హై...టెన్షన్! | hi..... tention! | Sakshi
Sakshi News home page

హై...టెన్షన్!

Published Sun, Dec 13 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

హై...టెన్షన్!

హై...టెన్షన్!

  • రిజర్వేషన్లపై నాయకుల ఆరా
  •  ఎక్కడ చూసినా ఇదే చర్చ
  •  గ్రేటర్ ఎన్నికలపై పెరుగుతున్న ఆసక్తి
  • సాక్షి, సిటీబ్యూరో: ‘హలో.. డిప్యూటీ కమిషనర్ గారూ... ‘ఫలానా’ డివిజన్ ఎవరికి రిజర్వు అయింది? అసలు రిజర్వ్ అవుతుందా? ఓపెన్‌లో ఉంటుందా?’... జీహెచ్‌ఎంసీలోని ఒక సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు స్థానిక ఎమ్మెల్యే ప్రశ్న.
     ‘కమిషనర్ గారూ.. ఫలానా డివిజన్ ఎవరికిస్తున్నారు?’... ఓ మంత్రి ఆరా.
     ... ఇదీ గ్రేటర్‌లో శనివారం నాటి పరిస్థితి. ఎక్కడ చూసినా... ఎవరిని కదిలించినా ఇదే చర్చ. ‘ఫలానా డివిజన్ బీసీలకు ఇచ్చేశారట
     
     
     కదా.. మంత్రి ఆబ్లిగేషన్... ఇవ్వకేం చేస్తారు..?...’ ఓ రాజకీయ పార్టీ నేతల మధ్య సంభాషణ. ‘ఆ’ డివిజన్ మహిళలకు ఇస్తే మనకు మంచిది. మన వాళ్లున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకునికి ఓ నేత సూచన. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో ఏ వర్గానికి ఎన్ని అనేది లెక్క తేలడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడింది. ఫలానా డివిజన్‌ను ఫలానా వర్గానికి రిజర్వు చేయాలి.
     
     ఈసారి అది ‘ఆ’ వర్గానికిరిజర్వ్ కాకుండా చూడాలి. మళ్లీ వారికే రిజర్వు అయితే నేనిక ఎప్పుడు పోటీ చేయాలి? ఓ ప్రజాప్రతినిధి వద్ద స్థానిక యువనేత ఆవేదన. ఇలా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న వారు... తమ వాళ్లను రంగంలో దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న వారు డివిజన్ల రిజర్వేషన్ల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలియక క్షణక్షణానికీ వీరి హార్ట్‌బీట్ పెరుగుతోంది. తాము కోరుకుంటున్న డివిజన్ వేరే వర్గానికి రిజర్వు అయితే ఏం చేయాలి..? ప్రత్యామ్నాయంగా ఇరుగు పొరుగున ఉన్న డివిజన్లలో పోటీ చేయవచ్చా? అక్కడ నిలబడితే గెలుస్తామా? ఇలా విభిన్న అంశాలపై రాజకీయ నేతలు సన్నిహితులతో చర్చిస్తున్నారు.
     
     రిజర్వేషన్‌లో సంబంధిత డివిజన్ ఏ వర్గానికి పోతుందో తెలియక ముందే ప్రజల్లోకి వెళ్లడం... ప్రచారం చేసుకోవడం వృథా అని కొంతమంది ఆశావహులు నిట్టూరుస్తున్నారు. ఇలా ఏ రాజకీయ పార్టీలో చూసినా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం ఎన్ని డివిజన్లు ఏయే వర్గాలకో తెలియడంతో... శనివారం ఎవరికి ఏ డివిజన్ కేటాయించారో తెలుస్తుందేమోననే ఆశతో అనేక మంది దాని పైనే దృష్టి సారించారు.
     
     కమిషనర్ సమీక్ష

     మరోవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. అన్ని డివిజన్లలో వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాల్సిందిగా సంబంధిత జోనల్/డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. డివిజన్ల వారీగా సాధారణ ఓటర్లు, బీసీలు, 2011 జనగణన మేరకు ఎస్సీ, ఎస్టీ జనాభా తదితర వివరాలతో సరిపోలుస్తూ... ఎక్కడా ఎలాంటి తేడాలు రాకుండా అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఎస్టీ/ఎస్సీ/బీసీ/మహిళ/ జనరల్ డివిజన్లను సర్కిళ్ల వారీగా కేటాయిస్తారా? లేక నియోజకవర్గాల వారీగానా అనే చర్చలు జోరుగా సాగాయి. జీహెచ్‌ఎంసీ మొత్తాన్ని ఒకే యూనిట్‌గా తీసుకొని వీటిని ఖరారు చేస్తారని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement