7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహణ
9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. లక్ష మందితో సభ
కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశం
విజయోత్సవాలపై అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై బుధవారం ఆమె సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చివరి మూడు రోజుల్లో మ్యూజికల్ నైట్‌తో పాటు నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా సంఘాలు, రెస్టారెంట్లు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో 120 స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
భారీ స్థాయిలో డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్ షో వంటి కార్యక్రమాలుంటాయన్నారు. 7న వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లిగంజ్ ఆధ్వర్యంలో సినీ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని వివరించారు. ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లక్ష మంది మహిళలతో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.
అనంతరం పెద్ద ఎత్తున డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్‌షో ఉంటుందని, ఆ తర్వాత సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలో ఐమాక్స్ హెచ్‌ఎండీఏ మైదానంలో మ్యూజికల్ నైట్ జరుగుతుందని తెలిపారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి పీవీమార్గ్ వరకు ఐదు ప్రాంతాల్లో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇదే మార్గంలో ఫుడ్ స్టాల్స్, హస్తకళల స్టాల్స్, పలు శాఖల స్టాల్స్‌తో పాటు సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ట్యాంక్‌బండ్ నుంచి రాజీవ్ గాంధీ జంక్షన్, సచివాలయం, ఇందిరా గాంధీ విగ్రహం, ఐమాక్స్ జంక్షన్ నుంచి పీవీ నర్సింహారావుమార్గ్ వరకు పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆమె అధికారులను కోరారు. పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు తాగునీరు, టాయ్‌లెట్ల సదుపాయం, భద్రత కల్పించడం, పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment