ఇంఫాల్: మణిపూర్‌లో యువ జంట హత్యతో మొదలైన నిరసనలు గురువారం సైతం కొనసాగాయి. ఆందోళనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడున్న రెండు కార్లకు నిప్పుపెట్టారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం రాత్రి పలు చోట్ల నిరసనకారులు భద్రతా బలగాలపై దాడులకు దిగారు. దీంతో, బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.
పోలీసు వాహనానికి నిప్పుపెట్టడంతోపాటు పోలీసు వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కెళ్లారు. థౌబల్ జిల్లా ఖొంగ్‌జమ్‌లో బీజేపీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి సీఎం బిరేన్ సింగ్ పూరీ్వకుల ఇంటిపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు.
మా వాళ్ల మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించండి
దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన తమ పిల్లల మృతదేహాల జాడ చెబితే అంత్యక్రియలు జరుపుకుంటామని వారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మెయితీ వర్గానికి చెందిన యువతి, యువకుడు జూన్‌లో గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హత్యకు గురి కావడం, వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. ఈ హత్య ఘటన మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది.
మెయితీల ఆచారం ప్రకారం..అంతిమ సంస్కారాలు జరపడానికి మృతులు ధరించిన దుస్తులకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కయినా ఉండాలి. అంత్యక్రియలు జరిపేవరకు వారి ఫొటోల వద్ద మృతుల తల్లులు అగరొత్తులు, క్యాండిల్ వెలిగిస్తూ రోజూ ఆహారం నివేదన చేస్తూ ఉండాలి. వారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. కనీసం వారికి తగు గౌరవంతో అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని యువతి తండ్రి హిజామ్ కులజిత్ చెప్పారు. తాజాగా, సీబీఐ దర్యాప్తుతోనయినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
మణిపూర్‌కు శ్రీనగర్ ఎస్‌ఎస్‌పీ బల్వాల్ బదిలీ
న్యూఢిల్లీ: ఉగ్ర సంబంధ కేసులను డీల్ చేయడంలో సమర్థుడిగా పేరున్న శ్రీనగర్ సీనియర్ ఎస్‌పీ రాకేశ్ బల్వాల్‌ను కేంద్రం మణిపూర్‌కు బదిలీ చేసింది. మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతినడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2012 ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ బల్వాల్‌ను డిసెంబర్ 2021లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు మార్చారు. తాజాగా ఆయన్ను మణిపూర్ కేడర్‌కు మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన హోం వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో ఆయన కొత్త బాధ్యతలను చేపడతారని తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్‌కు చెందిన బల్వాల్ మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు 2017లో సీనియర్ ఎస్‌పీగా పనిచేసిన అనుభవం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment