
భవానీపట్నం/భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ రోహిత్‌కుమార్ బిశ్వాల్(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెలలో జరగబోయే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిస్తూ మావోయిస్టులు మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్‌ను రోహిత్‌కుమార్ తిలకిస్తుండగా అక్కడే బాంబు పేలిందని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు.