the Standing Committee
-
ఓటమి భయం.. తమ్ముళ్ల రచ్చ
నెల్లూరు (నవాబుపేట): తెలుగు తమ్ముళ్లకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల భయం పుట్టుకుంది. ఎలాగైనా ఎన్నికను వాయిదా వేసేందుకు టీడీపీ కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం టీడీపీ కార్పొరేటర్లు నూనె మల్లికార్జునయాదవ్, షేక్ వహీదా, ఊటుకూరు మస్తానమ్మలు తమకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల సర్క్యులర్ అందలేదని, స్టాండింగ్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబుకు వినతి పత్రం అందజేశారు. ఆ సమయంలో తమకు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారంటూ కమిషనర్‌ను టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. స్పందించిన కమిషనర్ డిప్యూటీ కమిషనర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఏవీ వీరభద్రారావును ఉద్దేశించి ‘న్యూసెన్స్’ క్రియేట్ అయ్యేవరకు తీసుకొచ్చావని మందలించాడు. ఈ క్రమంలో కార్పొరేటర్ నూనె మల్లికార్జున్‌యాదవ్ దూసుకొచ్చి ‘మేం న్యూసెన్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నామా’ అంటూ కమిషనర్ పైకి వచ్చారు. ఎంతకీ తగ్గకపోవడంతో కమిషనర్ పైకి లేచి ‘మీరు ఆఫ్ట్రాల్ కార్పొరేటర్లు. గెటౌట్ ఇన్మై చాంబర్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ ముందు ధర్నాకు దిగారు. సాయంత్రం 6 గంటల నుంచి 9.15 వరకు ఆందోళనకు దిగారు. కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదని బైఠాయించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చాట్ల నరసింహరావు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలారి వెంకటస్వామి కార్పొరేటర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్పొరేటర్లు శాంతించలేదు. -
నువ్వా? నేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తమ్ముళ్ల మధ్య చిచ్చురేపాయి. ఎన్నికల్లో తమ వర్గానిదే పై చేయి కావాలంటూ పోటీపడుతుండటమే ఇందుకు కారణం. నెల్లూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఆ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు బుధవారంతో ముగియనున్నాయి. అందుకు అవసరమైన సభ్యులు ఎంపికపై టీడీపీలో కసరత్తు ప్రారంభించింది. నగరపాలక సంస్థ పాలకవర్గంలో మేయర్ తరువాత స్టాండింగ్కమిటీకి అత్యధిక ప్రాధాన్యం ఉంది. రూ.50 లక్షలలోపు అభివృద్ధిపనులకు సంబంధించి స్టాండింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఆ కమిటీలో సభ్యుల సంఖ్య ఎటువైపు ఉంటే.. వారు చెప్పినట్లు అభివృద్ధి పనులకు అనుమతులు పొందే అవకాశం ఉంది. అందుకు అవసరమైన సభ్యుల్లో ఎక్కువశాతం తమ వర్గం వారే ఉండాలని టీడీపీలో ఇరు వర్గాలు పోటీపడుతున్నాయి. నెల్లూరు నగర పాలక వర్గంలో 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 31 మంది కార్పొరేటర్లు టీడీపీకి చెందిన వారే కావటం గమనార్హం. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 13 మంది కార్పొరేటర్లు ఓ వర్గం, టీడీపీకి చెందిన కార్పొరేటర్లు మరో వర్గంగా చెలామణి అవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ నుంచి ఐదుగురు సభ్యులు బరిలో నిలబడే అవకాశం ఉంది. టీడీపీ తరుపున బరిలో ఉండే ఐదుగురు సభ్యుల్లో మేయర్ వర్గానికి చెందిన వారు ఇద్దరు ఉండాలని పట్టుబడుతున్నారు. అదే విధంగా టీడీపీ వర్గానికి చెందిన వారు నలుగురు ఉండాలని వారు పోటీ పడుతున్నారు. అయితే మేయర్ వర్గానికి రెండు ఇవ్వటానికి టీడీపీ వర్గీయులు ససేమిరా అంటున్నారు. ఒకరైతే తమకు ఓకేనని చెపుతుండటం మేయర్ వర్గానికి రుచించడం లేదు. -
