చుక్కల్లో ‘సన్నాలు’ | small rice price increased | Sakshi
Sakshi News home page

చుక్కల్లో ‘సన్నాలు’

Published Tue, Dec 24 2013 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

small rice price increased

ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం బ్రాండేడ్ జై శ్రీరాం బియ్యం క్వింటాల్‌కు రూ.4,800 ఉండగా, ప్రస్తుతం రూ.5,800 చేరాయి. లోకల్ జైశ్రీరాం రూ.4,200 నుంచి రూ.5,200, బీపీటీ రూ.3,400 నుంచి రూ.4,000, హెచ్‌ఎంటీ రూ.4,000 నుంచి రూ.4,600 పెరిగాయి. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు జంకుతున్నారు.
 తుపాన్ ప్రభావం.. మిల్లర్ల మాయాజాలం
 ఇటీవల ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన నీలం, పై-లీన్, హెలెన్ తుపాన్‌ల ప్రభావంతో తీవ్రంగా పంటల నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో వరి పంటలపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆంధ్రలో పంటలు నష్టపోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు టన్నుల కొద్ది బియ్యం ఎగుమతి అవుతున్నాయి. దీనికి తోడు రైస్ మిల్లుర్లు, వ్యాపారులు  కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ ఉంచిన మిల్లర్లు అక్రమార్జన కోసం  ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం బియ్యం ధరలు నియంత్రించక పోవడంతో ప్రజలు వ్యాపారులు చెప్పిన ధరలకే కొనాల్సి వస్తుంది. జిల్లాలో కూడా ఈఏడు అత్యధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఏటా ఆంధ్ర ప్రాంతం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు మహారాష్ట్ర నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. కానీ, ఈసారి జిల్లా నుంచే ఎగుమతి చేయడంతో కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement