కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వేచ్ఛ, స్వపరిపాలన, సామాజిక న్యాయంతో వర్ధిల్లాలని సకల జనులూ ఆశించారు కానీ ఉన్న కాస్త స్వేచ్ఛ కూడా హరించుకుపోతుందని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వం సాధించిన ఘనత ఏదైనా ఉందంటే అన్ని వర్గాల్లో అసంతృప్తిని పెంచడమే.
తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కి ప్రత్యేక స్థానం ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి, మహోన్నతమైన ప్రజా ఉద్యమాన్ని గౌరవిస్తూ, 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ సాకారం చేసిన సందర్భం. నాటి జ్ఞాపకాలు ఇప్పటికి మా కళ్లముందు కదలాడుతుం టాయి. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నాం’’ అని చిదంబరం ప్రకటించగానే తెలంగాణ నేలతల్లి పులకరిం చింది. ఆ అర్థరాత్రి ఊరు– వాడ సంబరాల్లో మునిగితేలారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మా ఆనందానికి హద్దులు లేవు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం స్వేచ్ఛ, స్వపరిపాలన, సామాజిక న్యాయంతో వర్ధిల్లాలని ఆశించాం. కాని, తరువాతి కాలంలో కేసీఆర్ నాటి ఉద్యమ లక్ష్యాలను పక్కనపెట్టి, ఉద్యమ స్ఫూర్తికి తిలోదకాలిచ్చారు.
తెలంగాణలో ఏ స్వేచకోసం ఇల్లు వాకిలి, భార్యాబిడ్డలను వదిలి 1969 నుంచి 2014 దాకా వివిధ పోరాటాల్లో 1,569 మంది అమరులైనారో ఆ స్వేచ్ఛను టీఆర్‌ఎస్ ప్రభుత్వం హరిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధ తుల్లో స్వేచ్ఛగా నిరసనలు తెలియజేయటానికి అనుమతి లేదు. కోర్టు మెట్లు ఎక్కి అనుమతులు తెచ్చుకున్నా అరెస్టులు చేసి, ఆయా కార్యక్రమాలను విఫలం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో కేసీఆర్ ధర్నాలు లేని తెలంగాణ తెస్తానంటే సుభిక్షంగా పరిపాలిస్తారనుకున్నాం కానీ, ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ ఎత్తేసి ధర్నాలు లేకుండా చేస్తారని ఊహించలేదు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు అడుగుపెట్టకుండా నిర్బంధం అమలుచేశారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. నాడు ఎకరాకు కోటి రూపాయల పంట పండిస్తానన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ కూటికి లేక వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక దేవుడిపై భారమేసి బతుకులు వెళ్లదీస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ 4 విడతల వారీగా ఇవ్వడం వల్ల రైతులపై వడ్డీ, అపరాధ వడ్డీ భారం పడింది. వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చి, మాట తప్పారు. కేసీఆర్ తెలంగాణను ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా చేస్తానన్నాడు. కానీ, నకిలీ విత్తనాలకు అడ్డాగా మారింది.
ఉద్యమం నాటి విద్యార్థులే నేటి నిరుద్యోగులు. వాళ్లే నాటి ఉద్యమానికి ఇంధనం. కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పేరుతో ఉద్యమం నుంచి విరామం ప్రకటించిన ప్రతిసారి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది నాబోటి విద్యార్థులే. తెలంగాణ ఉద్యమంలో వందల పోలీసు కేసులు ఎదుర్కొని నేను 35 రోజులు జైలు జీవితం గడిపినపుడు కూడా బాధపడలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు ఉద్యోగాలు దొరుకుతాయని చదువులు పక్కనపెట్టి, పోటీ పరీక్షలు రాయకుండా ఉద్యమంలో పాల్గొన్న మిత్రులు నేడు ఉద్యోగాల కోసం పోరాడాల్సిన దుస్థితి చూసి బాధపడుతున్నాను. కేసీఆర్ ఇంటికో ఉద్యోగమిస్తానంటే నిరుద్యోగులు ఆశపడ్డారు. టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఏర్పడినాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని, త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ, పావలా వంతు ఉద్యోగాలు కూడా తీసుకోలేదు. బొంబాయి స్టాక్ ఎక్సేంజ్, సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంయుక్తంగా నిరుద్యోగ యువతపై నిర్వహించిన తాజా సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది.
తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పల్చబడ్డాయి. కొత్త రాష్ట్రం రాజకీయ సంస్కరణలకు, మంచి సంప్రదాయాలకు శ్రీకారం చుట్టాల్సింది పోయి టీఆర్‌ఎస్ ఫక్తు దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టింది. ఉద్యమకారులను పక్కనపెట్టి నాడు టీడీపీలో ఉంటూ ఉద్యమాన్ని అవహేళన చేసి, ఉద్యమకారులపై దాడులు చేసి, తప్పుడు కేసులు పెట్టి వేధించిన తలసాని, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి లాంటి వారికి మంత్రి పదవులిచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ చేత రాజీనామా చేయించకుండా మంత్రి పదవీ ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటువేయాలని సుప్రీం కోర్టు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి హైకోర్టు దాదాపు 30 సార్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టింది. గతంలో ఒక్కసారి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడా విలువలు కనీసంగా కూడా లేవు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. 42 రోజుల సకలజనుల సమ్మెను విజయవంతం చేయడానికి వాళ్ళు పోరాడిన తీరు ఆమోఘం. కానీ స్వరాష్ట్రంలో వాళ్లకు ఇబ్బందులు తప్పలేదు. ఉద్యమం నాటి ఉద్యోగ సంఘాల నాయకులు నేడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం మరిచారు. ఉద్యోగుల విభజనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 లక్షల ఉద్యోగులుంటే, అందులో ఆంధ్రప్రదేశ్ కు 5 లక్షలు తెలంగాణకు 4 లక్షల ఉద్యోగులుగా విభజన జరగాలి. కానీ ఇప్పటికీ కేవలం 58 వేల మందిని మాత్రమే విభజించారు. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కనబడుతోంది. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ముందున్న మహిళలకు స్వరాష్ట్రంలో నిరాశే మిగిలింది. రాష్ట్ర క్యాబినెట్‌లో ఒక్క మహిళకు చోటు ఇవ్వని ఘనత కేసీఆర్‌కు దక్కింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం కరువైంది.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల నుంచి స్థానిక పెత్తందారులకు అధికార బదిలీ జరిగింది తప్ప తెలంగాణలో నిజమైన స్వేచ్ఛ, స్వపరిపాలన రాలేదు. ఉద్యమంలో పాల్గొన్న అట్టడుగు వర్గాల ప్రజలకు ఉద్యమ ఫలి తాలు అందలేదు. అమరవీరుల కుటుంబాలు ఇంకా చీకటిలో మగ్గుతున్నాయి. నిరుద్యోగుల జీవితాలు లైబ్రరీలో, కోచింగ్ సెంటర్లలో తాకట్లలో ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు నివారించే శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏది ఏమైనా, కేసీఆర్ పాలన పట్ల ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయి. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. ఉద్యమ లక్ష్యాల దిశగా ప్రభుత్వం పయనించలేదని పై వివరాలతో మనకు అర్థమౌతుంది.
- కొనగాల మహేశ్
వ్యాసకర్త అధికార ప్రతినిధి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
మొబైల్ : 98667 76999
Comments
Please login to add a commentAdd a comment