రూ. 134 కోట్లతో భారీ కాంప్లెక్స్
జీహెచ్ఎంసీ సన్నాహాలు చిలకలగూడలో నిర్మాణానికి యోచన ప్రతిపాదనలు సిద్ధం వచ్చేవారం స్టాండింగ్ కమిటీ ముందుకు.. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో భారీ కాంప్లెక్స్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్రస్తుతం అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, హబ్సిగూడ, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మొత్తం 18 కాంప్లెక్స్‌లలో 600కు పైగా యూనిట్లు ఉన్నాయి. వీటన్నింటినీ తలదన్నేలా రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మరో నాలుగంతస్తుల్లో భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని అంచనా వ్యయం రూ.134 కోట్లు. వచ్చేవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందాక ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలో కూల్చివేసిన జీహెచ్ఎంసీ పాత షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలోనే కొత్తది నిర్మించనున్నారు. దీనిని జీహెచ్ఎంసీ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు మిగతా యూనిట్లను వివిధ సంస్థలు లేదా దుకాణాలకు అద్దెకుఇవ్వనున్నారు. ఇందులో ఒక అంతస్తును జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వినియోగించుకొని, మిగతా వాటిని అద్దెకివ్వాలనేది ప్రస్తుత ఆలోచన. భవిష్యత్‌లో మార్పు చేర్పులకు వీలుంది. మొత్తం భవనాన్ని జీహెచ్ఎంసీయే వినియోగించుకోవడమా లేక అద్దెకివ్వడమా అనేది అప్పటి అవసరాలను బట్టి నిర్ణయిస్తారు. అమలు ఎప్పటికో? ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ అవసరాలకు కొత్త ఆఫీస్ కమ్ కౌన్సిల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని సుమారు రెండేళ్ల క్రితం నిర్ణయించారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టగా, స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ ఆమోదం కూడా లభించాయి. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద సన్నాహాలు చేయగా, ఆటంకాలు ఎదురయ్యాయి. భవన నిర్మాణానికి వీలుగా అక్కడి చెత్త ట్రాన్స్ఫర్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంది. అందుకు వేరే ప్రదేశం కనిపించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ కాంప్లెక్స్ అవసరాలకు సరిపడా లేదని, జనరల్ కౌన్సిల్ సమావేశాల కోసం తగిన కౌన్సిల్ హాల్ కూడా లేనందున రెండింటి అవసరాలు తీరేలా కొత్త ఆఫీస్ కమ్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఏడంతస్తుల్లో నిర్మించాలని భావించారు. అదీ అమలుకు నోచలేదు. ఈ నేపథ్యంలో రూ. 134 కోట్ల వ్యయమయ్యే కొత్త భవనం నిర్మాణం కూడా ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
బాధ్యత మరచిభారమా?
