కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షను నిరసిస్తూ నిర్ణయం: సీఎం రేవంత్‌రెడ్డి
విభజన హామీల అమలులో ప్రధాని మోదీ నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాం
తెలంగాణకు మేలు చేయాలని కోరుతూ మోదీని పెద్దన్న అన్నాను
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని మూడుసార్లు కలిశానని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపడానికి, నిధుల కేటాయింపులో అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. అనంతరం దీనిపై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రాష్ట్రానికి నిధుల కేటాయింపులో, విభ జన హామీల అమల్లో కక్షపూరిత వైఖరినే అవలంబిస్తున్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు విభజన చట్టంలోని అంశాలేవీ అమలు కాలేదు. మేం అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నాం. కేంద్ర పెద్దలను కలసి సాయం కోసం విజ్ఞప్తులు చేశాం. స్వయంగా నేను మూడు సార్లు ప్రధానిని.. 18 సార్లు కేంద్ర మంత్రులను కలిశా. తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా.
మేం ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కలసి ఓ మెట్టు దిగి.. పెద్దన్నగా సంబోధించి రాష్ట్రానికి మేలు చేయాలని కోరాను. ప్రధానిని పెద్దన్న అన్నందుకు కొందరు నన్ను విమర్శించారు. నాకు సీఎం పదవి ఎవరి దయా దాక్షిణ్యాలతోనో రాలేదు.
ప్రజల వల్ల, మా పార్టీ వల్ల, 64 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకోవడం వల్ల వచ్చింది. ఎవరినో పెద్దన్న అన్నందుకు రాలేదు. బడ్జెట్‌లో అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరేందుకే శాసనసభలో చర్చ లేవనెత్తాం. కానీ కొందరు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా నిలబెట్టాలని, ప్రధాని మోదీని కాపాడాలని ప్రయత్నించడం రాష్ట్రమంతా చూసింది.
అది కక్షపూరిత వైఖరి
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. తొలి ప్రధాని నెహ్రూ అభివృద్ధికి బాటలు వేస్తే.. ఆయన స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. తర్వాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. ఆ హామీల అమల్లో నిర్లక్ష్యం వహించింది. తెలంగాణపై కేంద్రానిది వివక్ష మాత్రమే కాదు.. కక్షపూరిత వైఖరి.
రూపాయి చెల్లిస్తే.. వస్తున్నది 43 పైసలే
రాష్ట్రం నుంచి ఒక రూపాయిని పన్నులుగా చెల్లిస్తే కేంద్రం తెలంగాణకు తిరిగిస్తున్నది 43 పైసలే. బిహార్‌కు రూపాయికి రూ.7.26 అందుతున్నాయి. యూపీకి కూడా అంతే. ఐదేళ్లలో తెలంగాణ నుంచి రూ.3.68లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళితే.. రాష్ట్రానికి ఇచ్చేది రూ.1.68లక్షల కోట్లు మాత్రమే. మోదీ ఏమైనా గుజరాత్‌లోని ఎస్టేట్లు అమ్మి తెలంగాణకు ఇచ్చారా? ఆయన జాగీర్దారు అమ్మి ఇచ్చారా? మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి.
ఐదు దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22.26 లక్షల కోట్లు అయితే.. కేంద్రం వీటికి తిరిగి ఇచ్చింది రూ.6.42 లక్షల కోట్లు మాత్రమే. అదే యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చినది రూ.3.41 లక్షల కోట్లు అయితే.. కేంద్రం యూపీకి తిరిగిచ్చింది రూ.6.91 లక్షల కోట్లు. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క యూపీకి ఇచ్చినది ఎక్కువ.
ఇదీ కేంద్రం వివక్ష కాదా.. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..’’ అని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment