నిన్న, మొన్న పార్లమెంట్ దద్దరిల్లింది కరోనా, కరువు గురించిన వాగ్బాణాల వల్ల కాదు. కరోనాకు మించిన రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ కాపీయింగ్, స్వేచ్ఛను కరువు చేసే కొత్త గూఢచార సాఫ్ట్‌వేర్ పెగసస్ గురించి. వ్యక్తుల సమాచారం, కదలికలు, ఫొటోలు, మాట్లాడే కాల్స్ రికార్డు చేసే ఇజ్రాయిల్‌కు చెందిన ఈ పెగసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం కొన్నది. దాంతో వందలాదిమంది జర్నలిస్టులు, ఉద్యమకారులు, పార్లమెంట్ సభ్యులు, అధికారుల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం అంతా ఇంటలిజెన్స్ వ్యవస్థకు చేరిపోతుంది. ఈ ఉచ్చులో ప్రతి పక్షాలే కాదు, ప్రభుత్వ మంత్రులు, ఎంపీలూ ఉండటం విశేషం.
ఇజ్రాయిలీ నిఘా వ్యవస్థ పేరు మొస్సాద్ (మృత్యువు). మృత్యుముఖంలోకి అనేక దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను నెట్టివేసే స్పైవేర్ ఇజ్రాయిల్ నుంచే ఇతర దేశాలకు వచ్చింది. పెగసస్ అంటే గ్రీకు ఇతిహాసాల్లో రెక్కల గుర్రం. డ్రోన్‌తో ఎట్లా అయితే, ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చో, అంతకంటే సునా యాసంగా స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆ వ్యక్తికి తెలియకుండా ఆ ప్రాంతంలోని ఫొటోలు, మాటలు రికార్డు చేసి పంపగలదు ఈ పెగసస్. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశాడని విన్నాంగానీ, జైశ్రీరామ్ వారసులు ఇట్లా ఎగిరే అశ్వంతో వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు తెస్తారని అనుకోలేదు.
కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ఫోన్ హ్యాక్ చేయడం భార తీయ చట్టాలు అంగీకరించని తప్పుడు పద్ధతి అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా పెగసస్‌తో బీజేపీ భార తీయ జాసూస్ పార్టీ అయిందన్నారు. బీజేపీ నాయకుడు రవి శంకర్ ప్రసాద్ మాత్రం, ఫోన్ ట్యాపింగ్‌కు పెట్టింది పేరయిన కాంగ్రెస్ తమ మీద స్నూపింగ్ అభియోగం చేయడం హాస్యా స్పదం అన్నారు. రాహుల్ గాంధీ అన్ని ఫోన్ నంబర్లు, రాజకీయా లతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా సంభాషించేవి కూడా స్నూప్ అవుతున్నట్లు రూఢీ అయ్యింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, గుజరాత్ ఎన్నికల తీరుపై విమర్శలు చేసిన అశోక్ లవాస, జర్నలిస్టు సుశాంత్ సింగ్‌తో పాటు నిఫావైరస్‌పై గొప్ప పరిశోధనలు చేసిన వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ కూడా ఈ జాబి తాలో ఉన్నారు. నాపై నిఘానా అని వాపోయారు కాంగ్.
ఈ సాఫ్ట్‌వేర్ బట్టబయలుకు ముందే, భీమ్–కోరేగావ్ కేసులో అరెస్టయిన అంబేడ్కర్ మనుమడు ఆనంద్ తేల్‌తుంబ్డే తన ఫోన్ హ్యాక్ అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో మూడేళ్ల నుండి జైళ్ళో ఉన్న రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్లలోకి మాల్‌వేర్ చొప్పించినట్లు ఆర్సనాల్ కన్సల్టెన్సీ అనే అమెరికా డిజిటల్ ఫోరెన్సిక్ సంస్థ బహిర్గతం చేసింది. పెగసస్ ఆమ్నెస్టీ సంస్థ ఫోన్ నంబర్లను కూడా స్నూపింగ్ చేసింది. అంతర్గత ఎన్‌స్క్రిప్షన్‌ను పెగసస్ హ్యాక్ చేసిందని వాట్సాప్ మండిపడింది.
వంద మంది నేరస్థులు తప్పించు కున్నా ఒక్క నిరపరాధికి శిక్ష పడవద్దన్న స్ఫూర్తికి భిన్నంగా, ఎవరిని జైళ్ళో వేయాలనుకుంటే వారి కంప్యూటర్లోకి తప్పుడు సమాచారం చొప్పిస్తే సామాన్యుల పరి స్థితి ఏమిటి? ఇంకా రాజద్రోహం కేసులు అవసరమా, 70 యేండ్ల స్వాతంత్య్రం తరువాత కూడా బ్రిటిస్ వలసకాలం చట్టాలతో కాలం వెళ్ళదీద్దామా అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెగసన్ గూఢచర్యంపై కూడా స్పందిం చాలి. రానున్న కాలంలో ప్రజాస్వామిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బలోపేతం కాకుండా ఎగిరే గూఢాచారి గుర్రం అధికా రంలో ఉన్న పార్టీకి ఉపయోగ పడితే, అందుకు ప్రతిచర్య దేశ వ్యాపిత ఆందోళనగా రూపుదిద్దుకోవలసిందే.
- డా. చెరుకు సుధాకర్
వ్యాసకర్త తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
పార్లమెంటరీ కమిటీ వేయండి!
‘పెగసస్’ సెగతో వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు మొదటి రోజే హీటెక్కాయి. దేశ పౌరుల వ్యక్తిగత గోప్యత అంగట్లో సరుకైందనే వార్తతో యావ ద్దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం యథేచ్ఛగా పౌరుల జీవితాలలోకి తొంగిచూస్తున్నాయి. ఇజ్రాయిల్‌కి చెందిన ఎన్.ఎస్.ఓ అనే సంస్థ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన పెగసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను వాడి దేశంలోని ప్రతిపక్ష నాయకుల, ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్, సుప్రీం కోర్టు చీఫ్‌జస్టిస్ కుటుంబ సభ్యుల, సీనియర్ జర్నలిస్టుల, అనేక సామాజిక ఉద్యమకారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారనీ, వారి వ్యక్తిగత విషయాలను తస్కరిస్తున్నారని ఆమ్నెస్టీ, ఫొర్బిడెన్ స్టోరీస్ పరిశోధనా సారాంశం.
కాంగ్రెసు పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, తన టీంలోని 5 మంది నేతల ఫోన్లు, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీల నాయకుల ఫోన్లు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తదితరుల ఫోన్లు పెగసస్ అనే మాల్‌వేర్ ద్వారా హ్యాక్ చేసి, కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారనే అంశంపై వరుసగా రెండవ రోజూ పార్లమెంట్ స్తంభించిపోవటం చూశాం.
తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తోటి శాసన సభ్యులతో సాధారణ ఫోన్‌కాల్‌లో మనసువిప్పి మాట్లాడటానికి వణుకుతున్నారంటే పరిస్థితి అర్థమౌతుంది. సొంత పార్టీ నేతలనే వదిలిపెట్టడం లేదంటే ఇక ప్రతిపక్షంలో ఉన్న కీలక నాయకులు, కీలక శాఖల ఉన్నతాధికారుల పరిస్థితి మనం ఊహించవచ్చు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
భారత రాజ్యాంగం ఆర్టికల్–21 ప్రకారం, భారత పౌరులందరికీ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫోన్ హ్యాకింగ్/ట్యాపింగ్ ఆర్టికల్–21కు విరుద్ధం. కానీ, నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వాలే వారి వ్యక్తిగత ఫోన్లు హ్యాక్ చేసి, సమాచారం తస్కరిస్తే ఎలా? ఈ అంశంపై నిజాలు నిగ్గుతేల్చటానికి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ, పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలి.
- కొనగాల మహేష్
వ్యాసకర్త: ఏఐసీసీ సభ్యులు, తెలంగాణ
మొబైల్ : 9866776999
(మోదీ ప్రభుత్వపు ‘పెగసస్’ కుట్రకు నిరసనగా, నేడు కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్‌భవన్’ చేపట్టింది)
Comments
Please login to add a commentAdd a comment