samikyandhara
-
సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలి
కర్నూలు(అగ్రికల్చర్): సమైక్యాంధ్ర పరిరక్షణకు 80 రోజుల పాటు చేపట్టిన సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవులుగా ప్రకటించాలని ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. నగరంలోని కేవీఆర్ కళాశాల సమావేశ మందిరంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు.. హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు 13 జిల్లాల స్థితిగతులపై సమీక్షించారు. జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పలు డిమాండ్లు, సమస్యలను రాష్ట్ర కార్యవర్గం ముందుంచారు. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పీఆర్సీ కోసం కమిటీ వేశారని.. రెండు నెలల క్రితమే కమిటీ నివేదిక అందజేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం తగదన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధమని, అవసరమైతే అదనపు గంటలు కూడా పని చేస్తామన్నారు. విజయవాడలోనూ, అసెంబ్లీలో ప్రకటించినట్లుగా కాంట్రాక్ట్, కంటింజెంట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసేందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసేందుకు వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారి వీరేంద్రబాబు, ఉపాధ్యక్షులు జి.రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, రవిశంకర్, విద్యాసాగర్, శివారెడ్డి,రమణ, కార్యదర్శులు లూక్, గంగిరెడ్డి, నరసింహారావు, నరసింహులు.. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, శ్రీరాములు, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త శాఖ గురించి ఇప్పుడే మాట్లాడను: శైలజానాథ్
కొత్తగా అప్పగించిన మంత్రిత్వ శాఖ గురించి ఇప్పడే స్పందించనని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... 2014లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు శాసన సభ వ్యవహారాల శాఖను పర్యవేక్షిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన డి.శ్రీధర్ బాబును సీఎం కిరణ్ ఆ బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను ఎస్. శైలజానాథ్‌కు అప్పగించారు. శ్రీధర్ బాబుకు వాణిజ్య పన్నుల శాఖను కట్టబెట్టారు. అయితే ఆ బాధ్యతలను తాను స్వీకరించనని శ్రీధర్ బాబు ఇప్పటికే కరఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే. మంత్రుల శాఖల మార్పుపై శైలజానాథ్‌ను బుధవారం విలేకర్లను ప్రశ్నించారు. ఈ సందర్బంగా శైలజానాథ్‌పై విధంగా స్పందించారు. -
పట్టు వదలం.. 71వ రోజుకు చేరిన ఉద్యమం
జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమ హోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఉద్యమం ప్రారంభమై 71 రోజులు గడిచినా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె ఆపేది లేదని, వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. ఉద్యోగులు వరుసగా రెండో రోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌ల కార్యకలాపాలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎన్జీఓ ఉద్యమ కార్యాచరణలో భాగంగా వరుసగా రెండో రోజు ఒంగోలు నగరంలో బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, బ్యాంక్శాఖలను మూయించారు. ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక స్థానిక కలెక్టరేట్ వద్ద టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా... అద్దంకిలో రెండో రోజూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఉద్యోగులు బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పంగులూరులో జేఏసీ నాయకులు కేంద్రప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. చీరాలలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. టీడీపీ కార్యకర్తల రిలే దీక్షలు సాగుతున్నాయి. వేటపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. కారంచేడులో ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. దర్శిలోనూ రెండో రోజు కేంద్ర కార్యాలయాలు, బ్యాంక్‌లను అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా ఉద్యోగులు అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. గిద్దలూరులో రాష్ట్ర విభజన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జగన్మోహన్రెడ్డి దీక్షలకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలు 5వ రోజుకు చేరాయి. పట్టణంలోని ముస్లింలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ దీక్షా శిబిరంలో శ్రీసాయిశ్రీ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు రిలే నిరాహార దీక్షలు చేశారు. 23 మంది విద్యార్థినులు దీక్షల్లో కూర్చున్నారు. అంతకు ముందు వైఎస్సార్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. కంభంలో వైఎస్సార్ సీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాచర్లలో భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో చేశారు. మెడకు ఉరితాళ్లతో నిరసన కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వైద్యశాఖ ఉద్యోగులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురంలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూయించారు. ఉద్యోగులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి గొడుగులతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి, మానవహారం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు.