friend murder
-
ఫ్రెండ్ కలలో అడిగాడు... చంపేశా!
అన్నానగర్: కరూర్‌లో చనిపోయిన స్నేహితుడు కలలో వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని కోరడంతో యువకుడిని హత్య చేసి ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు నిందితుడు ఇచ్చిన వాగ్మూలం కలకలం రేపింది. కరూర్ గాంధీ గ్రామానికి చెందిన సెంథిల్ కుమార్‌కు జీవా(19) కుమారుడు ఉన్నాడు. తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవా 22వ తేదీ సెలవుల నిమిత్తం కరూర్ వచ్చాడు. ఆపై అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. తంథోనిమలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్ (27) సహా 10 మంది వ్యక్తులు జీవాను హత్య చేసి మృతదేహాన్ని పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో ముక్కలు చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్‌తోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అదే ప్రాంతానికి చెందిన చంద్రు (21), కపిల్ కుమార్ (20) పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్ పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. మోహన్, తాను కరూర్ గాంధీ గ్రామా నికి చెందిన స్నేహితులమని, 2021లో ఇండస్ట్రియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఇద్దరం స్నేహితులతో కలిసి మద్యం సేవించామని చెప్పా డు. అప్పుడు తాను, మోహన్ తాగిన వైన్‌లో విషం కలపి ఇచ్చారని, ఇద్దరం తాగామని, మోహన్ మృతి చెందాడని చెప్పాడు. ఈ ఘటనకు జీవా సహకరించాడని తెలిపాడు. మోహన్ తన కలలో వచ్చి నన్ను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పాడని, అందుకే తాను, నా స్నేహితులు కలిసి జీవాను చంపేశామని శశికుమార్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
మీకు జీవితఖైదు సరైనదే: షాక్ ఇచ్చిన హైకోర్టు
సాక్షి, శివాజీనగర: డబ్బు కోసం స్నేహితున్ని హత్య చేసిన కేసులో ముంబైకి చెందిన ఇద్దరు యువతులతో పాటు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అర్జీని హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పును రద్దు చేయాలని, లేదా సవరించాలని దోషులు రోహిత్ కుమార్– జార్ఖండ్, శివానీ ఠాకూర్, ప్రీతి రాజ్ – ముంబై, వారీస్– బిహార్.. వేసుకున్న అప్పీల్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ వీ.వీరప్ప ధర్మాసనం కొట్టివేసింది. హత్య కేసు వివరాలు.. వివరాలు.. వారిస్, తుషార్ రాజస్థాన్‌లో కలసి చదువుతుండేవారు. ఇంజనీరింగ్ చదివేందుకు తుషార్ బెంగళూరుకు వచ్చాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన తుషార్‌ను కిడ్నాప్ చేయాలని వారిస్ కూడా బెంగళూరులో మకాం వేశాడు. ఇక్కడే ఉద్యోగం చేస్తున్న తన బంధువైన ప్రీతి, శివానిని తుషార్‌కు పరిచయం చేశాడు. నిందితులు 2011 జనవరి 14న తుషార్‌ను కిడ్నాప్ చేసి హత్యచేసి వీరసాగర రోడ్డు నీలగిరి తోపులో పడేశారు. జనవరి 16న అతని తండ్రికి కాల్ చేసి మీ కుమారుడిని కిడ్నాప్ చేశాం. రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తుషార్ తండ్రి బిహార్ నుంచి బెంగళూరుకు వచ్చి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. రైల్వేస్టేషన్ వద్ద డబ్బు ఇస్తామని పిలిపించగా రెండో నిందితుడు రోహిత్ వచ్చాడు. అతన్ని పట్టుకుని మిగతావారినీ అరెస్టు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ లో నేరం రుజువు కావడంతో 2014 నవంబరులో నలుగురికీ జీవిత ఖైదుని విధించింది. హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పుని సమర్థించింది. (చదవండి: భార్య నుంచి కాపాడాలని మొర ) -
మద్యం మత్తులో మిత్రుల వివాదం.. గాజుసీసా ముక్కతో..
కాకినాడ సిటీ: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఓ చిన్న వివాదం ఒకరి దారుణ హత్యకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాలెపు కాసుబాబు (26), రవి కాసు, విఘ్నేష్, సతీష్‌లది కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం. ఈ నలుగురూ ఫొటోగ్రఫీ కోర్సు చేశారు. కాకినాడ శాంతినగర్‌లోని మదర్ థెరిసా విగ్రహం సమీపాన ఆరు నెలల క్రితం ‘స్టోరీస్’ అనే పేరుతో స్టూడియో పెట్టారు. జగన్నాథపురం మహిళా కళాశాల సమీపాన రూము తీసుకొని నలుగురూ అద్దెకు ఉంటున్నారు. నలుగురూ కలిసి మద్యం తాగేందుకు విఘ్నేష్ స్థానిక ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో 306 నంబర్ రూమును బుధవారం రాత్రి బుక్ చేశాడు. అక్కడ కాసుబాబు, రవి కాసు, విఘ్నేష్, సతీష్‌తో పాటు రామకృష్ణ, బిర్లా అనే మరో ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలో రవి కాసు చెంపపై కాసుబాబు సరదాగా కొట్టాడు. ఆ తరువాత సరదాగా కొట్టానని క్షమాపణ చెప్పాడు. అయితే కాసుబాబు తనను కొట్టిన విషయాన్ని రవి కాసు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా పోస్టు చేశాడు. విషయాన్ని అక్కడితో వదిలేసినట్లు నటించి, మద్యం తాగిన అనంతరం రామకృష్ణ, బిర్లాను తీసుకొని రాత్రి 12 గంటల సమయంలో రవి కాసు బయటకు వెళ్లిపోయాడు. కాసుబాబు, సతీష్ హోటల్ రూములోనే ఉండిపోయారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రవి కాసు తిరిగి హోటల్ రూముకు వచ్చాడు. తనను కొట్టి అవమానించినట్టు భావించిన అతడు రూముకు వచ్చిన వెంటనే బీరు బాటిల్‌తో కాసుబాబు తలపై బలంగా కొట్టాడు. అనంతరం పగిలిన గాజుసీసా ముక్కతో కాసుబాబు కంఠంలో పొడిచాడు. చదవండి: (ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..) ఈ హడావుడితో సతీష్ నిద్ర లేచాడు. అడ్డం వస్తే అతడిని కూడా చంపేస్తామని రవి కాసు బెదిరించాడు. దీంతో అతడు ప్రాణభయంతో పారిపోయాడు. రవి కాసు చేసిన దాడిలో కాసుబాబు అక్కడికక్కడే చనిపోయాడు. హత్య అనంతరం రవి కాసు పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. హతుడు కాసుబాబు సోదరుడు ధనవర్మ ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై టూటౌన్ సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాసుబాబు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉలిక్కిపడిన పల్లం కాట్రేనికోన: కాసుబాబు హత్యతో అతడి స్వస్థలం పల్లం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన పాలెపు ధర్మారావు దంపతులకు హతుడు కాసుబాబుతో పాటు కుమార్తె, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్లు కావడంలో స్నేహితుడు కాసుబాబు, మల్లాడి రవి కలిసి కాకినాడలో స్టూడియో నిర్వహిస్తున్నారు. కాసుబాబు ప్రేమించిన అమ్మాయితో రవి వాట్సాప్ చాటింగ్ చేస్తుండటంతోనే వారి మధ్య వివాదం తలెత్తి, ఈ హత్యకు దారి తీసిందని పలువురు అంటున్నారు. కాసుబాబు మృతదేహాన్ని చూసేందుకు పల్లం రామాలయం సెంటర్‌కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. -
ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది
రాయగడ: అలల ప్రయాణం తీరం చేరేవరకు మాత్రమే. కలల ప్రయాణం మెలకువ వచ్చేంత వరకే. కానీ స్నేహ ప్రయాణం ప్రాణమున్నంత వరకు అన్న వ్యాఖ్యలకు అర్థం మార్చేశాడో ప్రబుద్ధుడు. అనుమానం పెనుభూతమై ప్రియురాలి కోసం స్నేహితుడిని దారుణ హత్య చేసి.. మృతదేహాన్ని ఇసుక కుప్పలో దాచిన ఓ నిందితుడి ఉదంతం సోమవారం వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. కలహండి జిల్లాలోని టిట్లాఘడ్ గ్రామానికి చెందిన రామన్ బబర్తీ, దేబన్పొడ గ్రామానికి చెందిన ఉమాకాంత కండొ (25) ప్రాణ స్నేహితులు. రామన్ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అయితే స్నేహితుడైన ఉమాకాంత కండొతో రామన్ ప్రియురాలు చనువుగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయిన రామన్ స్నేహితుడిని హత్య చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలో రాయగడలో ఉన్న సోదరి ఇంటికి వచ్చి అక్కడి స్నేహితులైన ప్రశాంత్ బబర్తీ, ప్రకాష్ బటొలకు విషయం తెలియజేశాడు. వారంతా కలిసి పథకం ప్రకారం గత నెల 4 వ తేదీన ఉమాకాంతను రాయగడలో విందు భోజనానికి ఆహ్వానించారు. ఇసుక కుప్పలో మృతదేహం ఆహ్వానం మేరకు రాయగడ వచ్చిన ఉమాకాంతను రామన్, స్నేహితులు జిల్లాలోని కల్యాణసింగుపూర్ ప్రాంతంలోని చెక్ డ్యామ్‌కు తీసుకువెళ్లారు. పథకం ప్రకారం ఉమాకాంతతో ఎక్కువ మద్యం తాగించి గొంతునులిమి హత్య చేశారు. అనంతరం ఉమాకాంత మృతదేహాన్ని డ్యామ్ సమీపంలో ఇసుక కుప్పవద్ద పాతిపెట్టి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే మే 4 వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఉమాకాంత ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు టిట్లాఘడ్ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉమాకాంత స్నేహితుడైన రామన్ బబర్తీ ఫోన్‌ను ట్రాక్ చేయడంతో విషయం బయటపడింది. రామన్ బబర్తీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉమాకాంతను హత్య చేసిన సంగతి అంగీకరించాడు. ఈ సమాచారం మేరకు చెక్‌డ్యామ్ వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని మేరకు కల్యాణసింగుపురం పోలీసుల సహాయంతో టిట్లాఘడ్ పోలీసులు వెలికితీశారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. -
ముసలయ్యా.. ముంచావయ్యా!
ఆయనో పెద్దమనిషి.. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం... సెటిల్మెంట్ పేరుతో స్నేహితుడినే మట్టుపెట్టాడు. ముప్పై ఏళ్ల బంధాన్ని డబ్బు కోసం అతికిరాతకంగా అంతమొందించాడు. ముక్కలుగా నరికేసి ఆధారాలు లేకుండా చేయాలనుకున్నాడు. తన బంధువు సహాయంతో తలను ఒక పోలీసు స్టేషన్ పరిధిలో, మొండాన్ని తన ఇంటి నీటి తొట్టెలో పాతిపెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు రెండు రోజుల్లోనే హత్య కేసును చేధించి నిందితులను కటకటాల పాలు చేశారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనమైంది. నిందితుల అరెస్టు వివరాలను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ గురువారం మీడియాకు తెలిపారు. కడప అర్బన్/ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొంది మహాత్మానగర్‌లో నివసిస్తున్న బాలిశెట్టి వెంకట రమణయ్య (60), ఎర్రగుంట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ హనుమగుత్తి ముసలయ్యల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. గతేడాది ముసలయ్య వెంకట రమణయ్య దగ్గర దాదాపు రూ. 30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకోసం కడపలోని తన 18 సెంట్ల స్థలాన్ని ఆయకంగా పెట్టాడు. ఈ మధ్య కాలంలో డబ్బులు ఇవ్వాలని హతుడు ముసలయ్యపై ఒత్తిడి తీసుకు వచ్చేవాడు. ఈ క్రమంలో తన స్థలం డాక్యుమెంట్లను తీసుకొస్తే డబ్బు ఇస్తానని ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం హతునికి ప్రధాన నిందితుడు ఫోన్ చేశాడు. అతను డాక్యుమెంట్లను కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో డబ్బులు తీసుకొస్తానని వంట గదిలోకి వెళ్లి రోకలిబండను తీసుకొచ్చి వెంకట రమణయ్య తలపై వెనక నుంచి బాదాడు. దీంతో కిందపడిపోయిన వెంకట రమణయ్య చనిపోయాడని నిర్ధారించుకుని శరీరాన్ని ముక్కలుగా చేయాలనుకున్నాడు. (రిటైర్డు ఉద్యోగి హత్య.. తల లభ్యం) మచ్చు కత్తితో తలను మొండెం నుంచి వేరు చేశాడు. తర్వాత ఒక్కసారిగా వెన్నులో భయం పుట్టి రక్తపు మరకలున్న ప్రదేశాన్ని కడిగేశాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో కత్తి ప్రతాప్‌రెడ్డి దగ్గర స్కూటీ తీసుకుని హతుని సెల్ఫోన్లను పొట్లదుర్తి అయ్యప్పస్వామి గుడి దగ్గరున్న ఎకో పార్కు వద్ద పడేశాడు. రాత్రి 8 గంటల సమయంలో తన సోదరుని కుమారుడైన శ్రీనాథ్‌కు విషయాన్ని చెప్పాడు. ఇద్దరూ కలిసి మొండెంలేని శరీరాన్ని ఇంటి ఆవరణంలో బాత్రూం వద్దనున్న నీళ్ల తొట్టిలో వేసి ఇసుక, రాళ్లను కప్పివేశారు. ఆ రాత్రికి అక్కడే నిద్రించారు. ఉదయాన్నే హతుడి తలను స్టీల్ క్యారియర్‌లో, అతని దుస్తులు, ఇంటిని శుభ్రపరిచిన దుస్తులను కవరులో పెట్టుకుని మోటారు సైకిల్‌పై గువ్వలచెరువు ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ తలను, దుస్తులను అడవిలోకి విసిరేశారు. అక్కడి నుంచి కడప ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఈ నేరానికి ఉపయోగించిన కత్తిని బస్టాండు వద్ద ఉన్న టాయిలెట్స్ వెనుకవైపు పడేశారు. తర్వాత తన కూతురు ఇంటికి వెళ్లాడు. తనతోపాటు వచ్చిన శ్రీనాథ్‌ను ఎర్రగుంట్లకు పంపించి వేశాడు. తిరిగి ఈనెల 22వ తేదీ ఉదయం ఎర్రగుంట్లకు వెళ్లి మళ్లీ ఇంటిని శుభ్రపరిచి ఎవరికీ అనుమానం రాకుండా కడపకు చేరుకున్నారు. చివరి ఫోన్‌కాల్ ఆధారంగా.... ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బాలిశెట్టి వెంకట రమణయ్యకు ప్రధాన నిందితుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్య చివరి ఫోన్ కాల్ చేశాడు. దీని ఆధారంగానే నిందితుడిని గుర్తించి పట్టుకోగలిగారు. ఈ సంఘటనలో ఇంకా ఏవైనా కారణాలున్నాయన్న విషయంపై సాంకేతికంగా విచారణ చేపడుతున్నామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. పోలీసు అధికారులకు నగదు రివార్డులు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేసిన కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ, సీఐలు సదాశివయ్య, ఉలసయ్య, ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, రమేష్, రాజరాజేశ్వర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్, విశ్వనాథరెడ్డిలను ఎస్సీ అభినందించారు. నగదు రివార్డులను అందజేసి సత్కరించారు. -
ప్రేమ వివాహం జరిపించినందుకు దారుణ హత్య
అన్నానగర్: చెంగల్పట్టులో స్నేహితుడి ప్రేమ వివాహానికి సహకరించిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాలు.. కాంచీపురం జిల్లా చెంగల్పట్టు సమీపం మేలేరిబాక్కం బజనై ఆలయ వీధికి చెందిన శేఖర్ కుమారుడు సూర్య (23). ఇతను ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని భార్య గాయత్రి ఐదు నెలల గర్భిణి. ఈ స్థితిలో సోమవారం మేలేరి బాక్కం కాలువ పక్కన సూర్య గొంతు కోసిన స్థితిలో శవంగా పడిఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో.. కొన్ని రోజుల కిందట మేలేరిబాక్కం ప్రాంతానికి చెందిన కార్తిక్, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో సూర్య స్నేహితులతో కలిసి ఆలయంలో ప్రేమ జంటకు రహస్యంగా వివాహం జరిపించాడు. ఈ విషయం యువతి తరఫు వారికి తెలిసింది. దీంతో సూర్యను హత్య చేసేందుకు కుట్రపన్నారు. ఈ స్థితిలో ఆదివారం రాత్రి సూర్యకు మద్యం విందు ఇస్తామని చెప్పి తీసుకెళ్లి గొంతు, పురుషాంగం కోసి దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి ముగ్గురు హంతకుల కోసం గాలిస్తున్నారు. -
మిత్రుడిపై అనుమానం.. బండరాయితో బాది..
పుణె : భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మిత్రుడి తలపై బండరాయితో కొట్టి హత్యచేశాడో వ్యక్తి. ఈ సంఘటన సోమవారం మహరాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణె జిల్లాకు చెందిన మందర్ షిండే, అదే ప్రాంతానికి చెందిన యోగేష్ హరిభౌ దోనే మంచి మిత్రులు. యోగేష్ తరుచూ మందర్ షిండేను ఎగతాళి చేస్తూ మాట్లాడేవాడు. ఓ రోజు యోగేష్ అందరి ముందు మందర్ భార్య గురించి తప్పుగా మాట్లాడటంతో మందర్ అతనిపై కక్ష్య పెంచుకున్నాడు. యోగేష్‌ను మందు తాగటానికి పిలిచి మద్యం మత్తులో ఉండగా అతని తలపై పెద్ద బండరాయితో మోది హత్య చేశాడు. ఈ హత్య చేయటానికి గణేష్ కవాలే, భూషణ్ గైక్వాడ్ అనే ఇద్దరి మిత్రుల సహాయం తీసుకున్నాడు. హత్య అనంతరం ఆ ముగ్గురు శవాన్ని పన్షత్ సమీపంలో పడవేశారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గణేష్ కవాలేపై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. యోగేష్‌పై ఉన్న కోపంతోనే మందర్ అతన్ని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
54 సార్లు పొడిచి.. గొంతుకోసి స్టేషన్‌కు
బాంద్రా : ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. తన ముందు పదే పదే ఆంగ్లంలో మాట్లాడి తనను అవమానించాడనే అక్కసుతో స్నేహితుడిని హత్య చేశాడు ఓ యువకుడు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 54 సార్లు కత్తితో పాశవికంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతడి గొంతును చీల్చాడు. ఈ భయానక సంఘటన గత బుధవారం చోటు చేసుకున్నప్పటికీ నిందితుడు పోలీసులకు నేరుగా లొంగిపోయిన తర్వాతే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అమిర్ అబ్దుల్ వహీద్ రహిన్ (21), మహ్మద్ అఫ్రాజ్ అలాం షేక్ (18) ఇద్దరు స్నేహితులు. అయితే, అఫ్రాజ్ పలుమార్లు రహిన్ ముందు ఆంగ్లంలో మాట్లాడుతూ హేళన చేశాడట. దాన్ని అవమానంగా భావించిన రహిన్ ఎలాగైనా అఫ్రాజ్‌ను హత్య చేయాలనుకున్నాడు. అందుకోసం వారం రోజులపాటు ఆలోచించి ప్లాన్ వేసుకున్నాడు. బుధవారం బయటకు వెళ్లి సరదాగా కూల్ డ్రింక్ తాగి వద్దామని తీసుకెళ్లాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో గొంతుకోసం చనిపోయాడని నిర్ధారించుకునే వరకు 54సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో స్టేషన్‌కు వెళ్లి రహిన్ లొంగిపోయాడు. -
ఇడ్లీల కోసం గొడవ, స్నేహితుడు హత్య
కోయంబత్తూరు: ఓ వ్యక్తి మద్యంమత్తులో ఇడ్లీల విషయంలో గొడవపడి స్నేహితుడిని చంపాడు. తమిళనాడులో కోయంబత్తూరులోని తీతిపాల్యం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మరప్పన్, శర్వాణన్ అనే ఇద్దరు స్నేహితులు ఇటీవల కలసి మద్యం తాగారు. అనంతరం శర్వాణన్ ఇడ్లీలు తీసుకునేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరగా మరప్పన్ నిరాకరించాడు. ఈ విషయంలో ఇద్దరూ వాదులాడుకున్నారు. అనంతరం ఇద్దరూ కలసి గంజాయి తాగారు. శర్వాణన్ మళ్లీ ఇడ్లీల కోసం డబ్బులు అడగ్గా, మరప్పన్ ఇవ్వలేదు. దీంతో ఇద్దరూ గొడవపడ్డారు. వాటర్ ట్యాంక్ దగ్గర మరప్పన్ గోడపైనుంచి శర్వాణన్‌ను తోసివేశాడు. కిందపడ్డ శర్వాణన్ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలయ్యాయి. అతన్ని వెంటనే కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. శర్వాణన్ చికిత్స పొందుతూ మరణించాడు. -
దెయ్యం భయంతో దొరికిపోయారు
కేకేనగర్ (చెన్నై): స్నేహితుడిని హత్య చేసి పాతిపెట్టిన ఐదుగురు దెయ్యం భయంతో పోలీసులకు చిక్కిన సంఘటన తమిళనాడులోని నాగపట్నంలో చోటుచేసుకుంది. ఇక్కడి సునామీ నివాస గృహాలకు చెందిన శంకర్(28) జాలరి. తన భార్యను లైంగికంగా వేధిస్తున్న శంకర్‌ను అంతమొందించడానికి కార్తీశన్ అనే వ్యక్తి మరో ఐదుగురి స్నేహితులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ క్రమంలో శంకర్‌ను తన ఇంటికి పిలిచి మద్యం తాగించి గడ్డపారతో తలపై మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కార్తీశన్ ఇంటి వెనుక స్థలంలో పాతిపెట్టారు. వారం క్రితం హంతకుల్లో ఒకరు దినకరన్ ప్రమాదంలో మృతి చెందాడు. శంకర్ దెయ్యంలా మారి అతన్ని చంపి ఉంటాడని స్నేహితులకు అనుమానం కలిగింది. దీంతో ఆ మృతదేహాన్ని వెలికితీసి అన్బరసన్ అనే మరో నిందితుని ఇంటి వద్ద పూడ్చడానికి గుంత తవ్వుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అన్బరసన్, మణికంఠన్, శివ, కార్తీశన్, మారెక్స్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు పంపారు. తన భర్త కనిపించడం లేదంటూ శంకర్ భార్య మే నెలలో ఫిర్యాదు చేసింది. -
స్నేహితుడి తలతో స్టేషన్‌కు వెళ్లి..
దొడ్డబళ్లాపురం: స్నేహితుడి తల నరికి నేరుగా స్టేషన్ కు వెళ్లి ఓ వ్యక్తి పోలీసులు అవాక్కయ్యేలా చేశాడు. ఓ పక్క తెగిపోయిన ఆ తల నుంచి రక్తపు బిందువులు స్టేషన్ లో పడుతుండగానే దానిని కిందపెట్టి తాను లొంగిపోతున్నట్లు చెప్పాడు. అతడు ఆ సమయంలో మద్యం మత్తులో కూడా ఉన్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కెంపతిమ్మనహళ్లికి చెందిన మంజునాథ్ (26) అనే వ్యక్తి ఉగనవాడి అనే గ్రామానికి చెందిన శశికుమార్ కు రూ.27వేలు అప్పు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మాట్లాడాలని చెప్పి మంజునాథ్‌ను ఉగనవాడి గ్రామం శివారు లోని ఓ నిర్జన ప్రదేశానికి పిలిచిన శశికుమార్.. అతడిని వేట కొడవలితో నరికేసాడు. అదే రాత్రి మంజునాథ్ తల తీసుకొని విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వారిని అవాక్కయ్యేలా చేశాడు. అనంతరం హత్య జరిగిన చోటుకి వెళ్లిన పోలీసులు మంజునాథ్ మొండాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
తాగిన మైకంలో మిత్రుడి హత్య
హైదరాబాద్: తాగినమైకంలో ఓ వ్యక్తి తన మిత్రుడినే హత్య చేశాడు. ఫలక్‌నుమాలో ఈ దారుణం జరిగింది.ఓ మిత్రుడు తాగిన మత్తులో తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు. -
స్నేహితున్ని చంపి ఇంట్లో పాతిపెట్టారు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం జరిగింది. స్నేహితుడినే సహచరులు హతమార్చి.... ఇంట్లో పాతిపెట్టిన ఘటన కలకలం సృష్టించింది. మృతుడు బోధన్‌కు చెందిన ఇఫ్తికర్ చిట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే బోధన్‌కు చెందిన ఇఫ్తికర్ పది రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. దీనపై బోధన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే షకీల్ ఆదేశాలతో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేశారు. ఇఫ్తికర్ బైక్ నిజామాబాద్‌లోని ఓ హోటల్ వద్ద లభించింది. ఇందుకు సంబంధించి అనుమానితులను అదుపులో్కి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇఫ్తికర్‌ను చంపి ఆశనగర్ కాలనీలోని ఓ ఇంట్లో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపారు. పోలీసులు ఈరోజు ఉదయం మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. -
స్నేహితుణ్ణి నదిలో తోసేశారు!
-
స్నేహితుడిని కృష్ణానదిలోకి తోసేశారు
గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు....స్నేహితుడిని దారుణంగా హతమార్చిన ఘటన గురువారం స్థానికంగా కలకలం సృష్టించింది. స్నేహితుడిని ప్రకాశం బ్యారేజీ పైనుంచి తోసేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.... వారు కూడా బ్యారేజ్ పైనుంచి దూకేశారు. అయినా స్థానికులు వారిని వెంటాడి పట్టుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. మృతుడితో పాటు, ఇద్దరు యువకులు విజయవాడకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు సమాచారం. నిందితులను విజయవాడ పోలీసులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.