మానండి.. మారండి | Special Story On Deputy Commissioner Nagalakshmi Ramawat | Sakshi
Sakshi News home page

మానండి.. మారండి

Published Mon, Jan 6 2020 2:03 AM | Last Updated on Mon, Jan 6 2020 2:03 AM

Special Story On Deputy Commissioner Nagalakshmi Ramawat - Sakshi

నాగలక్ష్మి రమావత్, డిప్యూటీ కమిషనర్

‘అందరూ బాగుండాలి... ఆ అందరిలో నేనూ ఉండాలి’ అనుకుంటే... అది ఒక మంచి ఆలోచన. ‘ఒకరితో నాకు పనేంటి.. నేను మాత్రమే బాగుండాలి’ అనుకుంటే... అది స్వార్థానికి పరాకాష్ట. ‘నేను బాగున్నాను.. నాతోపాటు సమాజం కూడా బాగుండాలి’ అనుకుంటే... అది ఉదాత్తమైన భావన, ఒక మంచికి పునాది. అలాంటి పునాది రాళ్లను వేసుకుంటూ వస్తున్నారు డిప్యూటీ కమీషనర్‌ నాగలక్ష్మి. తండ్రి తాగుడికి బానిసై ప్రాణాల మీదికి తెచ్చుకోవడంతో.. ఆయనపై ఉన్న ప్రేమ వల్ల.. సారా తయారీని అంతమొందించే బాధ్యతను తన ఉద్యోగ బాధ్యతలలో ఒక భాగంగా చేసుకున్నారు.

‘‘మా అమ్మ పడిన కష్టాలు మరే మహిళకూ రాకూడదనుకున్నాను. అందుకే సారాకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యవంతం చేస్తున్నాను’’ అన్నారు నాగలక్ష్మి. తండా నాగలక్ష్మి రమావత్‌ది అనంతపురం జిల్లా పెనుగొండ మండలం, అడదాకుల పల్లి తండా. తండ్రి రామానాయక్‌ ఒక ఎన్‌జీవోలో వాచ్‌మన్‌గా చేసేవారు. ఆ ఉద్యోగంలో ఆయన బాగా చదువుకున్న వాళ్లను, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్లను దగ్గరగా చూస్తుండటంతో వారి స్ఫూర్తితో తన కూతుళ్లకు కూడా పెద్ద ఉద్యోగాల్లో చేరి జిల్లా అధికారులు కావాలని చెప్పేవారు. పిల్లల్ని బాగా చదివించడానికి కుటుంబాన్ని అనంతపురం పట్టణానికి మార్చారాయన. కూతుళ్లు ముగ్గురినీ స్కూళ్లలో చేర్చారు. రామానాయక్‌ నిరక్షరాస్యుడు. అయినా సరే రోజూ తెల్లవారి ఐదు గంటలకు వెళ్లి పేపర్‌ కొనుక్కొచ్చేవాడు. కూతుళ్లు చదువుతుంటే వినేవాడు. సామాజిక, రాజకీయ పరిణామాలను సమగ్రంగా తెలుసుకునేవాడాయన. ఆయనలో ఎంత విజ్ఞత ఉన్నప్పటికీ మద్యం విషయంలో విచక్షణ లేకపోవడంతో తమ కుటుంబం తీవ్రమైన కష్టాలపాలయినట్లు చెప్పారు నాగలక్ష్మి. ఆయన తాగి తాగి యాభై ఏళ్ల లోపలే చనిపోయారు.

శ్రీకాకుళంలో కొత్త ప్రపంచం
శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఉద్యోగంలో చేరడం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పిందనే చెప్పాలి. అక్కడ మారుమూల ప్రాంతాలకు రోడ్డు కూడా ఉండదు. అక్కడి వాళ్లకు నాగరిక సమాజంతో సంబంధాలు పెద్దగా ఉండవు. అక్కడి గిరిజనులకు బియ్యం కూడా ఉండవు. నూకల్లో తెల్ల గుళికల్లాంటి ఉండలను వేసి చిక్కటి గంజిలా కాచి, ఆ గంజిని పులవబెట్టి తాగుతారు. ఆ గంజి తాగితే రోజంతా మత్తుగా పడుంటారు. అందుకని అక్కడ ప్రతి శనివారం ఒక్కో గ్రామానికి వెళ్లి కుటుంబానికి ఐదు కేజీల బియ్యం, లీటరు నూనె, కేజీ చక్కెర పంపిణీ చేయడం మొదలుపెట్టాం. కర్నూలు జిల్లాలో పనిచేసిన రోజుల్లో పత్తికొండలో 24 తండాల్లో సారా వ్యతిరేక చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాను. కొన్ని గ్రామాల్లో అందరి చేత ప్రతిజ్ఞ చేయించగలిగాం. మా వాళ్లు సారా బట్టీలను వెతికి పట్టుకుని పగలకొట్టేవాళ్లు. మరో టీమ్‌ గ్రామస్థులను సమావేశ పరిచి సారా తాగడంతో వచ్చే అనారోగ్యాలను వివరించేది.

మా టీమ్‌లో డాక్టర్‌ను కూడా తీసుకెళ్లి లివర్, కిడ్నీ పాడయిన వాళ్లను చూపించి మరీ వివరించేవాళ్లం. మేము అధికారాన్ని ప్రదర్శిస్తే వాళ్లు కూడా మొండిగా ఉండేవాళ్లేమో. నేను తండావాసులతో మా బంజారా భాషలో మాట్లాడతాను. మా నాన్న... సారాకు బానిసయ్యి ప్రాణాలు కోల్పోయిన సంగతి వాళ్లకు చెబుతాను. మా అమ్మ, ఆమె అక్కచెల్లెళ్లు చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. వయసులో ఉన్న మహిళకు భర్త తోడు లేకపోతే సమాజంలో ఎదురయ్యే వేధింపులను దగ్గరగా చూసినదాన్ని కావడంతో ఆ కష్టాలు మరే మహిళకూ రాకూడదని వాళ్లను వేడుకుంటాను. ఒక్క సమావేశంలోనే పూర్తిగా మారరు, ఆలోచనలో పడతారంతే. ఐదారుసార్లు కలిసిన తర్వాత ‘సారా తాగము– సారా కాయము’ అని ప్రతిజ్ఞ చేయిస్తాం. కౌన్సెలింగ్‌లతో దారికి రాని వాళ్ల విషయంలో స్ట్రిక్టుగానే ఉంటాం. సారా తయారు చేసేవాళ్లతోపాటు సారా తయారీకి భూమి ఇచ్చిన వాళ్ల మీద కూడా కేసులు పెడుతున్నాం.

నాయకుల నుంచి ఫోన్‌ కాల్‌
సారా బట్టీలను, తయారీని చూస్తే కడుపులో తిప్పినట్లవుతుంది. బెల్లం ఊటను మరిగించేటప్పుడు ఇంకా ఏంటేంటో పదార్థాలు వేస్తుంటారు. వాటితోపాటు కుంకుడుకాయలు, ఆకులు, పుల్లలు, పాములు, తేళ్లు, జెర్రులు, బల్లులు కూడా కలిసిపోతుంటాయి. వాటి విషం కూడా సారాలోకి దిగుతుంది. ప్రాణాల మీదకు వచ్చేది ఇలాంటి సారా తాగినప్పుడే. చిత్తూరు కార్వేటి నగరం సమీపంలో కొన్ని నాటుసారా బట్టీలున్నాయి. అక్కడి నుంచి తమిళనాడుకి నంబర్‌ ప్లేట్‌ లేని లారీలలో దొంగ సారా రవాణా అవుతుంటుంది. సారా రవాణా గురించిన సమాచారంతో ఆ ప్రదేశానికి వెళ్తుంటే దారిలో ఉండగానే ఫోన్‌ కాల్, వెనక్కి వచ్చేయమని ఆదేశం వచ్చేది.

గ్రామస్థులతో  ప్రతిజ్ఞ చేయిస్తున్న డిప్యూటీ కమిషనర్‌ నాగలక్ష్మి 

నాటుసారా బట్టీలపై దాడులు చేయడం, సారా తయారీని అరికట్టడం, నంబర్‌ లేని వాహనాన్ని వెంటనే సీజ్‌ చేయడం మా డ్యూటీ. మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వకపోతే మమ్మల్ని ఉద్యోగంలో ఎందుకు చేర్చుకున్నట్లు? గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగం చేయడమే కష్టంగా ఉండేది. ఐదేళ్లలో నాలుగు చోట్లకు బదిలీ అయ్యాను. ఇప్పుడు కొత్త ప్రభుత్వం సారా నిషేధం మీద చిత్తశుద్ధితో ఉండడంతో మాలాంటి వాళ్లకు ధైర్యం వచ్చింది. సారా కాయడం మీద ఉక్కు పాదం మోపితే సరిపోదు. సారా తాగకూడదనేటట్లు మనుషుల మనసులను మార్చాలి. వారిని చైతన్యవంతం చేయడం కోసమే ఎనిమిది పాటలు రాయించాం. వాటిని రికార్డ్‌ చేయిస్తున్నాం’’ అన్నారు నాగలక్ష్మి.
– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: ఎన్‌. మురళి, సాక్షి, చిత్తూరు

చదువు – ఉద్యోగం రెండు కళ్లు
మా నాన్న జీతం మమ్మల్ని ముగ్గుర్ని పోషించడానికే సరిపోయేది. దాంతో ఆరవ తరగతి నుంచి ప్రతి వేసవి సెలవుల్లో నిర్మాణంలో ఉన్న భవనాలకు వాటర్‌ క్యూరింగ్‌ వంటి పనులకు వెళ్లేవాళ్లం. రోజుకు ఇరవై రూపాయలొచ్చేవి. సెలవుల్లో సంపాదించుకున్న డబ్బుతో పుస్తకాలు, దుస్తులు కొనుక్కునే వాళ్లం. సత్యసాయి కాలేజ్, అనంతపురం గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌ తర్వాత పీజీకి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకెళ్లాను. అందులోనే ఎంఫిల్‌ చేస్తున్న సమయంలో ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో హిస్టరీ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది.రెండేళ్ల తర్వాత అనంతపురం ఉరవకొండకు బదిలీ అయింది.

తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉమెన్‌ స్టడీస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న సమయంలో అంతర్జాతీయ పత్రికల్లో  ‘ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ట్రైబల్‌ ఉమెన్, అబ్జర్వేషన్స్, రికమండేషన్స్‌’ టాపిక్‌ లో వ్యాసాలు రాశాను. ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌లో పేపర్‌ ప్రజెంట్‌ చేశాను. ఇదే సమయంలో గ్రూప్‌ వన్‌లో ఒక ప్రయత్నం చేశాను. తొలిసారి ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ వచ్చింది. రెండో ప్రయత్నంలో ఎక్సైజ్‌ పోలీస్‌నయ్యాను. ఇలా నా చదువూ, ఉద్యోగం రెండు కలిసి కొనసాగుతున్నాయి. ఇప్పుడు ‘ట్రైబల్‌ ఉమెన్‌ ఇన్‌ ఎ చేంజింగ్‌ సొసైటీ విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు బంజారా ఉమెన్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’ అంశంలో పీహెచ్‌డీ చేస్తున్నాను.
– టి. నాగలక్ష్మి రమావత్, డిప్యూటీ కమిషనర్,
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్, చిత్తూరు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement