నువ్వా? నేనా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తమ్ముళ్ల మధ్య చిచ్చురేపాయి. ఎన్నికల్లో తమ వర్గానిదే పై చేయి కావాలంటూ పోటీపడుతుండటమే ఇందుకు కారణం. నెల్లూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఆ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు బుధవారంతో ముగియనున్నాయి. అందుకు అవసరమైన సభ్యులు ఎంపికపై టీడీపీలో కసరత్తు ప్రారంభించింది.
నగరపాలక సంస్థ పాలకవర్గంలో మేయర్ తరువాత స్టాండింగ్‌కమిటీకి అత్యధిక ప్రాధాన్యం ఉంది. రూ.50 లక్షలలోపు అభివృద్ధిపనులకు సంబంధించి స్టాండింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఆ కమిటీలో సభ్యుల సంఖ్య ఎటువైపు ఉంటే.. వారు చెప్పినట్లు అభివృద్ధి పనులకు అనుమతులు పొందే అవకాశం ఉంది. అందుకు అవసరమైన సభ్యుల్లో ఎక్కువశాతం తమ వర్గం వారే ఉండాలని టీడీపీలో ఇరు వర్గాలు పోటీపడుతున్నాయి. నెల్లూరు నగర పాలక వర్గంలో 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
వీరిలో 31 మంది కార్పొరేటర్లు టీడీపీకి చెందిన వారే కావటం గమనార్హం. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న 13 మంది కార్పొరేటర్లు ఓ వర్గం, టీడీపీకి చెందిన కార్పొరేటర్లు మరో వర్గంగా చెలామణి అవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ నుంచి ఐదుగురు సభ్యులు బరిలో నిలబడే అవకాశం ఉంది. టీడీపీ తరుపున బరిలో ఉండే ఐదుగురు సభ్యుల్లో మేయర్ వర్గానికి చెందిన వారు ఇద్దరు ఉండాలని పట్టుబడుతున్నారు.
అదే విధంగా టీడీపీ వర్గానికి చెందిన వారు నలుగురు ఉండాలని వారు పోటీ పడుతున్నారు. అయితే మేయర్ వర్గానికి రెండు ఇవ్వటానికి టీడీపీ వర్గీయులు ససేమిరా అంటున్నారు. ఒకరైతే తమకు ఓకేనని చెపుతుండటం మేయర్ వర్గానికి రుచించడం లేదు.