
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం గుర్తించదగిన స్థాయిలో పటిష్టంగా లేదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్‌సీహెచ్) వచ్చిన ఫిర్యాదుల సంఖ్య గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కూడా చెప్పారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్‌ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2021 నవంబర్‌నాటికి నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 40,000 ఉంటే, 2022 నవంబర్ నాటికి ఈ సంఖ్య 90,000కు చేరిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం మొత్తం ఫిర్యాదుల్లో ఈ– కామర్స్ లావాదేవీలకు సంబంధించినవి 8 శాతం ఉంటే, గత నెల్లో ఇది 48 శాతంగా నమోదయినట్లు వెల్లడించారు. ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగా లేదన్న విషయం దీనిని బట్టి అర్థం అవుతోందని అన్నారు.
కీలక చర్యలకు శ్రీకారం..
వినియోగదారుల బలహీనపడుతున్న పరిస్థితుల్లో మంత్రిత్వజోక్యం పాత్ర కీలకమవుతోందని అన్నారు. ప్రస్తుతం 10 భాషల్లో ఎన్‌సీహెచ్ సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో ఇవి 22కి పెరుగుతాయని చెప్పారు. వినియోగ హక్కుల పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 5.27 లక్షల కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సింగ్, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల్లో 1.8 లక్షలు బీమా రంగానికి సంబంధించినవి కాగా మరో 80,000 కేసులు బ్యాంకింగ్‌కు సంబంధించినవని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల ప్రకటన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘‘మేము ఇప్పుడు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసాము. అది త్వరలో విడుదలవుతుంది. ఉత్పత్తిని ఆమోదించి, ప్రచారం చేసిన వారు డబ్బు తీసుకున్నారో, లేదో వెల్లడించాలి’’ అని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు, స్థిర ప్యాకేజింగ్‌పై ప్రమాణాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment