కూల్చివేతలు ఆపండి
- లేకుంటే మేమే అడ్డుకుంటాం
- జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్ల హెచ్చరిక
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను వెంటనే నిలిపి వేయాలని జీహెచ్‌ఎంసీలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీపక్ష నాయకులు డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్ చాంబర్‌లో మూడు పార్టీల నాయకులు దిడ్డిరాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బంగారి ప్రకాశ్‌లు మరికొందరు కార్పొరేటర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూల్చివేతలను
నిలిపి వేయని పక్షంలో శనివారం నుంచి ఎక్కడ కూల్చివేతలు జరిగితే అక్కడికి వెళ్లి అడ్డుకుంటామని హెచ్చరించారు.
అధికారులు బడాబాబుల జోలికి వెళ్లకుండా సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు అధికారులు కూడా బాధ్యులేనన్నారు. ఇందుకు కారకులైన టౌన్‌ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రజలపై విరుచుకుపడడం సరికాదన్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో చిక్కి సస్పెండైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడమేకాకుండా పదోన్నతులు కూడా ఇవ్వడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు.
నేడు సీఎం వద్దకు..
కూల్చివేతలను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు సదరు నాయకులు తెలిపారు. ఈ మేరకు శనివారం డిప్యూటీ మేయర్ నేతృత్వంలో పార్టీలకతీతంగా ఫ్లోర్‌లీడర్లు, కార్పొరేటర్లు సీఎంను కలిసి ప్రజల ఇబ్బందులను వివరిస్తామన్నారు. కూల్చివేతలు నిలిపివేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపాలని కమిషనర్‌ను కోరినట్టు వారు పేర్కొన్నారు.
ప్రత్యేక సర్వసభ్య సమావేశం..
కూల్చివేతలను నిలుపుదల చేయని పక్షంలో వచ్చేవారం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏ ర్పాటు చేయాల్సిందిగా మేయర్‌ను కోరతామని డిప్యూ టీ మేయర్ జి.రాజ్‌కుమార్, ఆయా పార్టీల నాయకులు దిడ్డిరాంబాబు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బంగారి ప్రకాశ్ తెలిపారు. సదరు సమావేశంలో అధికారుల వైఖరిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. పరోక్షంగా.. కమిషనర్‌ను తప్పించేందుకు తీర్మానం చేయనున్నట్టు సంకేతాలిచ్చారు. జీహెచ్‌ంఎసీ నిబంధనల మేరకు సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి.. ప్రభుత్వానికి పంపించవచ్చు. కాగా, అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల్లో నిష్ణాతుడైన ఓ అధికారి తెలిపారు.
33 భవనాల కూల్చివేత..
అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు వేగం పెంచారు. గత మంగళవారం నుంచి కూల్చివేతలను చేపడుతున్నారు. శుక్రవారం ఆయా ప్రాంతాల్లోని 33 భవనా ల్లో కూల్చివేతలు జరిపారు. ఇందులో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఫ్లాట్ ఉన్న భవనం కూడా ఉండడం గమనార్హం. ఎల్‌బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో ఆయన ఫ్లాట్ ఉన్న భవనంలో పార్కింగ్ కోసం కేటాయించిన స్టిల్ట్ ఫ్లోర్‌లో నిర్మించిన మూడు గదులను అధికారులు కూలదోశారు. విద్యాసాగర్ గన్‌మెన్ల కోసం ఈ గదులను నిర్మించినట్టు తెలిసింది.
శుక్రవారం మల్లాపూర్, మీర్‌పేట, ఉప్పల్, చైతన్యపురి, ఎల్‌బీనగర్ మార్గదర్శికాలనీ, వాసవీకాలనీ, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, విజయనగర్‌కాలనీ, ఆగాపురా, మల్లేపల్లి, రామ్‌కోఠి, నాంపల్లి, నారాయణగూడ, చిక్కడపల్లి, జమిస్తాన్‌పూర్, కుత్బిగూడ, ఎస్సార్‌నగర్, మియాపూర్, రామచంద్రాపురం, కూకట్‌పల్లి గాయత్రీనగర్, కుత్బుల్లాపూర్, చింతల్, అల్వాల్, మల్కాజిగిరి, పద్మారావునగర్ తదితర ప్రాంతాల్లో కూల్చివేతలు నిర్వహించారు.