మూడు రోజులే..
►సమీకరణకు ముగుస్తున్న గడువు
►రాజధాని నిర్మాణానికి సర్కారీ లక్ష్యం 31,205 ఎకరాలు
►ఇప్పటివరకు సమీకరించింది 18,634 ఎకరాలు మాత్రమే
►రైతుల నుంచి వెల్లువలా వస్తున్న అభ్యంతర పత్రాలు
►కురగల్లులో డిప్యూటీ కమిషనర్ ఎదుట బైఠాయింపు
►గ్రామ కంఠం వెలుపల స్థలాల యజమానుల్లో ఆందోళన
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని భూ సమీకరణ ప్రక్రియ పూర్తికావడానికి ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. గడుపు సమీపిస్తున్న కొద్దీ అభ్యంతర పత్రాలు (9.2 ఫారాలు) ఇచ్చే రైతుల సంఖ్య పెరుగు తోంది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదంటూ అభ్యంతర పత్రాలను ఎక్కువగా ఇస్తున్నారు. వీరితోపాటు గ్రామ కంఠం వెలుపల ఇళ్లు, నివేశన స్థలాలు ఉన్నవారు కూడా ఎక్కువగా అందజేస్తున్నారు.
గ్రామాలు విస్తరించిన నేపథ్యంలో గ్రామ కంఠం వెలుపల స్థలాలు, ఇళ్లు ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొందరు రియల్టర్లు ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి నెల రోజుల క్రితం గ్రామకంఠం వెలుపల ఉన్న నివేశన స్థలాలను హడావుడిగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఈ నిబంధనలు తెలియని అమాయక రైతులు ఆందోళన చెందుతున్నారు.డిసెంబరు 8 వ తేదీన తీయించిన శాటిలైట్ చిత్రాన్ని అనుసరించి గ్రామ కంఠం విస్తీర్ణాన్ని నిర్ణయిస్తారని అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి తమ స్థలాలు భూ సమీకరణ పరిధిలోకి వస్తాయో లేదో తెలుసుకునే ప్రయత్నంలో రైతులు ఉన్నారు.
ఎందుకైనా మంచిదనే అభిప్రాయంతో ఈ స్థలాలు, ఇళ్లకు కూడా అభ్యంతర పత్రాలను ఇస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరిలో 16,520 ఎకరాలను సమీకరిం చేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా బుధవారం సాయంత్రానికి 2,824 ఎకరాలకు రైతులు అంగీకారపత్రాలు ఇచ్చారు. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయాలు రైతులు రాకపోవడంతో వెలవెలబోయాయి. రాత్రి 8గంటల సమయంలో కురగల్లు గ్రామంలోని రైతులు, మహిళలు భూసమీకరణకు వ్యతిరేకంగా సీఆర్‌డీఏ డిప్యూటీ కమిషనర్ చంద్రుడు వాహనానికి అడ్డుగా నిలిచి తమ నిరసన వ్యక్తం చేశారు.
ల్యాండ్ పూలింగ్‌ను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆయన వాహనం ముందు బైఠాయించారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో జనవరి 1 తేదీన భూ సమీకరణ ప్రారంభమైంది. మొత్తం 31,205 ఎకరాలను సమీకరించాలని లక్ష్యంగా తీసుకుంటే బుధవారం సాయంత్రానికి 18,634 ఎకరాలను మాత్రమే సమీకరించారు. మిగిలిన ఈ మూడు రోజుల్లో నిర్ణయించిన లక్ష్యాన్ని సాధించలేమనే అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికి సగటును రోజుకు 400 నుంచి 500 ఎకరాలు మాత్రమే సమీకరించారు. రాయపూడి, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి తదితర గ్రామాల్లో భూసమీకరణకు వ్యతిరేకంగా 9.2 ఫారాలు అందిస్తూనే ఉన్నారు.
నదీపరివాహక గ్రామాల్లోని రైతులు ప్యాకేజీ పెంచాలని చేస్తున్న డిమాండ్‌కు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అంగీకార పత్రాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. భూ సమీ కరణకు రైతులు ముందుకు రాకపోయినా, మంగళగిరి నియోజకవర్గంలోని భూములు తీసుకు నేందుకు తమకంటూ ఒక మార్గం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ విధానాలను అనుస రించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించారు. అదే విధంగా ఈనెల 14 నుంచి భూ సమీకరణకు నియమితులైన కొందరు డిప్యూటీ కలెక్టర్లు, ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆ విధుల నుంచి రిలీవ్ చేయనుందని తెలుస్తోంది.