
రాయగడ: అలల ప్రయాణం తీరం చేరేవరకు మాత్రమే. కలల ప్రయాణం మెలకువ వచ్చేంత వరకే. కానీ స్నేహ ప్రయాణం ప్రాణమున్నంత వరకు అన్న వ్యాఖ్యలకు అర్థం మార్చేశాడో ప్రబుద్ధుడు. అనుమానం పెనుభూతమై ప్రియురాలి కోసం స్నేహితుడిని దారుణ హత్య చేసి.. మృతదేహాన్ని ఇసుక కుప్పలో దాచిన ఓ నిందితుడి ఉదంతం సోమవారం వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. కలహండి జిల్లాలోని టిట్లాఘడ్ గ్రామానికి చెందిన రామన్ బబర్తీ, దేబన్‌పొడ గ్రామానికి చెందిన ఉమాకాంత కండొ (25) ప్రాణ స్నేహితులు. రామన్ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అయితే స్నేహితుడైన ఉమాకాంత కండొతో రామన్ ప్రియురాలు చనువుగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయిన రామన్ స్నేహితుడిని హత్య చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో రాయగడలో ఉన్న సోదరి ఇంటికి వచ్చి అక్కడి స్నేహితులైన ప్రశాంత్ బబర్తీ, ప్రకాష్ బటొలకు విషయం తెలియజేశాడు. వారంతా కలిసి పథకం ప్రకారం గత నెల 4 వ తేదీన ఉమాకాంతను రాయగడలో విందు భోజనానికి ఆహ్వానించారు.
ఇసుక కుప్పలో మృతదేహం
ఆహ్వానం మేరకు రాయగడ వచ్చిన ఉమాకాంతను రామన్, స్నేహితులు జిల్లాలోని కల్యాణసింగుపూర్ ప్రాంతంలోని చెక్ డ్యామ్‌కు తీసుకువెళ్లారు. పథకం ప్రకారం ఉమాకాంతతో ఎక్కువ మద్యం తాగించి గొంతునులిమి హత్య చేశారు. అనంతరం ఉమాకాంత మృతదేహాన్ని డ్యామ్ సమీపంలో ఇసుక కుప్పవద్ద పాతిపెట్టి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే మే 4 వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఉమాకాంత ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు టిట్లాఘడ్ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉమాకాంత స్నేహితుడైన రామన్ బబర్తీ ఫోన్‌ను ట్రాక్ చేయడంతో విషయం బయటపడింది. రామన్ బబర్తీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉమాకాంతను హత్య చేసిన సంగతి అంగీకరించాడు. ఈ సమాచారం మేరకు చెక్‌డ్యామ్ వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని మేరకు కల్యాణసింగుపురం పోలీసుల సహాయంతో టిట్లాఘడ్ పోలీసులు వెలికితీశారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment