్ట్రంలో మూడుచెర్ల నీళ్లు తాగించామని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆ తరువాతి ప్రభావం తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుంది. గుజరాత్ తరహాలో తెలంగాణలో అధికార టి.ఆర్.ఎస్. పార్టీ వ్యతిరేక శక్తులను ఏకంచేస్తూ, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూ తిరుగులేని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. గుజరాత్ నైతిక విజయం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయం.
వ్యాసకర్త అధికార ప్రతినిధి,
కొనగాల మహేశ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ : 98667 76999
Comments
Please login to add a commentAdd a comment