ముందు పక్కాగా ఏర్పాట్లు చేయండి ప్రజలకు అవగాహన కల్పించండి అప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు ‘లిట్టర్ ఫ్రీ’పై మేయర్ అభ్యంతరం నగరంలోని ఎంపిక చేసిన మార్గాలను ‘చెత్త రహిత’గా తీర్చిదిద్దాలని... నిబంధనలు ఉల్లంఘించే వారిపై శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించాలని జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంపై సాక్షాత్తూ మేయరే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రజలపై భారం మోపడం తగదని అంటున్నారు. దీన్ని స్టాండింగ్ కమిటీ ఆమోదించలేదని చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం దీనికి స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరం లేదని అంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా, అవసరమైనన్ని ప్రదేశాల్లో తగినన్ని డంపర్బిన్లు ఏర్పాటు చేయకుండా ప్రజలపై పెనాల్టీల భారం వేయడం తగదని మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. అన్ని లైన్లు, బైలైన్లలో అవసరమైనన్ని చెత్త రిక్షాలను అందుబాటులోకి తీసుకురాకుండా జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయాలు తీసుకోవడం తగదని అన్నారు. చెత్తరహిత రహదారులు (లిట్టర్ ఫ్రీ రోడ్స్) పథకం అమలులో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో చెత్త వేసే వారికి శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించిన నేపథ్యంలో మేయర్ పైవిధంగా స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉందన్నారు. జీహెచ్ఎంసీ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాక.. చెత్త రహిత వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించాక పెనాల్టీలు విధించవచ్చునన్నారు. అవేమీ లేకుండా పెనాల్టీలు తగవన్నారు. గ్రేటర్లో 8 వేల కి.మీ.కు పైగా రహదారులు ఉండగా, కేవలం 23 కి.మీ.కే దీన్ని పరిమితం చేయడం తగదన్నారు. గ్రేటర్‌లోని అన్ని రహదారులు, ప్రాంతాలను లిట్టర్ ఫ్రీగా చేయాల్సి ఉందన్నారు. రోడ్లన్నిటిపైనా చెత్తాచెదారాలు లేకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదేనన్నారు. జీహెచ్ఎంసీ మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. బాధ్యతలు విస్మరించి, ప్రజలపై భారం మోపాలనుకోవడం తగదన్నారు. స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోలేదు లిట్టర్ ఫ్రీ రోడ్స్‌పై స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదని మేయర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీలో ఏదైనా కార్యక్రమం అమలు చేయాలంటే విధాన నిర్ణయం తీసుకునే అధికారం స్టాండింగ్ కమిటీకే ఉందని గుర్తు చేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులే విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ పరోక్షంగా అధికారుల నిర్ణయాన్ని ఆక్షేపించారు. కేవలం సెంట్రల్ జోన్లోనే కాకుండా జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లను, ప్రాంతాలను చెత్త రహితంగా చేయాల్సి ఉందని చెప్పారు. దీనిపై తొలుత ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేవలం పత్రికా ప్రకటనలతో అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. అధికారులు స్టాండింగ్ కమిటీకి జవాబుదారీగా వ్యవహరించాలని హితవు పలికారు. వారు అమలు చేయబోయే ముందు కమిటీ ఆమోదం పొందాలని మేయర్ స్పష్టం చేశారు. ఒక వేళ అధికారులు ఈ విషయాలు పట్టించుకోకపోతే తగు చర్యల కోసం ప్రభుత్వానికి రాస్తామన్నారు. కమిషనరూ సభ్యుడే: కమిషనర్‌తో మీకు విబేధాలున్నాయా అన్న ప్రశ్నకు మేయర్ బదులిస్తూ.. కమిషనర్ తమ బృందంలోని సభ్యుడే (టీమ్ మెంబరే)నని వ్యాఖ్యానించారు. తమమధ్య ఎలాంటి విబేధాలూ లేవన్నారు. జీహెచ్ఎంసీలోని వారందరూ ఒకే కుటుంబ సభ్యులని అన్నారు. రెండేళ్లకుపైగా తాను మేయర్‌గా కొనసాగుతున్నానని, ఎవరు కమిషనర్‌గా ఉన్నా ఎలాంటి తేడాలు రాలేదని చెప్పారు. కమిషనర్ పనితీరుతో ఎలా ఉన్నారన్న ప్రశ్నకు బదులిస్తూ, ఎవరికీ తాను రేటింగ్ ఇవ్వబోనన్నారు. అది జోనల్ అధికారుల పని: కమిషనర్ లిట్టర్ ఫ్రీ కార్యక్రమం జోనల్ స్థాయి అధికారులు చేపడుతున్నదని జీహెచ్ఎంసీ కమిసనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. మేయర్ సమావేశానంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అది విధాన నిర్ణయం కాదని తెలిపారు. ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. మేయర్‌కు, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. తన విధులు తాను నిర్వర్తిస్తున్నానని స్పష్టం చేశారు. కొన్ని మార్గాలను తొలుత పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, అక్కడి ఫలితాలను బట్టి నగరమంతా అమలు చేయాలనేదే లక్ష్యమని తెలిపారు. ఎంపిక చేసిన రోడ్లపై చెత్త లేకుండా కాంట్రాక్టు పొందిన సంస్థే పర్యవేక్షిస్తున్నందున ఆ మార్గాల్లో డంపర్బిన్లతో పని లేదన్నారు. రూ.50 లక్షలకు పైబడి రూ.2 కోట్ల వరకు నిధుల మంజూరు బాధ్యత స్టాండింగ్ కమిటీపై ఉంటుందని, చట్టపరమైన, సాధారణంగా జరిగే పనులకు ప్రత్యేకంగా ఆమోదం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీ ఏవైనా ప్రతిపాదిస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుంటామని, ఇంతవరకు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు. అంశాల వారీగా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనన్నారు. ఆగస్టు 1నుంచి పెనాల్టీలు విధిస్తున్నట్లు తాను ఎక్కడా పేర్కొనలేదని, లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీ పేరిట పత్రికా ప్రకటన వెలువడిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ అంశం గురించి తెలుసుకుంటానన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెంట్రల్‌జోన్‌లో ఈపాటికే అమలవుతోందని చెప్పారు. తాను కొత్తగా చేపడుతున్న పథకాలంటూ ప్రత్యేకంగా లేవని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేస్తున్నానని చెప్పారు. ఇది స్పెషల్ డ్రైవ్: డాక్టర్ సత్యనారాయణ, సెంట్రల్ జోన్ కమిషనర్ లిట్టర్ ఫ్రీ పనులు గత ఫిబ్రవరి నుంచే జరుగుతున్నాయని, ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు త గిన చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. చెత్త వేసే వారికి జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు పెనాల్టీలు కొత్తగా విధిస్తున్నవి కావని, హైదరాబాద్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు స్పెషల్డ్రైవ్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించాక చర్యలు చేపడతామన్నారు. -
కూల్చివేతలు ఆపండి
లేకుంటే మేమే అడ్డుకుంటాం జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ల హెచ్చరిక సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను వెంటనే నిలిపి వేయాలని జీహెచ్ఎంసీలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీపక్ష నాయకులు డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ చాంబర్లో మూడు పార్టీల నాయకులు దిడ్డిరాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బంగారి ప్రకాశ్‌లు మరికొందరు కార్పొరేటర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూల్చివేతలను నిలిపి వేయని పక్షంలో శనివారం నుంచి ఎక్కడ కూల్చివేతలు జరిగితే అక్కడికి వెళ్లి అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికారులు బడాబాబుల జోలికి వెళ్లకుండా సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు కూడా బాధ్యులేనన్నారు. ఇందుకు కారకులైన టౌన్‌ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రజలపై విరుచుకుపడడం సరికాదన్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో చిక్కి సస్పెండైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడమేకాకుండా పదోన్నతులు కూడా ఇవ్వడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. నేడు సీఎం వద్దకు.. కూల్చివేతలను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు సదరు నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం డిప్యూటీ మేయర్ నేతృత్వంలో పార్టీలకతీతంగా ఫ్లోర్‌లీడర్లు, కార్పొరేటర్లు సీఎంను కలిసి ప్రజల ఇబ్బందులను వివరిస్తామన్నారు. కూల్చివేతలు నిలిపివేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపాలని కమిషనర్‌ను కోరినట్టు వారు పేర్కొన్నారు. ప్రత్యేక సర్వసభ్య సమావేశం.. కూల్చివేతలను నిలుపుదల చేయని పక్షంలో వచ్చేవారం జీహెచ్ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏ ర్పాటు చేయాల్సిందిగా మేయర్‌ను కోరతామని డిప్యూ టీ మేయర్ జి.రాజ్‌కుమార్, ఆయా పార్టీల నాయకులు దిడ్డిరాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బంగారి ప్రకాశ్ తెలిపారు. సదరు సమావేశంలో అధికారుల వైఖరిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. పరోక్షంగా.. కమిషనర్‌ను తప్పించేందుకు తీర్మానం చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. జీహెచ్ంఎసీ నిబంధనల మేరకు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి.. ప్రభుత్వానికి పంపించవచ్చు. కాగా, అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల్లో నిష్ణాతుడైన ఓ అధికారి తెలిపారు. 33 భవనాల కూల్చివేత.. అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు వేగం పెంచారు. గత మంగళవారం నుంచి కూల్చివేతలను చేపడుతున్నారు. శుక్రవారం ఆయా ప్రాంతాల్లోని 33 భవనా ల్లో కూల్చివేతలు జరిపారు. ఇందులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఫ్లాట్ ఉన్న భవనం కూడా ఉండడం గమనార్హం. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్‌లో ఆయన ఫ్లాట్ ఉన్న భవనంలో పార్కింగ్ కోసం కేటాయించిన స్టిల్ట్ ఫ్లోర్లో నిర్మించిన మూడు గదులను అధికారులు కూలదోశారు. విద్యాసాగర్ గన్మెన్ల కోసం ఈ గదులను నిర్మించినట్టు తెలిసింది. శుక్రవారం మల్లాపూర్, మీర్‌పేట, ఉప్పల్, చైతన్యపురి, ఎల్బీనగర్ మార్గదర్శికాలనీ, వాసవీకాలనీ, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, విజయనగర్‌కాలనీ, ఆగాపురా, మల్లేపల్లి, రామ్‌కోఠి, నాంపల్లి, నారాయణగూడ, చిక్కడపల్లి, జమిస్తాన్పూర్, కుత్బిగూడ, ఎస్సార్‌నగర్, మియాపూర్, రామచంద్రాపురం, కూకట్పల్లి గాయత్రీనగర్, కుత్బుల్లాపూర్, చింతల్, అల్వాల్, మల్కాజిగిరి, పద్మారావునగర్ తదితర ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించారు. -
ఫ్లోర్ లీడర్లతో మేయర్ భేటీ
సాక్షి, సిటీబ్యూరో: డెబ్రిస్(నిర్మాణ వ్యర్థాల) తొలగింపునకు ప్రతి డివిజన్‌కు ఒక వాహనాన్ని కేటాయించాల్సిందిగా గత స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ కమిషనర్‌కు సూచించారు. సుదీర్ఘ విరామం తర్వాత మేయర్ మాజిద్ బుధవారం డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశమయ్యారు. ప్రజావసరాల దృష్ట్యా చేపట్టాల్సిన పనుల గురించి సమావేశంలో చర్చించారు. ఆమేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సదరు పనులు వెంటనే చేయాల్సిందిగా క మిషనర్‌కు సూచించారు. వాటిల్లో ముఖ్యాంశాలు.. డెబ్రిస్ తొలగింపు పనులు వెంటనే పూర్తిచేయాలి. కార్పొరేటర్ల బడ్జెట్ నిధుల (కోర్ ఏరియా వారికి రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల వారికి రూ. 2 కోట్లు)నుంచి స్వల్పకాలిక టెండర్లు పిలిచి అవసరమైన పనులు వెంటనే చేపట్టాలి. బీటీ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలే తప్ప బీటీ ప్లాంట్లను మూసివేయరాదు పాట్‌హోల్స్ పనులు వెంటనే పూర్తిచేసి జాబితా సిద్ధం చేయాలి. డివిజన్ల వారీగా కొత్త రహదారుల వివరాలు 26న ‘షాబ్- ఎ- మైరాజ్’ను పురస్కరించుకొని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక వీధిదీపాల ఏర్పాటు. శ్మశానవాటికల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు. రూ. 5లకే భోజనం అమలు తీరుపై నివేదిక. అదనంగా ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల జాబితా. నాలాల డీసిల్టింగ్ పనులపై నివేదిక తిరిగి 23వ తేదీన జరుగనున్న సమీక్ష సమావేశానికి పై నివేదికల తో సంబంధిత అధికారులంతా హాజరుకావాలి. సమావేశంలో ఫ్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు(కాంగ్రెస్), ఎండి నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ), జీహెచ్ఎంసీ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.