జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఉద్యమం ప్రారంభమై 71 రోజులు గడిచినా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె ఆపేది లేదని, వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. ఉద్యోగులు వరుసగా రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌ల కార్యకలాపాలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎన్‌జీఓ ఉద్యమ కార్యాచరణలో భాగంగా వరుసగా రెండో రోజు ఒంగోలు నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, బ్యాంక్‌శాఖలను మూయించారు. ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక స్థానిక కలెక్టరేట్ వద్ద టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
జిల్లావ్యాప్తంగా...
అద్దంకిలో రెండో రోజూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఉద్యోగులు బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పంగులూరులో జేఏసీ నాయకులు కేంద్రప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. చీరాలలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు సాగుతున్నాయి. వేటపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. కారంచేడులో ఎన్‌జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. దర్శిలోనూ రెండో రోజు కేంద్ర కార్యాలయాలు, బ్యాంక్‌లను అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా ఉద్యోగులు అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. గిద్దలూరులో రాష్ట్ర విభజన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 5వ రోజుకు చేరాయి. పట్టణంలోని ముస్లింలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ దీక్షా శిబిరంలో శ్రీసాయిశ్రీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు రిలే నిరాహార దీక్షలు చేశారు. 23 మంది విద్యార్థినులు దీక్షల్లో కూర్చున్నారు. అంతకు ముందు వైఎస్సార్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. కంభంలో వైఎస్సార్ సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాచర్లలో భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో చేశారు.
మెడకు ఉరితాళ్లతో నిరసన
కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉద్యోగులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురంలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూయించారు. ఉద్యోగులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి గొడుగులతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి, మానవహారం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు.
పట్టు వదలం.. 71వ రోజుకు చేరిన ఉద్యమం
Published Thu, Oct 10 2013 7:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement