సాక్షి, హైదరాబాద్: నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021 (భారత ఆవిష్కరణల సూచీ– 2021)’ మూడో ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏడు అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీ టివ్‌నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి.. ‘గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ (జీఐఐ)’ స్కోర్‌ను కేటాయించింది. నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ గురువారం ఆవిష్కరించారు.
పెర్ఫార్మర్స్‌లో టాప్
ఏడు అంశాల ఆధారంగా మొత్తం స్కోర్ కేటాయించగా.. ఇందులో ఐదింటి ఆధారంగా పెర్ఫార్మర్స్ (అద్భుత పనితీరు చూపినవారు)గా, మరో రెండింటి ఆధారంగా ఎనేబులర్స్ (సాధించినవారు)గా గుర్తించారు. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య–పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు వేర్వేరుగా స్కోర్‌ను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 17.66 సగటు స్కోర్‌తో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో కర్ణాటక (18.01), మూడోస్థానంలో హరియాణా ఉన్నాయి. ఇక కేటగిరీల వారీగా చూస్తే.. పెర్ఫార్మర్స్ కేటగిరీలో 15.24 స్కోర్‌తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. ఎనేబులర్స్ కేటగిరీలో 20.08 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.
ఎంఎన్‌సీలు, స్టార్టప్‌లతో మెరుగైన పనితీరు
స్టార్టప్‌లకు తెలంగాణ నిలయంగా మారుతోంది. ‘ఇన్ఫ ర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’ ప్రయోగ శాలలను కలిగి ఉన్న పాఠశాలల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణలో వాటి సంఖ్య 17 నుంచి 35 శాతానికి పెరిగింది. ఉన్నత విద్య చదువుతున్నవారి శాతం 9.7% నుంచి 15.7 శాతానికి చేరింది. నైపుణ్యం గల మానవ వనరుల సృష్టి కోసం ఏర్పాటు చేసిన ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి సంస్థలు కూడా 0.3 నుంచి 1.4 శాతానికి చేరాయి. పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్‌ల్లో తెలంగాణ ఉత్తమ పనితీరును కనబరుస్తోంది. స్టార్టప్‌ల సంఖ్య గతేడాదితో పోలిస్తే 4,900 నుంచి 9 వేలకు చేరింది. ‘నాలెడ్జ్ డిఫ్యూజన్’ అంశంలో మాత్రం తెలంగాణ పనితీరును మెరుగుపర్చు కోలేక పోయింది. పరిజ్ఞానం సృష్టించడం, అమలు చేయడంలో ముందంజలో ఉన్నా.. ఉత్పత్తులు, సేవల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. రాష్ట్రాలు తాము సృష్టిస్తున్న పరిజ్ఞానాన్ని ఉత్పత్తులు, సేవల రూపంలోకి మార్చడంపై దృష్టి సారించాలని సూచించింది.
‘3ఐ మంత్రం’తో అద్భుత ఫలితాలు: కేటీఆర్
దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో టాప్‌లో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్న ‘3ఐ మంత్రం’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు), ఇంక్లూసివ్ గ్రోత్ (సమగ్రాభివృద్ధి)ని రాష్ట్ర ప్రభుత్వం తన విధానంగా మార్చుకుంది. నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021’లో తెలంగాణ మొత్తంగా రెండో స్థానంలో, పెర్ఫార్మర్స్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది’’ అని ట్వీట్ చేశారు.
దేశంలోనే అగ్రగామి రాష్ట్రం తెలంగాణ
ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో రాష్ట్రం అగ్రగామిగా నిలవడం గర్వకారణం. సీఎం కేసీఆర్, ఐటీ–పరిశ్రమల మంత్రి కేటీఆర్ దూరదృష్టి వల్లే ఆవిష్కరణల్లో తెలంగాణ దేశంలో టాప్ స్థానంలో నిలిచింది.
– బి వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment