ఫ్లోర్ లీడర్లతో మేయర్ భేటీ
సాక్షి, సిటీబ్యూరో: డెబ్రిస్(నిర్మాణ వ్యర్థాల) తొలగింపునకు ప్రతి డివిజన్‌కు ఒక వాహనాన్ని కేటాయించాల్సిందిగా గత స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ కమిషనర్‌కు సూచించారు. సుదీర్ఘ విరామం తర్వాత మేయర్ మాజిద్ బుధవారం డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశమయ్యారు. ప్రజావసరాల దృష్ట్యా చేపట్టాల్సిన పనుల గురించి సమావేశంలో చర్చించారు. ఆమేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సదరు పనులు వెంటనే చేయాల్సిందిగా క మిషనర్‌కు సూచించారు. వాటిల్లో ముఖ్యాంశాలు..
డెబ్రిస్ తొలగింపు పనులు వెంటనే పూర్తిచేయాలి.
కార్పొరేటర్ల బడ్జెట్ నిధుల (కోర్ ఏరియా వారికి రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల వారికి రూ. 2 కోట్లు)నుంచి స్వల్పకాలిక టెండర్లు పిలిచి అవసరమైన పనులు వెంటనే చేపట్టాలి.
బీటీ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలే తప్ప బీటీ ప్లాంట్లను మూసివేయరాదు
పాట్‌హోల్స్ పనులు వెంటనే పూర్తిచేసి జాబితా సిద్ధం చేయాలి.
డివిజన్ల వారీగా కొత్త రహదారుల వివరాలు
26న ‘షాబ్- ఎ- మైరాజ్’ను పురస్కరించుకొని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక వీధిదీపాల ఏర్పాటు. శ్మశానవాటికల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు.
రూ. 5లకే భోజనం అమలు తీరుపై నివేదిక. అదనంగా ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల జాబితా.
నాలాల డీసిల్టింగ్ పనులపై నివేదిక
తిరిగి 23వ తేదీన జరుగనున్న సమీక్ష సమావేశానికి పై నివేదికల తో సంబంధిత అధికారులంతా హాజరుకావాలి.
సమావేశంలో ఫ్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు(కాంగ్రెస్), ఎండి నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ), జీహెచ్‌ఎంసీ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.