‘పై-లీన్’పై అప్రమత్తంగా ఉండాలి
Published Sun, Oct 13 2013 1:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
సాక్షి, కాకినాడ : పై-లీన్ తుపాను ముప్పు నుంచి ప్రజలును గట్టెక్కించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ప్రత్యేకాధికారి ముద్దాడ రవిచంద్ర అన్నారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాల్లో కలెక్టర్ నీతూ ప్రసాద్‌తో కలసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ట్రెయినీ కలెక్టర్ కర్ణన్, జిల్లా ఎస్పీ శివశంకరరెడ్డి పాల్గొన్నారు. తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఏర్పా ట్లు చేపట్టామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్డును శనివారం సాయంత్రం నుంచి మూసి వేస్తున్న ట్టు చెప్పారు. హెచ్చరిక చర్యలు ఉపసంహరించుకునేంత వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరు అశ్రద్ధ చేసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.
25 వేల మంది తరలింపు
కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ తుపాను కారణంగా లక్షా యాభై వేల మంది జనాభాకు ఇబ్బందులు ఎదురు కావచ్చన్నారు. ముంపు ప్రాంతాల నుంచి భద్రత కోసం దాదాపు 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. గత నీలం తుపానును దృష్టిలో పెట్టుకుని అన్నవరం పంపా రిజర్వాయర్ పొంగి పొర్లితే ఎదురయ్యే ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి జేడీ విజయకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి పంట ఉందని, దీనిలో 1.64 లక్షల హెక్టార్ల పంట అంకుర దశలో ఉందన్నారు. పంటకు ప్రస్తుతం ఐదు సెంటీ మీటర్ల నీరు పెట్టి ఉందన్నారు.
భారీ వర్షాలు పడితే 15 సెంటీ మీటర్ల ఎత్తున నీరు పారి నష్టం సంభవించనున్న క్రమంలో ముందుగానే పెట్టిన నీటిని వదిలి వేయాలని సూచించామన్నారు. మత్స్య శాఖ అధికారి నందయ్య మాట్లాడుతూ ఎలాంటి విపత్తు ఎదురైనా 5వేలకు పైబడి బోట్లు ఉన్నాయని, వీటిలో 579 మెకనైజ్డ్ , 1746 మోటార్ బోట్లు, 2758 కంట్రీ బోట్లు ఉన్నాయన్నారు. వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేకాధికారి రవిచంద్ర సమీక్షించారు. అనంతరం 12 తీర ప్రాంత మండలాల తహశీల్దార్‌లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి
పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Advertisement