
ముసాయిదా సిద్ధం చేసిన కేంద్రం
పారదర్శకతకు మరింత పెద్ద పీట
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ను మరింత జవాబుదారీగా చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ షాపింగ్ రంగంలో మోసపూరిత పద్ధతుల నుండి వినియోగదారులను రక్షించడానికి.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు స్వీయ–నియంత్రణ చర్యలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ’ఈ–కామర్స్–ప్రిన్సిపుల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్’ పేరుతో ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఈ నియమాలను రూపొందించింది.
భాగస్వాముల నుంచి ఫిబ్రవరి 15లోపు అభిప్రాయాలను కోరింది. లావాదేవీకి ముందు, ఒప్పందం, కొనుగోలు తదనంతర దశలను కవర్ చేస్తూ మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నియమాలు అమలులోకి వస్తే కస్టమర్లు, ఈ–కామర్స్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీల్లో పారదర్శకత మరింత పెరగనుంది. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలకు అడ్డుకట్ట పడుతుంది. అట్టి ఉత్పత్తులు ఏవైనా లిస్ట్ అయితే ఫిర్యాదులకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
మార్గదర్శకాల ప్రకారం..
ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా వ్యాపార భాగస్వాముల సంపూర్ణ కేవైసీని నిర్వహించాలి. ముఖ్యంగా థర్డ్ పార్టీ విక్రేతల పూర్తి వివరాలు ఉండాల్సిందే. ఉత్పత్తుల ప్రయోజనం, ఫీచర్లను అంచనా వేయడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి టైటిల్, విక్రేత చిరునామా, గుర్తింపు సంఖ్య, వీడియోల వంటి సపోరి్టంగ్ మీడియాతో సహా వివరణాత్మక ఉత్పత్తి జాబితాను తప్పనిసరి చేస్తారు.
ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నట్టయితే దిగుమతిదారు వివరాలు, ప్యాకింగ్ చేసిన కంపెనీ, విక్రేతల వివరాలు ఉండాల్సిందే. ప్రాసెసింగ్ చార్జీలు ముందే వెల్లడించాలి. ఒప్పంద సమయంలో కస్టమర్ సమ్మతి, లావాదేవీని సమీక్షించే అవకాశం, క్యాన్సలేషన్‌కు, ఉత్పత్తి వెనక్కి ఇవ్వడానికి, రిఫండ్స్‌కు పారదర్శక విధానం అమలు చేయాల్సి ఉంటుంది. లావాదేవీల పూర్తి వివరాలను నమోదు చేయాలి. చెల్లింపులు పూర్తి సురక్షితంగా జరిగేలా పేమెంట్ సిస్టమ్ అమలులోకి తేవాలి. చట్టాలకు లోబడి కస్టమర్లకు ఈ సమాచారం అందుబాటులో ఉంచాలి. విక్రేతలందరినీ కంపెనీలు సమానంగా చూడాల్సిందే. ఏ విక్రేతకూ ప్రాధాన్యత ఇవ్వకూడదు.
Comments
Please login to add a commentAdd a comment