ఓటమి భయం.. తమ్ముళ్ల రచ్చ
నెల్లూరు (నవాబుపేట): తెలుగు తమ్ముళ్లకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల భయం పుట్టుకుంది. ఎలాగైనా ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం టీడీపీ కార్పొరేటర్లు నూనె మల్లికార్జునయాదవ్, షేక్ వహీదా, ఊటుకూరు మస్తానమ్మలు తమకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల సర్క్యులర్ అందలేదని, స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబుకు వినతి పత్రం అందజేశారు.
ఆ సమయంలో తమకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారంటూ కమిషనర్‌ను టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. స్పందించిన కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఏవీ వీరభద్రారావును ఉద్దేశించి ‘న్యూసెన్స్’ క్రియేట్ అయ్యేవరకు తీసుకొచ్చావని మందలించాడు. ఈ క్రమంలో కార్పొరేటర్ నూనె మల్లికార్జున్‌యాదవ్ దూసుకొచ్చి ‘మేం న్యూసెన్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నామా’ అంటూ కమిషనర్ పైకి వచ్చారు.
ఎంతకీ తగ్గకపోవడంతో కమిషనర్ పైకి లేచి ‘మీరు ఆఫ్ట్రాల్ కార్పొరేటర్లు. గెటౌట్ ఇన్‌మై చాంబర్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. సాయంత్రం 6 గంటల నుంచి 9.15 వరకు ఆందోళనకు దిగారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదని బైఠాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చాట్ల నరసింహరావు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామి కార్పొరేటర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్పొరేటర్లు శాంతించలేదు.