increased price
-
మిర్చి ‘ధర’హాసం
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా కష్టకాలంలోనూ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి వచ్చే సమయానికి కరోనా వైరస్ వ్యాప్తితో గుంటూరు మార్కెట్ యార్డు మూతపడి లావాలాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తాము పండించిన మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని 118 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు కోటి టిక్కీలకు పైగా సరుకు నిల్వ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అమ్మకాలు మొదలైన 60 లక్షల టిక్కీలను విక్రయించగలిగారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 40 లక్షలకు పైగా మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నాయి. (చదవండి: మిరపకాయలతో గుండెపోటుకు చెక్!) కలిసొచ్చిన ఎగుమతులు ►గత నెలతో పోలిస్తే ఈ నెలలో మిర్చి ధరలు క్వింటాకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మిర్చి పంట ఆలస్యం కావడంతో మన రాష్ట్రంలోని మిర్చికి డిమాండ్ పెరిగింది. ►దీనికి తోడు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం మిర్చి రైతులకు కలిసొచ్చింది. ►గుంటూరు జిల్లాలో దాదాపు 1.95 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ►దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధరలు సైతం బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు ►కరోనా నేపథ్యంలో మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అనంతరం క్రయవిక్రయాలు మొదలైనా రోజుకు కేవలం 10 వేల టిక్కీల లోపు మాత్రమే అమ్ముడయ్యేవి. ►సొంత గ్రామాలకు వెళ్లిన కూలీలు తిరిగి రావడం, ధరలు సైతం పెరగడంతో మిర్చి క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. ►గుంటూరు మార్కెట్ యార్డులో ప్రస్తుతం రోజుకు సగటున 20 వేల టిక్కీల వరకు మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ►బయట కోల్డ్ స్టోరేజీల్లో సైతం రోజుకు 30 వేల టిక్కీల వ్యాపారం సాగుతోంది. రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. రైతులు పంటను విక్రయించుకోవడానికి వీలుగా అన్ని వసతుల్ని మార్కెట్ యార్డులో కల్పిస్తున్నాం. ధరలు సైతం స్థిరంగా ఉండి కొంత పెరగడంతో రైతులు సరుకును అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి, గుంటూరు (చదవండి: ఇదీ పౌష్టికాహార మెనూ..) -
పెరిగిన నీలి కిరోసిన్ ధర
తొర్రూరు రూరల్(పాలకుర్తి): రేషన్ దుకాణాల్లో నీలి కిరోసిన్ ధర పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడింది. కిరోసిన్‌ను అధిక శాతం నిరుపేదలే వినియోగిస్తుంటారు. ధరలు పెరగడంతో కిరోసిన్ కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్న పేదలను కిరోసిన్ ధర మరింత కుంగదీస్తోంది. నెలన్నర క్రితం లీటర్‌కు రూ.15 నేడు రూ.27కు చేరుకుంది. ప్రజలపై రూ. 27.78లక్షల భారం జిల్లాలో 553 రేషన్ దుకాణాలు, 2,31,580 కార్డులు ఉన్నాయి. ఒక్కో రేషన్ కార్డుకు లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. రెండేళ్లలో అదనంగా రూ.12 పెంచడంతో ప్రజలపై రూ.27.78లక్షల భారం పడుతోంది. పెరిగిన ధరలతో కిరోసిన్ కొనుగోలు చేయలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రైవేటు మార్కెట్లో లీటర్ కిరోసిన్ ధర రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. ధరలతో ప్రైవేటులో, రేషన్ దుకాణాల్లో కొనలేని పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు. గత ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసేది. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్ మాత్రమే ఇస్తున్నారు. బియ్యం ధర అందుబాటులో ఉన్నప్పటికీ కిరోసిన్ ధర కూడా తగ్గించాలని స్థానికులు కోరుతున్నారు. కిరోసిన్ ధర తగ్గించాలి లీటర్ కిరోసిన్ రూ.27కు కొనాలంటే కష్టంగా ఉన్నది. అంతకుముందు రూ.15కు పోసేవాళ్లు. గ్యాస్ పొయ్యి కొనే స్థోమత లేదు. కిరోసిన్ స్టవ్ పెట్టుకుందామంటే దాని ధర కూడా పెరిగింది. ప్రభుత్వం ఆలోచించి ధర తగ్గించాలి. – గుగులోతు బీకి, గుడిబండ తండా, తొర్రూరు సామాన్యులపై భారం పడుతోంది రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఒక్క కార్డుకు లీటరు కిరోసిన్ మాత్రమే ఇస్తోంది. రెండు, మూడు నెలలకోసారి ధరలు పెంచుతున్నారు. దీంతో మాపై భారం పడుతుంది. గతంలోమాదిరి పప్పు, చింతపండు, చక్కర, తదితర వస్తువులు ఇవ్వాలి. – దండె సురేష్, ఫత్తేపురం, తొర్రూరు ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకే కిరోసిన్ పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే అలాగే డీలర్లకు సరఫరా చేస్తున్నాం. కిరోసిన్ ధరలు తగ్గించాలని ఉన్నతాధికారులను కోరతాం. – జి.నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ఎకరా రూ. 5 కోట్లు పై మాటే!
బుచ్చెయ్యపేట: రియల్ ఎస్టేట్ వ్యాపారం పుణ్యమా అని పంట భూములన్నీ ప్లాట్లుగా పెరిగిపోవడంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఎకరా రూ.10 లక్షలు కూడా పలకని భూములు ఇప్పుడు ఏకంగా రూ.కోటి పైమాటే. రావికమతం సెం టర్లో అయితే సెంటు భూమే రూ.7 లక్షలు దాటి ఉంటోంది. అం టే ఎకరా ఏడు కోట్లు. రావికమతం సమీపంలో గ్రామా లు ఎక్కువగా ఉండ టం, బిజినెస్ పా యింట్ కావడంతో అక్కడ ఆ రేటు పలుకుతోంది. ఇక వడ్డాది జంక్షన్లో అయితే మాడుగుల వెళ్లే రోడ్డులో సెంటు రూ.3 లక్షలు, చోడవరం వెళ్లే రోడ్డులో 2 లక్షలు, నర్సీపట్నం వెళ్లే రోడ్డులో 4 లక్షలు, జాలంపల్లి రోడ్డులో సెం టు రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతోంది. పెరిగిన డిమాండ్ వడ్డాది, బంగారుమెట్ట, విజయరామరాజుపేట తదితర గ్రామాల్లో ఇప్పుడు భూమి బంగారంగా మారింది. భీమునిపట్నం వయా చోడవరం మీదుగా నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో ఉన్న భూములు ఇటీవల విపరీతంగా పెరిగాయి. లోపూడి వద్ద కొత్తగా డీఆర్డీవోకు చెందిన సైనిక శిక్షణ కేంద్రం, పామాయిల్ ఫ్యాక్టరీ, డాల్ఫిన్ కూలింగ్ కేంద్రంతోపాటు పలు ఫ్యాక్టరీలు ఈ రోడ్డులోనే ఉన్నాయి. మెయిన్‌రోడ్డు కావడంతో ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా వడ్డాది– రావికమతం రోడ్డు మారింది. రియల్టర్లు ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు కోసం వస్తుండటంతో ఇక్కడి భూములకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. బీఎన్ రోడ్డుకు సమీపంలోనే కొండెంపూడి రెవెన్యూలో వ్యవసాయ పరిశోధనకు కృషి విజ్జాన కేంద్రం(కేవీకే) ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడంతో ఇక్కడి భూములకు గిరాకీ పెరిగింది. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు సెంటు రూ.50వేలు నుంచి రెండు లక్షల వరకు పలుకుతుంది. అంటే ఎకరా రూ.కోటి పైమాటే. భారీగా క్రయవిక్రయాలు మల్లాం, రాజాం ప్రాంతంలో ఎస్ఈజెడ్ కోసం సేకరించేందుకు మొదట్లో అధికారులు ప్రయత్నించగా అదే ప్రదేశంలో ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు పెట్టేందుకు కొందరు ముందుకు రావడంతో ఇప్పుడే ఎకరా రూ.20–30లక్షలు వరకు అమ్ముతోంది. వ్యాపార లావాదేవీ కేంద్రంగా విస్తరిస్తున్న, మారుమూల ఉన్న సీతయ్యపేట నాల్గురోడ్ల జం„ý న్లో సైతం లక్షలాది రూపాయలు పలుకుతోంది. శ్రావణమాసం మంచి రోజులు కావడంతో ఇటీవల భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. దీనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో సామాన్యులు సెంటు భూమి కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు. -
చుక్కల్లో ‘సన్నాలు’
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు సన్న బియ్యం కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల్లో క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం బ్రాండేడ్ జై శ్రీరాం బియ్యం క్వింటాల్‌కు రూ.4,800 ఉండగా, ప్రస్తుతం రూ.5,800 చేరాయి. లోకల్ జైశ్రీరాం రూ.4,200 నుంచి రూ.5,200, బీపీటీ రూ.3,400 నుంచి రూ.4,000, హెచ్ఎంటీ రూ.4,000 నుంచి రూ.4,600 పెరిగాయి. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు పెరగడంతో ప్రజలు జంకుతున్నారు. తుపాన్ ప్రభావం.. మిల్లర్ల మాయాజాలం ఇటీవల ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన నీలం, పై-లీన్, హెలెన్ తుపాన్ల ప్రభావంతో తీవ్రంగా పంటల నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో వరి పంటలపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆంధ్రలో పంటలు నష్టపోవడంతో బియ్యం కొరత ఏర్పడింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు టన్నుల కొద్ది బియ్యం ఎగుమతి అవుతున్నాయి. దీనికి తోడు రైస్ మిల్లుర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధాన్యాన్ని నిల్వ ఉంచిన మిల్లర్లు అక్రమార్జన కోసం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. ప్రభుత్వం బియ్యం ధరలు నియంత్రించక పోవడంతో ప్రజలు వ్యాపారులు చెప్పిన ధరలకే కొనాల్సి వస్తుంది. జిల్లాలో కూడా ఈఏడు అత్యధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఏటా ఆంధ్ర ప్రాంతం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తోపాటు మహారాష్ట్ర నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. కానీ, ఈసారి జిల్లా నుంచే ఎగుమతి చేయడంతో కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయి.