దెయ్యం భయంతో దొరికిపోయారు
కేకేనగర్ (చెన్నై): స్నేహితుడిని హత్య చేసి పాతిపెట్టిన ఐదుగురు దెయ్యం భయంతో పోలీసులకు చిక్కిన సంఘటన తమిళనాడులోని నాగపట్నంలో చోటుచేసుకుంది. ఇక్కడి సునామీ నివాస గృహాలకు చెందిన శంకర్(28) జాలరి. తన భార్యను లైంగికంగా వేధిస్తున్న శంకర్‌ను అంతమొందించడానికి కార్తీశన్ అనే వ్యక్తి మరో ఐదుగురి స్నేహితులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ క్రమంలో శంకర్‌ను తన ఇంటికి పిలిచి మద్యం తాగించి గడ్డపారతో తలపై మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కార్తీశన్ ఇంటి వెనుక స్థలంలో పాతిపెట్టారు.
వారం క్రితం హంతకుల్లో ఒకరు దినకరన్ ప్రమాదంలో మృతి చెందాడు. శంకర్ దెయ్యంలా మారి అతన్ని చంపి ఉంటాడని స్నేహితులకు అనుమానం కలిగింది. దీంతో ఆ మృతదేహాన్ని వెలికితీసి అన్బరసన్ అనే మరో నిందితుని ఇంటి వద్ద పూడ్చడానికి గుంత తవ్వుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అన్బరసన్, మణికంఠన్, శివ, కార్తీశన్, మారెక్స్‌లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు పంపారు. తన భర్త కనిపించడం లేదంటూ శంకర్ భార్య మే నెలలో ఫిర్యాదు చేసింది.