సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ః వాణిజ్యపన్నులశాఖ పరిధిలో జిల్లాకో డెప్యూటీ కమిషనర్ (డీసీ) కార్యాలయం ప్రారంభించాలన్న ప్రతిపాదనకు కసరత్తు మొదలైంది. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపి విజయనగరంలో ఎనిమిది సర్కిళ్లకు సంబంధించి డీసీ కార్యాలయం ఉంది. దీనివల్ల శ్రీకాకుళం పరిధిలో ఉన్న ఖాతాదారులకు కొంత ఇబ్బందులొస్తున్నాయి. వాణిజ్యపరమైన సర్వీసులు, ఫిర్యాదులు, భారీ లావాదేవీలకు విజయనగరం వెళ్లాలంటే కష్టతరంగా మారింది. 13జిల్లాల పరిధిలో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రెండేసి డివిజన్లుండగా భారీ ఆదాయం వ స్తున్న విశాఖసిటీకి ఒక్కటే ఉంది. విశాఖ రూరల్ పరిధిలో మరో డీసీ కార్యాలయం ఉండాలన్న డిమాండ్‌తో పాటు ఆయా జిల్లాల పరిధిలోనూ ఒక్కో కార్యాలయం తెరిచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులు హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు నివేదించారు.
నాలుగు సర్కిళ్ల పరిధిలో..
శ్రీకాకుళం జిల్లాలో రాజాం, కాశీబుగ్గ, నరసన్నపేట, శ్రీకాకుళం ప్రాంతాల్లో సర్కిళ్లు పనిచేస్తున్నాయి. ఏటా రూ.200 నుంచి రూ.250కోట్ల ఆదాయం వస్తోంది. రాజాం నుంచి భారీ రెవెన్యూ జమ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు సర్కిళ్లకూ కలిపి ఒక డీసీ కార్యాలయ అవసరంపైనా ఇక్కడి అధికారులు నివేదించినట్టు తెలిసింది. ఇందుకు తగ్గ సిబ్బంది, కార్యాలయం అందుబాట్లో ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో ఈస్ట్, వెస్ట్, సౌత్ సర్కిళ్లతోపాటు పార్వతీపురాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు సర్కిళ్లను కులుపుతూ శ్రీకాకుళంలో ఉన్న మరో నాలుగింటిని (మొత్తం 8సర్కిళ్లతో కూడిన డివిజన్) డివిజన్ కార్యాలయం ఏర్పాటైంది. పెరిగిన లావాదేవీలు, ఆన్‌లైన్ వ్యవహారం, స్కైప్ విధానం, రెవెన్యూ ఆధారంగా వాణిజ్యపన్నులశాఖ పరిధిలో శ్రీకాకుళంలోనూ మరో డీసీ కార్యాలయం ఏర్పాటు చేస్తే బావుంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఏమిటి ఉపయోగం
స్థానికంగా డీసీ కార్యాలయం ఉంటే వ్యాపారులు తమ ఇబ్బందుల్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లే వీలుంటుంది. గ్రూప్-1స్థాయి అధికారి సీటీవోగా ఎంపికై పదోన్నతలు, సీనియార్టీ ఆధారంగా డీసీ పోస్టు హోదా వస్తుంది. కిందిస్థాయి సిబ్బందితో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే వీలుంటుంది. సిబ్బంది సంఖ్య, కార్యాలయ పరిధి పెరుగుతుంది. ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్యపన్నులశాఖలో రెవెన్యూ లీకేజీ అరికట్టే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న డీలర్ల వ్యాపారంపై నిఘా పెంచేందుకు, తరచూ ఆడిట్ నిర్వహించుకునే వీలుంటుంది.
నిత్యం వ్యాపారులు తమకు ప్రభుత్వం అందించే ప్రోత్సహకాలతోపాటు చెల్లించాల్సిన పన్ను, జమ కావాల్సిన ఖర్చులపై నేరుగా డీసీ స్థాయి అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది. సీజన్ వారీ వ్యాపారంపై దృష్టిసారించడంతో పాటు అవసరమయ్యే చోట చెక్‌పోస్టులేర్పాటు, అబ్జర్వేషన్ పాయింట్ (ఓపీ)లేర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీంతో శ్రీకాకుళం జిల్లాకూ డీసీ కార్యాలయ ఏర్పాటు అవసరమేనంటూ కొంతమంది వ్యాపారులతో పాటు అధికారులూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, రాష్ట్ర వ్యాప్త నిర్ణయం కాబట్టి, శ్రీకాకుళంలో డీసీ కార్యాలయం ఏర్పాటు చేస్తే విజయనగరం పరిస్థితి ఏంటన్న విషయంపైనా మంత్రి యనమల రామకృష్ణుడి వద్ద ఓ ఫైల్ కూడా పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
తెర పైకి వాణిజ్యపన్నులశాఖ డీసీ కార్యాలయం
Published Thu, Dec 24 2015 11:24 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement