public affairs centre index
-
ఈ– కామర్స్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మెరుగుపడాలి
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం గుర్తించదగిన స్థాయిలో పటిష్టంగా లేదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు (ఎన్సీహెచ్) వచ్చిన ఫిర్యాదుల సంఖ్య గత నాలుగేళ్లలో భారీగా పెరిగిందని కూడా చెప్పారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2021 నవంబర్‌నాటికి నేషనల్ కన్సూ్యమర్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 40,000 ఉంటే, 2022 నవంబర్ నాటికి ఈ సంఖ్య 90,000కు చేరిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం మొత్తం ఫిర్యాదుల్లో ఈ– కామర్స్ లావాదేవీలకు సంబంధించినవి 8 శాతం ఉంటే, గత నెల్లో ఇది 48 శాతంగా నమోదయినట్లు వెల్లడించారు. ఈ–కామర్స్ సంస్థల ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగా లేదన్న విషయం దీనిని బట్టి అర్థం అవుతోందని అన్నారు. కీలక చర్యలకు శ్రీకారం.. వినియోగదారుల బలహీనపడుతున్న పరిస్థితుల్లో మంత్రిత్వజోక్యం పాత్ర కీలకమవుతోందని అన్నారు. ప్రస్తుతం 10 భాషల్లో ఎన్సీహెచ్ సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో ఇవి 22కి పెరుగుతాయని చెప్పారు. వినియోగ హక్కుల పరిరక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 5.27 లక్షల కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సింగ్, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం కేసుల్లో 1.8 లక్షలు బీమా రంగానికి సంబంధించినవి కాగా మరో 80,000 కేసులు బ్యాంకింగ్‌కు సంబంధించినవని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే ఉత్పత్తుల ప్రకటన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు. ‘‘మేము ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసాము. అది త్వరలో విడుదలవుతుంది. ఉత్పత్తిని ఆమోదించి, ప్రచారం చేసిన వారు డబ్బు తీసుకున్నారో, లేదో వెల్లడించాలి’’ అని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు, స్థిర ప్యాకేజింగ్‌పై ప్రమాణాలను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు. -
సమ న్యాయంలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: దేశంలో ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వం/సమ న్యాయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలోనూ, మొత్తమ్మీద (ఓవరాల్ ర్యాంకింగ్స్)లో తృతీయ స్థానంలో నిలిచిందని పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్ (ప్రజా వ్యవహారాల సూచీ–పీఏఐ)–2020 వెల్లడించింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గతంతో పోల్చితే ప్రగతి చూపినట్టు ప్రముఖంగా ప్రస్తావించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ (పీఏసీ) దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిపాలన తీరు తెన్నులపై అధ్యయనం చేసి పబ్లిక్ ఎఫైర్స్ సూచీ–2020ని శనివారం ప్రకటించింది. వివిధ సామాజిక అంశాలపై ఈ సంస్థ పరిశోధనలు, అధ్యయనాలు చేయడంలో ప్రసిద్ధి చెందింది. 23 అంశాల ఆధారంగా ఆర్థిక, సామాజిక, లింగ సమానత్వంలో ప్రగతిని అంచనా వేసి ఫలితాలు వెల్లడించినట్టు సంస్థ ప్రకటించింది. ఆయా అంశాల్లో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించింది. పెద్ద రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం 1 పెద్ద రాష్ట్రాల విభాగంలో సమానత్వం/సమ న్యాయం విషయంలో పీఏఐ ర్యాంకింగ్స్ 2019లో దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2020లో శరవేగంగా ప్రథమ స్థానంలోకి రావడాన్ని సంస్థ ప్రముఖంగా ప్రస్తావించింది. 2 రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మహిళలకు పెద్దఎత్తున అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు శరవేగంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైనట్టు నిపుణులు విశ్లేషించారు. 3 సమ న్యాయం విషయంలో 2020 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ (0.652 పాయింట్లతో) కేరళ (0.629), ఛత్తీస్‌గఢ్ (0.260 పాయింట్లలో) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 4 2019తో పోల్చితే మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణా, ఉత్తరప్రదేశ్ నెగిటివ్ సూచీలతో అట్టడుగు స్థానాలకు దిగజారాయి. ఇదే అంశంలో చిన్న రాష్ట్రాల విభాగంలో మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. 5 వృద్ధి విషయంలో కేరళ గతంలో ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా కర్ణాటక మూడో స్థానం నుంచి రెండో స్థానంలోకి ఎగబాకింది. వృద్ధి విషయంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నాయి. మూడు అంశాలు ప్రాతిపదికగా సమన్యాయం, వృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే మూడు అంశాలను ప్రాతిపదికగా రాష్ట్రాలకు ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇచ్చినట్టు పీఏసీ పేర్కొంది. -
పాలనలో కేరళ టాప్
బెంగళూరు: దేశంలో అత్యుత్తమ పాలన సాగి స్తున్న రాష్ట్రంగా కేరళ అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. కర్ణాటకకు చెందిన ప్రజా వ్యవహారాల కేంద్రం (పీఏసీ) శనివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమం లో 2018 ప్రజా వ్యవహారాల సూచిక (పీఏఐ) ను విడుదల చేసింది. ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త శామ్యూల్ పాల్ 1994లో స్థాపించిన ఈ సంస్థ.. దేశంలో మెరుగైన పాలన సాధిం చడం కోసం కృషి చేస్తూ వస్తోంది. ఈ క్రమం లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపై అధ్యయనం చేసి గత మూడేళ్లుగా ర్యాంకులు ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లో సాం ఘిక, ఆర్థికాభివృద్ధిని గణాంకాల సహితంగా పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటా యిస్తోంది. తాజా నివేదిక ప్రకారం మెరుగైన పాలన చేస్తున్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానం సాధించగా.. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్ అట్టడుగున నిలిచాయి. చిన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ టాప్ పీఏసీ నివేదిక ప్రకారం మెరుగైన పాలన సాగి స్తున్న చిన్న రాష్ట్రాల్లో (జనాభా రెండు కోట్ల కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు) హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గోవా, మిజో రం, సిక్కిం, త్రిపుర వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. నాగా లాండ్, మణిపూర్, మేఘాలయ సూచికలో అట్ట డుగున మిగిలిపోయాయి. పెరుగుతున్న జనాభా ఆధారంగా అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ కస్తూరిరంగన్ పేర్కొన్నారు. -
పాలనలో వెనుకబాటే
పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ ఇండెక్స్‌లో తెలంగాణకు 20వ స్థానం.. ► 14వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ► ‘ద్రవ్య నిర్వహణ’లో తెలంగాణ టాప్.. ఏపీ లాస్ట్ సాక్షి, న్యూఢిల్లీ: పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ విడుదల చేసిన ఇండెక్స్ తేల్చింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాలను నేపథ్యంగా తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాల పాలనా తీరుపై ఇటీవల పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్–2017ను విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలవగా... తెలంగాణ 20వ స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా పాలనాపరమైన అంశాల్లో వెనుకబడే ఉంది. ఈ ఇండెక్స్‌లో ఏపీ 14వ స్థానంలో నిలిచింది. 10 నేపథ్యాలు, 26 కీలక విషయాలు, 82 సూచికల ఆధారంగా ఈ సంస్థ మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించింది. అవసరమైన మౌలిక వసతులు, మానవ అభివృద్ధికి మద్దతు, సామాజిక రక్షణ, మహి ళలు–పిల్లలు, న్యాయ పరిష్కార సేవలు, నేరా లు–శాంతిభద్రతలు, పర్యావరణం, పారదర్శ కత–జవాబుదారీతనం, ద్రవ్య నిర్వహణ, ఆర్థి క స్వేచ్ఛ అంశాలతో కూడిన 10 నేపథ్యాలను పరిశీలించి ర్యాంకులు ఇచ్చింది. రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం పెరుగుదల తదితర విషయా లతో కూడిన ‘ద్రవ్య నిర్వహణ’లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. ఏపీ 28వ స్థానంలో నిలిచింది. ఏ అంశంలో ఏ స్థానం..! ► పారిశ్రామిక ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన తదితర అంశాలను పరిశీలించిన ‘ఆర్థిక స్వేచ్ఛ’లో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో నిలిచాయి. ► విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, గృహ నిర్మాణం తదితర ‘అవసరమైన మౌలిక వసతులు’ అంశంలో ఏపీ 6, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి. ► విద్య, ఆరోగ్యం తదితర అంశాలతో కూడిన ‘మానవ అభివృద్ధికి చేయూత’లో ఏపీ 17, తెలంగాణ 26వ స్థానం దక్కాయి. ► ప్రజాపంపిణీ వ్యవస్థ, సామాజిక న్యాయం–సాధికారత, మైనారిటీల సంక్షేమం, ఉపాధి కల్పన తదితర ‘సామాజిక భద్రత’ అంశంలో ఏపీ 24, తెలంగాణ చివరన 30వ స్థానంలో నిలిచాయి. ► పిల్లలపై నేరాలు, బాలకార్మికులు, ఐసీడీఎస్ లబ్ధిదారుల శాతం, లింగ నిష్పత్తి, పౌష్టికాహార లోపం, ఆసుపత్రుల్లో ప్రసవాలు తదితర మహిళలు–పిల్లలు’ అంశంలో ఏపీ 19, తెలంగాణ 21వ స్థానంలో ఉన్నాయి. ► అత్యాచారాలు, హత్యలు, వరకట్న బాధిత చావులు, కస్టోడియల్ మరణాలు, పోలీసు సిబ్బంది సంఖ్య తదితర విషయాలను పరిశీలించే ‘నేరాలు, శాంతిభద్రతలు’ అంశంలో ఏపీ 11, తెలంగాణ 21 స్థానంలో నిలిచాయి. ► కేసుల పెండెన్సీ, న్యాయాధికారుల ఖాళీలు, అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తదితర అంశాలతో కూడిన ‘న్యాయ సేవల పరిష్కారం’లో ఏపీ 23, తెలంగాణ 21వ స్థానాలతో వెనకపడ్డాయి. ► కాలుష్యం, పర్యారణ ఉల్లంఘనలు, అటవీ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వంటి అంశాలున్న ‘పర్యావరణం’లో ఏపీ 20, తెలంగాణ 28వ స్థానంలో నిలిచాయి. ► ఈ–గవర్నెన్స్ సేవలు, ఆర్టీఐ, లోకాయుక్త చట్టం, ఏసీబీ కేసుల పరిష్కారం, ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డులు తదితర విషయాలపై పరిశీలన చేసిన ‘పారదర్శకత, జవాబుదారీతనం’ అంశంలో ఏపీ 23, తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.