Kalahandi
-
భర్తకు ట్రాన్స్‌వుమన్‌తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య..
భువనేశ్వర్: ఒడిశా కలాహాండీ జిల్లాలో ట్రాన్స్‌వుమన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 32 ఏళ్ల వ్యక్తి. అయితే అతనికి అప్పటికే మరో మహిళతో వివాహమైంది. రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ భార్య అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మొదటి భార్య ఒప్పుకోవడమే గాక.. ట్రాన్స్‌వుమన్ కూడా తమతో పాటు ఒకే ఇంట్లో ఉండేందుకు అనుమతించడం గమనార్హం. అలామొదలైంది.. ట్రాన్స్‌వుమన్‌ను గతేడాది రాయగడ జిల్లా అంబడోలాలో చూశాడు ఈ వ్యక్తి. రోడ్డుపై భిక్షాటన చేసే ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలోపడిపోయాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత రోజూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అయితే నెల రోజుల క్రితం ఈ వ్యక్తి భార్య అతని ఫోన్‌ను చెక్ చేయగా అసలు విషయం తెలిసింది. రోజూ ట్రాన్స్‌వుమెన్‌తో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అతడ్ని భార్య నిలదీసింది. ఇక చేసేదేంలేక అతను నిజం ఒప్పుకున్నాడు. ట్రాన్స్‌వుమన్‌తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించాడు. ఆమె తనుకు చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. దీంతో భార్య వారి రిలేషన్‌కు అంగీకరించింది. పెళ్లి చేసుకుంటామంటే ఓకే చెప్పింది. భార్య అంగీకారంతో ట్రాన్స్‌వుమన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు భర్త. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. రెండో పెళ్లి చెల్లదు.. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా అది చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. భర్త మాత్రం తమ కుటుంబమంతా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నాడు. చట్టాల గురించి తాము పట్టించుకోమని పేర్కొన్నాడు. చదవండి: అంబులెన్సులా మారిన బుల్డోజర్.. వీడియో వైరల్ -
ఒడిశాలో బాంబు పేలుడు.. జర్నలిస్టు మృతి
భవానీపట్నం/భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కలహండీ జిల్లాలో శనివారం బాంబు(ఐఈడీ) పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రముఖ పత్రిక జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్ రోహిత్‌కుమార్ బిశ్వాల్(46) మరణించాడు. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ బాంబు పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెలలో జరగబోయే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిస్తూ మావోయిస్టులు మదన్‌పూర్ రాంపూర్ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్‌ను రోహిత్‌కుమార్ తిలకిస్తుండగా అక్కడే బాంబు పేలిందని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. -
ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక
భవానీపట్నా: భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె చితిలోకి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సియాల్జోడి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరణించిన వ్యక్తిని నీలమణి సబర్ (65)గా గుర్తించారు. భార్య రైబారి (60) అంత్యక్రియలకు తన నలుగురు కుమారులతో పాటు ఆయన హాజరయ్యారు. చితికి నిప్పంటించాక సంప్రదాయం ప్రకారం పక్కనే ఉన్న నీటి మడుగు వద్దకు నలుగురు కుమారులు, బంధువులు స్నానానికి వెళ్లిన తర్వాత నీలమణి చితిలో దూకారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది
రాయగడ: అలల ప్రయాణం తీరం చేరేవరకు మాత్రమే. కలల ప్రయాణం మెలకువ వచ్చేంత వరకే. కానీ స్నేహ ప్రయాణం ప్రాణమున్నంత వరకు అన్న వ్యాఖ్యలకు అర్థం మార్చేశాడో ప్రబుద్ధుడు. అనుమానం పెనుభూతమై ప్రియురాలి కోసం స్నేహితుడిని దారుణ హత్య చేసి.. మృతదేహాన్ని ఇసుక కుప్పలో దాచిన ఓ నిందితుడి ఉదంతం సోమవారం వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. కలహండి జిల్లాలోని టిట్లాఘడ్ గ్రామానికి చెందిన రామన్ బబర్తీ, దేబన్పొడ గ్రామానికి చెందిన ఉమాకాంత కండొ (25) ప్రాణ స్నేహితులు. రామన్ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అయితే స్నేహితుడైన ఉమాకాంత కండొతో రామన్ ప్రియురాలు చనువుగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయిన రామన్ స్నేహితుడిని హత్య చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో రాయగడలో ఉన్న సోదరి ఇంటికి వచ్చి అక్కడి స్నేహితులైన ప్రశాంత్ బబర్తీ, ప్రకాష్ బటొలకు విషయం తెలియజేశాడు. వారంతా కలిసి పథకం ప్రకారం గత నెల 4 వ తేదీన ఉమాకాంతను రాయగడలో విందు భోజనానికి ఆహ్వానించారు. ఇసుక కుప్పలో మృతదేహం ఆహ్వానం మేరకు రాయగడ వచ్చిన ఉమాకాంతను రామన్, స్నేహితులు జిల్లాలోని కల్యాణసింగుపూర్ ప్రాంతంలోని చెక్ డ్యామ్‌కు తీసుకువెళ్లారు. పథకం ప్రకారం ఉమాకాంతతో ఎక్కువ మద్యం తాగించి గొంతునులిమి హత్య చేశారు. అనంతరం ఉమాకాంత మృతదేహాన్ని డ్యామ్ సమీపంలో ఇసుక కుప్పవద్ద పాతిపెట్టి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే మే 4 వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఉమాకాంత ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు టిట్లాఘడ్ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉమాకాంత స్నేహితుడైన రామన్ బబర్తీ ఫోన్‌ను ట్రాక్ చేయడంతో విషయం బయటపడింది. రామన్ బబర్తీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉమాకాంతను హత్య చేసిన సంగతి అంగీకరించాడు. ఈ సమాచారం మేరకు చెక్‌డ్యామ్ వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని మేరకు కల్యాణసింగుపురం పోలీసుల సహాయంతో టిట్లాఘడ్ పోలీసులు వెలికితీశారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. -
ఇంటి పైకప్పుతో తల్లి అంత్యక్రియలు
-
దయనీయం.. ఇంటి పైకప్పుతో తల్లి అంత్యక్రియలు
కలహంది: మొత్తం దేశ వ్యాప్తంగా మానవతావాదుల హృదయాలను కదిలించిన ఒడిశాలోని మాఝి అనే గిరిజన వ్యక్తి ఘటన మరువక ముందే అచ్చం అలాంటి హృదయవిదారక ఘటనే ఒడిశాలోని కలహంది జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది. తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు కూతుళ్లు ఇంటి పైకప్పుకు ఉన్న కలపను ఉపయోగించారు. కనక్ సప్తతి (75) అనే మహిళ దీర్ఘకాలిక అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. వారిది చాలా బీద కుటుంబం. ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు ఊర్లో వారందరిని తమకు సహాయం చేయాల్సిందిగా అర్థించారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో చేసేది లేక సొంత ఇంటి పైకప్పు ఊడదీశారు. దాని ద్వారా వెళ్లిన కలప తీసుకెళ్లి ఏర్పాట్లు చేశారు. శవాన్ని తీసుకెళ్లేందుకు సహాయంగా ఎవరూ రాకపోవడంతో ఇంట్లోని ఓ మంచంపై పెట్టి వారే స్వయంగా మోసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ ఇవ్వకుంటే భార్య శవాన్ని భుజానికెత్తుకుని మాఝి అనే గిరిజన వ్యక్తి మోసుకెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.