మనమిలా అనకూడదు. అర్థం కావడానికంతే..! ‘డాక్టరమ్మ’ అనే అనాలి. అదే అతడికి గౌరవం. తనలోని స్త్రీని గౌరవించిన వ్యక్తిని.. పురుషుడిగా చూడ్డం అగౌరవం. అతడి స్త్రీత్వానికే అవమానం.
బెయాన్సి అమ్మాయి కాదు. అబ్బాయి! అబ్బాయి కాబట్టి తల్లిదండ్రులు అబ్బాయి పేరే పెట్టారు.. బొబొయ్ అని. టీనేజ్‌లోకి వచ్చాక, ఇంట్లోంచి వెళ్లిపోయాక తనకై తను బెయాన్సీగా పేరు మార్చుకున్నాడు బొబొయ్. (ఇక ఇక్కడి నుంచి మనం ‘డు’ అనే మాట వాడకూడదు. బొబొయ్ తనను తను పరిపూర్ణ స్త్రీగా మలచుకున్నారు కనుక). బెయాన్సి ప్రసుతం ఇంఫాల్‌లోని షిజా హాస్పిటల్స్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్‌లకు వైద్యసేవలను అందించడం కోసం బెయాన్సిని ఎంపిక చేసుకున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్. పేషెంట్‌ల దగ్గర తప్ప బెయాన్సి ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు. ఎవరితోనూ మాట్లాడరు.
ఏదో విషాదం ఆమె అందమైన ముఖంలో! అయితే తొందరపడి విషాదం అనుకోనక్కర్లేదు మనం. బాల్యం నుంచీ తనంతే. టీనేజ్‌లోకి వచ్చాక ఆమె అందంలోకి ఆమె మౌనం మిళితం అయి, మెరుపును తెచ్చింది. ఉరమని మెరుపు.. బెయాన్సి. ‘‘నువ్విలాగే ఉంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను’’ అని తండ్రి బెదరించినప్పుడు కూడా ఆమె మౌనంగానే ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. అప్పుడు ఆమె వయసు ఇరవై. ‘నువ్విలాగే ఉంటే..’ అని అనడంలోని ఆయన ఉద్దేశం.. ‘నువ్విలాగే అమ్మాయిలా ఉంటే..’ అని.
‘‘నేనిలాగే ఉంటాను నాన్నా.. ఇలా ఉండటమే నాకు బాగుంటోంది..’ అని తండ్రికి చెప్పి ఇంట్లోంచి వచ్చేసిన బెయాన్సి ఆ కొన్ని రోజులకే ఆయనపై ఇంకో పెద్ద బండను ఎత్తిపడేసింది. అందాలపోటీలో పాల్గొని ‘మిస్ ట్రాన్స్ క్వీన్ నార్త్‌ఈస్ట్’గా టైటిల్ గెలుచుకుంది. అధికారికంగా తను పేరు మార్చుకుంది కూడా అప్పుడే. అప్పటికి ఆమె రిమ్స్ స్టూడెంట్. రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెస్! మంచి కాలేజ్. డాక్టర్ అవ్వాలని ఆమె ఆశయం.
ఇంఫాల్‌లోని రిమ్స్‌లో నాలుగున్నరేళ్ల ఎంబీబిఎస్ పూర్తి చేసి, తర్వాత రెండేళ్లు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసి ఈమధ్యే షిజా ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఈశాన్య భారతదేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ లేడీ డాక్టర్ బెయాన్సి ఇప్పుడు. ‘‘బెయాన్సిని మనం స్త్రీ అని గానీ, పురుషుడు అని గానీ తీసుకోలేదు. మనకు ఆమె నైపుణ్యం గల ఒక డాక్టర్ మాత్రమే’’ అని అన్నారు ఆసుపత్రి సూరింటెండెంట్ జుగింద్ర తొలిరోజు ఆమెను మిగతా వైద్యసిబ్బందికి పరిచయం చేస్తున్నప్పుడు. ఇప్పుడామె వైద్యురాలిగా పనిచేస్తూనే రిమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షకు సిద్ధం అవుతున్నారు.
ఎంబీబిఎస్ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే తనను తను అమ్మాయిగా ప్రపంచానికి వెల్లడించుకున్నారు బెయాన్సి. అయితే తన గురించి తనకు వెల్లడయింది మాత్రం తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు. తను అబ్బాయే కానీ, మిగతా అబ్బాయిల్లా ఉండటం లేదు. పైగా అమ్మాయిలా ఉంటున్నాడు. తనకూ అమ్మాయిలానే ఉండాలని అనిపిస్తోంది! ఒక్కో ఏడాది కాదు.. ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ ‘ఆమె’ తనను తను ఇష్టపడటం మొదలైంది. స్కూల్లో తనకు అమ్మాయిల పక్కన కూర్చోవాలనిపించేది. వాళ్ల బట్టల్ని ఇష్టపడుతుండేది. వాళ్ల నడకను, నవ్వును చాటుగా అనుకరిస్తుండేది. ఇదంతా ఇంట్లో వాళ్లు గమనించడానికి ముందు టీచర్ గమనించింది.
స్కూల్లోనూ, ఇంట్లోనూ తెలిశాక దాచడానికి ఏముంటుంది. ‘నేనిలా అవుతున్నాను..’ అని ఇంట్లో చెప్పేసింది. ‘నుపీ మాన్బీ!!’ అని పెద్దగా అరిచేశాడు తండ్రి. నుపీ మాన్బీ అంటే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలోని స్త్రీ. మౌనం అక్కడ మొదలైంది బెయాన్సి జీవితంలో. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అదలా ఉంచితే, సాధారణ రోగులకే కాదు, నుపీ మాన్బీ స్త్రీల ఆరోగ్యం కోసం కూడా తనేదైనా చేయాలని ఆలోచిస్తున్నారిప్పుడు బెయాన్సి. ఇప్పుడిప్పుడు ఇంటికి రాకపోకలు కూడా మొదలయ్యాయి. అంటే.. తల్లిదండ్రులు ఆమెను ఆమెగా స్వీకరించేశారు! ఎవరి జీవితం వాళ్ల ఇష్టం అని అనుకోగలిగిన మనోబలాన్ని చేకూర్చుకున్నారు.
ఇరవై ఏళ్ల వయసులో ‘మిస్ ట్రాన్స్ క్వీన్ నార్త్ ఈజ్’గా బెయాన్సి
Comments
Please login to add a commentAdd a comment