NITI Aayog Multidimensional Poverty Index Revealed, Know Details Inside - Sakshi
Sakshi News home page

NITI Aayog MPI: కారు చీకటి బతుకులు.. అంతరం అలాగే!

Published Sat, Apr 29 2023 3:17 AM | Last Updated on Sat, Apr 29 2023 11:55 AM

NITI Aayog Multidimensional Poverty Index Revealed - Sakshi

చెలిమ నీళ్లే ఇంకా.. 
కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గోవెన పరిధిలో ఐదు గూడేలకు విద్యుత్‌ వెలుగే లేదు. ఇందులో నాయకపుగూడ, కుర్సీ గూడాల పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ మిషన్‌ భగీరథ కోసం నిర్మించిన వాటర్‌ ట్యాంకులు అలంకారప్రాయమే. దీంతో నాయకపుగూడ గిరిజనులకు వాగులోని చెలిమ నీళ్లే గొంతు తడుపుతున్నాయి. గోవెన పరిధిలోని ఐదు గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. ఐటీడీఏ ఎప్పుడో ఏర్పాటు చేసిన సోలారు లైట్లు ఆరేళ్ల క్రితమే పనిచేయకుండా పోయాయి. పోలీసులు ఏర్పాటు చేసిన నాలుగు సోలారు వీధి లైట్లు మాత్రం వెలుగుతున్నాయి.  

కారు చీకటి బతుకులు 
నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు గ్రామానికి చేరాలంటే ఆరు కిలోమీటర్లు నడిచివెళ్లాలి. సరైన దారే లేని అలాంటి ఊరికి కరెంటు కూడా లేదు. పెంబిమండల కేంద్రం నుంచి 25 కి.మీ. దూరంలో ఉండే ఈ పల్లెలో 35 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. ఇంకా పెద్దరాగిదుబ్బ, సోముగూడ, కడెం మండలంలోని మిద్దెచింత, రాంపూర్‌ గ్రామాలవీ చీకటి బతుకులే.

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి  : వెనుకబాటుపైనే తిరుగుబాటు చేసి పుట్టిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు వస్తాయన్న నినాదమూ తెలంగాణదే. అయితే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి ఇన్నేళ్లవుతున్నా.. రాష్ట్రంలో ఇంకా 13.74% పేదలు ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జాతీయ సగటు (25.01%)ను మించి పేదరికం ఉందని నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచిక (మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌–2021) వెల్లడించడం గమనార్హం. 

విద్య, వైద్యం, విద్యుత్‌ ప్రాతిపదికగా.. 
విద్య, వైద్యం, పారిశుధ్యం, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్లు, సొంత ఆస్తులు, బ్యాంక్‌ ఖాతా తదితర పన్నెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్‌ నివేదిక రూపొందించింది. దేశ జనాభాలో 25.01% పేదలుండగా, తెలంగాణలో ఇది 13.74%గా ఉంది. అయితే ఆదిలాబాద్‌ (27.43%), మహబూబ్‌నగర్‌ (26.11%) జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరీ నిరాశాజనకంగా ఉంది. ఆయా జిల్లాల్లో 25% మందికి ఇప్పటికీ విద్య, వైద్యం, పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందటం లేదని నివేదిక తేల్చింది.

కొత్తగా ఏర్పడిన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం, రాజకీయ అవసరం, ప్రాబల్యం ఉంటేనే నిధుల వరద పారుతున్న వైనం.. వెనుకబడిన ప్రాంతాల్లో మరోసారి అసహనానికి కారణం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించటం, రాజకీయ సిఫారసులు, అవసరాలు లేని ప్రత్యేక కార్యాచరణ అమలుతోనే సమ అభివృద్ధి సాధ్యమని ప్రొఫెసర్‌ సి.నాగేశ్వర్‌ పేర్కొన్నారు. 

ప్రత్యేక ప్రాధాన్యం ఏదీ? 
తెలంగాణ వచ్చినా కూడా పాలమూరు వెతలు తీరటం లేదు. మా జిల్లాలో సహజ వనరుల దోపిడీ పెరిగింది. వలసలు ఇంకా ఆగనే లేదు. గుంపు వలసల స్థానే వ్యక్తిగత వలసలు కొనసాగుతున్నాయి. జీవన ప్రమాణాలు పెంచే ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో పాలమూరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇదే కొనసాగితే పాలమూరు పేదల జిల్లాగానే మిగిలిపోతుంది.  –ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక 

ప్రణాళికా బద్ధమైన కేటాయింపులు ఉండాలి 
సంక్షేమ రాజ్యం ప్రధాన సూత్రం..అందరికీ సమన్యాయం. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించి దాని ని నిరీ్ణత కాలంలో అమలు చేయాలి. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రణాళిక – కేటాయింపులు–సమీక్షలు అంత అర్థ్ధవంతంగా లేవు.అందుకే ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో దేశ సగటును మించి పేదరికం నమోదైంది.     – ప్రొఫెసర్‌ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్‌ అసోసియేషన్‌ 

పేదలే లేని కొట్టాయం 
కేరళలోని కొట్టాయం జిల్లాలో పేదలే లేరు. ఎర్నాకులం జిల్లాలో 0.1%, కోజికోడ్‌లో 0.26% ఉన్నారు. దేశంలోనే పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ (0.71) నిలిచింది. ఇక అత్యధిక పేదరికం బిహార్‌లో (51.91%) ఉంది. దేశంలో అత్యధిక పేదరికం యూపీలోని శ్రావస్తి జిల్లాలో (74.38%) నమోదైంది. బహరైచ్‌లో 71.81%, మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్‌లో 71.31% పేదరికం ఉంది.  

మా జీవితాలకు వెలుగెప్పుడో..! 
అడవిలో మూడు కిలోమీటర్లు నడిస్తేనే.. బయటి ప్రపంచానికి మేమంటూ ఉన్నామని తెలుస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నరు కరెంటు వస్తదని. కానీ రాలే.. సోలారు లైట్లు పెడుతున్నా.. అవి కొన్నిరోజులే వెలుగుతున్నయి. మా పిల్లల జీవితాల్లోనైనా వెలుగు వస్తుందో లేదో..!   – ఆత్రం శ్రీరాములు, ఠిమిద్దెచింత, నిర్మల్‌

బడి లేక..కూలీకి..  
అమ్మా నాయిన ముంబైకి వలస వెళ్లిండ్రు. నేను మా తండా బడిలోనే 5వ తరగతి వరకుచదివిన. 6వ తరగతి చదవాలంటే రోజూ 14 కి.మీ వెళ్లిరావాలి. రోడ్డు బాగా లేదు, ప్రయాణ సౌకర్యం కూడా లేదు. దీంతో రోజూ నడుచుకుంటూ వెళ్లలేక గత ఏడాది బడి మానేసిన. ఇప్పుడు మా అవ్వ ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు కూలీ పనులకెళ్తున్న. మా అమ్మా నాయిన లాగే తండాలో 95 కుటుంబాలు ముంబైకి వలస వెళ్లాయి. నాలా చానామంది నడుచుకుంటూ బడికి వెళ్లలేక కూలీ పని చేస్తుండ్రు.  – సోనమ్మ, పాతతండా, నారాయణపేట జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement