లిక్కర్‌ జోష్‌..! | Liquor josh..! | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ జోష్‌..!

Published Fri, Mar 9 2018 9:19 AM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Liquor josh..! - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఆదిలాబాద్‌: మద్యం అమ్మకాల్లో ఇదో సునామి. ఉమ్మడి జిల్లాలో రూ.1000 కోట్లకు పైగా మార్క్‌ను సాధించబోతోంది. ఫిబ్రవరి వరకు రూ.965 కోట్లు క్రాస్‌ చేసింది. మార్చి నెలలో రికార్డ్‌ మార్క్‌ను మించిపోనుంది. దీంతో మద్యం అమ్మకాల్లో జిల్లా రికార్డును చూసి మురిసిపోవాలో లేనిపక్షంలో ఉమ్మడి జిల్లాలో లిక్కర్‌ ఇంతగా సేవిస్తున్నారా..! అని మదనపడాలో అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరంగా టాప్‌ 5లో ఆదిలాబాద్‌ ఉందని ఎక్సైజ్‌ అధికారులు సంబరపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఏకంగా 30 శాతానికి పెరగడంతో ఆబ్కారీ అధికారుల మాటల్లోనూ గంభీరం కనిపిస్తోంది. 

30 శాతం వృద్ధి.. పెరగడానికి కారణాలు ఇవే..
ఉమ్మడి జిల్లాలో ప్రతి నెల సగటున రూ.80 కోట్లకు పైబడి ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా లభిస్తోంది. గత మూడు నెలలుగా విక్రయాలను పరిశీలిస్తే డిసెంబర్‌లో రూ.95.48 కోట్లు, జనవరిలో రూ.85.30 కోట్లు, ఫిబ్రవరిలో రూ.93.88 కోట్లు విక్రయాల ద్వారా ఆదాయం వచ్చింది. ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌(ఐఎంఎల్‌), బీర్ల కేసుల అమ్మకాలు రెండూను గత ఏడాది కంటే భారీగా పెరగడం గమనార్హం. అధికారులు ప్రధానంగా గుడుంబా, దేశీదారును అరికట్టడంతోనే ఈ ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు కేవలం 5 శాతమే పెరిగాయి.

దీన్ని బట్టి ఇంత ఆదాయం గుడుంబా, దేశీదారును అరికట్టడం ద్వారా వచ్చిందనడం పట్ల కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు కొట్టి పడేస్తున్నారు. దీనికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రధానంగా గత ఏడాదిన్నర కాలంగా ఈత, తాటి చెట్ల నుంచి లభించే కల్లు విక్రయాల్లో కల్తీ జరుగుతుందని ఎక్సైజ్‌ అధికారులు నిఘా పెంచడం, తరచూగా దాడులు చేస్తుండడంతో కల్లు విక్రయాలపై ప్రభావం పడింది. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానంగా సొసైటీల నుంచి కల్లు విక్రయాలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో కల్లు దొరకకపోవడంతో మద్యం కొనుగోలు చేస్తున్నారు. కల్లు తాగే వ్యక్తులు చీఫ్‌ లిక్కర్‌ తీసుకున్నా దాని వృద్ధి రేటు పెరగాలి. కానీ చీఫ్‌ లిక్కర్‌ కంటే మీడియం లిక్కర్, హై లిక్కర్, అంత కంటే బీరు విక్రయాల శాతం భారీగా పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తద్వారా జిల్లాలో తక్కువ స్థాయి మద్యం కంటే మధ్యమస్థాయి, అతి ఖరీదైన మద్యం తాగేందుకు జనాలు డబ్బులు వెచ్చించేందుకు వెనుకాడడం లేదని వృద్ధి రేటు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండడం కూడా జిల్లాలో విక్రయాలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు పెద్ద ఎత్తున మద్యం రవాణా అవుతోందని చెబుతున్నారు.

అదే సమయంలో తెలంగాణ కంటే మహారాష్ట్రలో మద్యం ధరలు అధికంగా ఉండడంతో నిషేధం లేనటువంటి మహారాష్ట్రలోని ప్రాంతాలకు కూడా మన జిల్లా నుంచి సరిహద్దు ప్రాంతాల ద్వారా హైలిక్కర్‌ మద్యం కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాదిన్నర కాలంలో రెండు సార్లు మద్యం ధరలను ప్రభుత్వం పెంచగా, అందులో గతేడాది ఈ ధరలను భారీగా పెంచారని మద్యంప్రియులు వాపోతున్నారు. ఆదాయానికి పెరిగిన మద్యం ధరలు కూడా కారణమని చెబుతున్నారు. వీటిన్నింటి కారణంగానే 30 శాతం వృద్ధి ఉందని తెలుస్తోంది.

ఇదీ పరిస్థితి..
గత అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలైన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో 160 వైన్స్‌ షాపులకు రెండు సంవత్సరాల కాల పరిమితితో లైసెన్స్‌ ఇచ్చారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో 23 బార్లు, మంచిర్యాలలో ఓ క్లబ్‌లో మద్యం విక్రయాలకు రెన్యూవల్‌ చేశారు. ఉట్నూర్‌ మద్యం డిపో నుంచి ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ ఎక్సైజ్‌ సర్కిళ్లలోని మద్యం దుకాణాలు, వైన్స్‌లు, బార్లకు మద్యం సరఫరా జరుగుతోంది. మంచిర్యాల డిపో నుంచి మంచిర్యాల, చెన్నూర్, లక్షెట్టిపేట, బెల్లంపల్లి ఎక్సైజ్‌ సర్కిళ్లకు మద్యం విక్రయాలు జరుగుతాయి.

సాధారణంగా ఉట్నూర్‌ డిపో నుంచి ప్రతిరోజు రూ.1 కోటి నుంచి రూ.కోటిన్నర వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. మంచిర్యాల డిపో నుంచి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. కొంత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎక్సైజ్‌ సర్కిళ్లకు కూడా మంచిర్యాల డిపో నుంచి సరుకు వెళ్తుంది. ఈ రెండు డిపోల నుంచి ప్రతి నెల ఉమ్మడి జిల్లాకు రూ.80 కోట్లకు పైబడి మద్యం వెళ్తుంది.  


ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు..

సంవత్సరం    ఐఎంఎల్‌ కేసులు    బీర్‌ కేసులు    అమ్మకం విలువ    గతేడాది కంటే వృద్ధి రేటు(రూ. కోట్లలో) 
2015–16     15,99,838             15,07,766       రూ.715.19                  8.60 శాతం    
2016–17     18,61,173             15,77,748       రూ.828.03                 16 శాతం    
2017–18     21,17,319             19,00,219       రూ.965.29                 30 శాతం    

 
దేశీదారు కంట్రోల్‌తోనే..

ఐడీ, దేశీదారు కంట్రోల్‌ చేయడంతోనే జిల్లాలో మద్యం అమ్మకాలు పెరిగాయి. రాష్ట్రంలోనే టాప్‌ 5లో ఉన్నాం. మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌ నాలుగు జిల్లాలోనూ అమ్మకాల్లో మంచి వృద్ధి ఉంది. అన్ని సర్కిళ్ల పరిధిలో విక్రయాల పరంగా ముందున్నాయి. ప్రధానంగా జిల్లాలో గుడుంబాను పూర్తి స్థాయిలో అరికట్టడం జరిగింది. అదే సమయంలో దేశీదారును నియంత్రించాం. దాని ఫలితంగానే అమ్మకాలు పెరిగాయి.
– ఎం.రమేశ్‌రాజు, డిప్యూటీ కమిషనర్, 
ఆదిలాబాద్‌ ఎక్సైజ్‌ డివిజన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement