Nagapattinam
-
తమిళనాడు ఎంపీ మృతి
చెన్నై: తమిళనాడు ఎంపీ ఎం.సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.నాగపట్నం ప్రస్తుత ఎంపీగా ఉన్న 67 ఏళ్ల ఎం. సెల్వరాజ్‌కి గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. రైతు, సామాజిక కార్యకర్త అయిన సెల్వరాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో అత్యంత సీనియర్ నేత. నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. 1989, 1996, 1998, 2019లో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు.ఎంపీ ఎం.సెల్వరాజ్ మృతికి సీపీఐ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయనను ఆదర్శప్రాయమైన నేతగా అభివర్ణించింది. తిరువారూర్ జిల్లాలోని సీతమల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది. కాగా ఈసారి నాగపట్నం నియోజకవర్గం నుంచి వి.సెల్వరాజ్‌ను సీపీఐ బరిలోకి దింపింది. -
కుటుంబాన్ని కబళించిన ప్రేమ వివాహం
సాక్షి, చెన్నై: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ఓ కుటుంబాన్ని కబళించింది. అవమానానికి గురైన ఆ కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులను కడతేర్చి తాను ఆత్మహత్య చేసుకున్న దారుణ ఉదంతం నాగపట్టినం జిల్లాలో చోటు చేసుకుంది. విక్కనాపురానికి చెందిన లక్ష్మణన్ (55), భువనేశ్వరి (40) దంపతులకు కుమార్తెలు ధనలక్ష్మి (23), వినోదిని (20), అక్షయ (18) ఉన్నారు. ఇంటి ముందు ఓ టీ బంకు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమార్తె ధనలక్షి అదే ప్రాంతంలోని వేరే సామాజికవర్గానికి చెందిన విమల్‌రాజ్ (25)ను ప్రేమించగా లక్ష్మణన్ అభ్యంతరం తెలిపాడు. దీంతో మూడు నెలల క్రితం ధనలక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయి విమల్‌రాజ్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో తీవ్రమనస్తానికి గురైన లక్ష్మణన్ టీ దుకాణం నడపకుండా ఇంటి పట్టునే ఉండేవాడు. చదవండి: (తాళి కట్టిన గంటలోనే నడిరోడ్డుపై వదిలేశాడు..) తెల్లవారుజామున 4 గంటలకే టీ బంకు తెరిచే లక్ష్మణన్ శుక్రవారం ఉదయం 7 గంటలైనా తెరవకపోగా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో స్థానికులు అనుమానంతో ఇంటిలోకి చూడగా భార్య, ఇద్దరు కుమార్తెలు రోకలి బండతో తలపై మోది హత్యకు గురైన స్థితిలో, లక్ష్మణన్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక కుటుంబ పెద్దే భార్య, ఇద్దరు కుమార్తెలను హతమార్చి తాను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
డ్యూటీ ముగిసిందని.. రైలును మధ్యలోనే ఆపేశాడు
సాక్షి, చెన్నై: తన డ్యూటీ ముగిసిందంటూ లోకో పైలెట్ మార్గమధ్యంలో గూడ్స్ రైలును ఆపేసిన ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా శీర్గాలి సమీపంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నేలబొగ్గుతో కరైక్కాల్ పోర్టు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు హఠాత్తుగా శీర్గాలి సమీపంలో ఆగింది. సరిగ్గా లెవల్ క్రాసింగ్, రైల్వే గేటుకు మధ్యలో రైలును ఆపేసి లోకో పైలెట్ ముత్తురాజ్ కిందకు దిగేశాడు. తన డ్యూటీ సమయం ముగిసి అరగంట అవుతున్నా వేరే లోకో పైలెట్ రాలేదని, ఇక తాను రైలును ముందుకు నడపనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బ్యాగ్‌ను సర్దుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఎంతకూ రైలు ముందుకు కదలకపోవడం, గేటు తెరుచుకోకపోవడంతో వాహనచోదకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైల్వే గేట్‌మెన్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. సుమారు గంట పాటు గూడ్స్ రైలు అక్కడే ఆగడంతో శీర్గాలి – పుంగనూరు మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వైర్లెస్ సెట్ ద్వారా ముత్తురాజ్‌తో మాట్లాడారు. మైలాడుదురై జంక్షన్ వరకు గూడ్స్ నడపాలని కోరడంతో ఎట్టకేలకు ముత్తురాజ్ గూడ్స్‌ను ముందుకు కదిలించాడు. -
శవానికి చికిత్స..!
-
శవానికి మూడు రోజుల చికిత్స..
చెన్నై : ఈ భూమ్మిద మనం గట్టిగా నమ్మేది ఒక వైద్యులను మాత్రమే. అందుకే డాక్టర్లను దేవుడిగా అభివర్ణిస్తాం. కానీ కొన్ని ఘటనలు మాత్రం వైద్యులపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. డబ్బు ఆశతో చచ్చిన శవానికి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి సీన్ చిరంజీవి ‘ఠాగుర్’ లో చూశాం. తాజాగా అలాంటి ఘటననే నిజజీవితంలో జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని చనిపోయిన మూడు రోజులకి కూడా వైద్యం పేరిట లక్షల్లో డబ్బు వసూలు చేశారు. బాధితులు ఆ విషయం కనిపెట్టే లోపు తమకేం తెలియదని చేతులెత్తేశారు. తమిళానాడులోని నాగపట్టినం జిల్లాకు చెందిన శేఖర్‌కు(55) ఈనెల 9న కడుపునొప్పి రావడంతో కుటుంబీకులు స్థానిక ఆసుపత్రికి చేర్పించారు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఈ నెల 10న తంజావూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ శేఖర్‌కు ఆపరేషన్ చేయాలని రూ.5లక్షలు ఫీజు చెల్లించాలని డాక్టర్లు సూచించారు. దీంతో శేఖర్ కొడుకు సుభాష్ ఆ మొత్తాన్ని చెల్లించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ మరో రూ.3లక్షలు చెల్లించాలని సిబ్బంది సూచించడంతో సుభాష్‌కు అనుమానం వచ్చింది. శేఖర్ డిశ్చార్జ్ చేస్తే తాము వేరే ఆసుపత్రికి తీసుకెళ్తామని సిబ్బందిని కోరారు. అందుకు నిరాకరించిన సిబ్బంది తర్వాత రోజు డిశ్చార్జ్ చేశారు. దీంతో శేఖర్ని తంజావుర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శేఖర్ మరణించి మూడు రోజులు అవుతుందని తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని అక్కడే పెట్టి ధర్నాకు దిగారు. తమ తండ్రి చనిపోయి మూడు రోజులైనా చెప్పకుండా తమ వద్ద రూ.లక్షలు వసూలు చేశాడని సుభాష్ వాపోయాడు. తమకు అన్యాయం చేసిన ఆస్పత్రి యాజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తమకేమి తెలియదని చేతులెత్తేసింది. తమ ఆస్పత్రికి చెడ్డ పేరు తీసుకురావడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. -
అమ్మవారికి మహా అపచారం
సాక్షి, నాగపట్టణం: అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌తో అలంకరించిన ఇద్దరు అర్చకులపై వేటు పడింది. తమిళనాడు నాగపట్టణం జిల్లా మయిలాదుతుదైలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మయూర్‌నాథర్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు ఆలయంలోని అభయాంబిగై అమ్మవారిని ప్రతి శుక్రవారం వివిధ రంగుల కాగితాలతో అలంకరిస్తుంటారు. సంప్రదాయానికి భిన్నంగా రాజ్ అనే పురోహితుడు అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు తొడిగారు. పింక్ రంగు సల్వార్ కమీజ్, నీలం రంగు దుపటాతో అమ్మవారిని అలంకరించారు. సీనియర్ అర్చకుడు కళ్యాణమ్ కుమారుడైన రాజ్‌ను తండ్రికి సహాయంగా ఉంటాడనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టులో ఆలయంలో నియమించారు. తండ్రీకొడుకులపై వేటు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆగమ నియమాలకు విరుద్ధంగా అమ్మవారికి అపచారం జరగడంతో భక్తులు, సీనియర్ అర్చకులు మండిపడ్డారు. దీంతో స్పందించిన దేవస్థానం పాలక మండలి ఇద్దరు అర్చకులను విధుల నుంచి తొలగించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో వీరిద్దరిపై చర్య తీసుకోవాల్సివచ్చిందని పాలక మండలి ప్రతినిధి ఎస్. గణేశన్ తెలిపారు. తాను ఎటువంటి దురుద్దేశంతోనూ ఈ తప్పు చేయలేదని అర్చకుడు రాజ్ చెప్పారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. నంది విగ్రహానికి నోట్లతో అలంకరణ ప్రచారం కోసం గతంలోనూ రాజ్ ఇటువంటి పనులు చేశాడని మయిలాదుతుదై ఫొటోజర్నలిస్ట్ ఒకరు చెప్పారు. నంది విగ్రహాన్ని రూ. 15 వేల విలువ చేసే వంద రూపాయల నోట్లతో అలకరించించాడని, అప్పుడు అతడిని అందరూ మెచ్చుకున్నారని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడని తెలిపారు. కాగా, అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌లో అలంకరించిన ఫొటోలను రాజ్ తన స్నేహితులకు పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్‌గా మారాయి. -
అతనంటే ఇష్టంలేదని చెప్పడంతో...
నాగపట్నం: తనను ప్రేమించి ఆ తరువాత పక్కకు పెడుతోందన్న అక్కసుతో ఓ యువకుడు, బీటెక్ విద్యార్థినిని బండరాయితో మోది హత్య చేసిన సంఘటన తమిళనాడులో శనివారం జరిగింది. ఆ తరువాత నిందితుడు మతన్‌రాజ్(22) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పుదుకొట్టాయి జిల్లాకు చెందిన 18 ఏళ్ల బాధితురాలు చెన్నైలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అంతకు ముందు ఆ విద్యార్థిని, మతన్‌రాజ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తరువాత ఆమె అతన్ని పట్టించుకోవడం మానేసినట్లు తెలిసింది. ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ చూసిన మతన్‌రాజ్... ఆమెకు కాలేజీలో కొత్త స్నేహితులు దొరకడంతో తనకు దూరమైందని భావించాడు. శనివారం ఉదయం మతన్‌రాజ్ ఆమెను మాయిలాదుతురాయ్ బస్‌స్టేషన్‌లో కలుసుకుని పూంపుహార్ బీచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మాటల మధ్యలో తనకు అతనంటే ఇష్టంలేదని ఆమె చెప్పింది. దీంతో కోపోద్రోక్తుడైన మతన్‌రాజ్ ఆమెను హతమార్చాడు. అటుగా వెళ్తోన్న జాలర్లు రక్తపు మడుగులో పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. -
దెయ్యం భయంతో దొరికిపోయారు
కేకేనగర్ (చెన్నై): స్నేహితుడిని హత్య చేసి పాతిపెట్టిన ఐదుగురు దెయ్యం భయంతో పోలీసులకు చిక్కిన సంఘటన తమిళనాడులోని నాగపట్నంలో చోటుచేసుకుంది. ఇక్కడి సునామీ నివాస గృహాలకు చెందిన శంకర్(28) జాలరి. తన భార్యను లైంగికంగా వేధిస్తున్న శంకర్‌ను అంతమొందించడానికి కార్తీశన్ అనే వ్యక్తి మరో ఐదుగురి స్నేహితులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఈ క్రమంలో శంకర్‌ను తన ఇంటికి పిలిచి మద్యం తాగించి గడ్డపారతో తలపై మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కార్తీశన్ ఇంటి వెనుక స్థలంలో పాతిపెట్టారు. వారం క్రితం హంతకుల్లో ఒకరు దినకరన్ ప్రమాదంలో మృతి చెందాడు. శంకర్ దెయ్యంలా మారి అతన్ని చంపి ఉంటాడని స్నేహితులకు అనుమానం కలిగింది. దీంతో ఆ మృతదేహాన్ని వెలికితీసి అన్బరసన్ అనే మరో నిందితుని ఇంటి వద్ద పూడ్చడానికి గుంత తవ్వుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అన్బరసన్, మణికంఠన్, శివ, కార్తీశన్, మారెక్స్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు పంపారు. తన భర్త కనిపించడం లేదంటూ శంకర్ భార్య మే నెలలో ఫిర్యాదు చేసింది. -
ఏడుగురు తమిళ జాలర్లు అరెస్టు
నాగపట్టినం(తమిళనాడు): శ్రీలంక నావికా దళ అధికారులు ఏడుగురు తమిళ జాలర్లను అరెస్టు చేశారు. అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించారని, అందుకే వారిని అదుపులోకి తీసుకున్నామని అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారిని జాఫ్నాకు సమీపంలోని కాంకేసంతురాయ్ వద్ద విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల రోజుల్లో ప్రతిసారి తమిళ జాలర్లను తమ అదుపులోకి తీసుకోవడం లంక జాలర్లకు పరిపాటి అయింది. పట్టుకున్న ప్రతిసారి తాము కఠిన నిబంధనలు విదిస్తున్నా లెక్కచేయకుండా భారత మత్యకారులు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్నారని శ్రీలంక చెబుతోంది. -
7 కేజీలకు పైగా బంగారపు బిస్కెట్లు స్వాధీనం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగం గత రాత్రి వాహనాలు తనిఖీలు నిర్వహించిన తమిళనాడు ఎన్నికలు అధికారులకు ఒక్కసారిగా కళ్లు చెదిరాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా ఏడు కేజీలకు పైగా బంగారపు బిస్కెట్లను ప్రయాణికుడి వద్ద కనుగొన్నారు. అతని వద్ద నుంచి బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సదరు ప్రయాణికుడిని ఎన్నికల అధికారులు తమిళనాడు పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని వేదారణ్యం జిల్లాలో గత రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. పట్టుబడిన బంగారపు బిస్కెట్ల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 1.5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
కచ్చదీవులు మనవే!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు గా ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నాగపట్నంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కె గోపాల్‌కు మద్దతుగా ఓట్లను సేకరించారు. జాలర్లు, ముస్లిం ఓటర్లు, డెల్టా అన్నదాతల్ని ఆకర్షించే రీతిలో అవరిత్తిడల్లో జరిగిన ప్రచార సభలో జయలలిత ప్రసంగించారు. కచ్చదీవులు మనవే: కచ్చదీవులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ధారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళుల భూ భాగాన్ని ధారాదత్తం చేయడానికి వారెవరని ప్రశ్నించారు. కేంద్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తొలి సంతకం కచ్చదీవుల స్వాధీనానికి సంబంధించి ఉంటుందని స్పష్టం చేశారు. ‘మన దీవుల్ని మనం స్వాధీనం చేసుకుని చేపలను వేటాడుకుందాం’ అని సూచించారు. లోక్‌సభ ఎన్నికలు కేంద్రంలో అధికార మార్పునకు మాత్రమే వేదిక కాదని, పక్కదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఆయుధమని వివరించారు. సముద్ర తీరాల్లో భద్రతను పెంచామని, సముద్రం కోతలకు గురి కాకుండా, సముద్ర తీరవాసులకు భద్రత కల్పించే రీతిలో నిధులను వెచ్చించినట్లు గుర్తు చేశారు. జాలర్ల సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తోన్న అన్నాడీఎంకే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మిథైన్ను అడ్డుకుందాం: డెల్టా అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచిన డీఎంకే, కాంగ్రెస్‌కు గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైందన్నారు. కావేరి నదీ జలాల వ్యవహారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి అన్నదాతలను అప్పుల పాలు చేసింది ఆ రెండు పార్టీలు కాదా..? అని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చాక ఓ వైపు కావేరి జలాల కోసం ప్రతి ఏటా పోరాడుతూ, మరో వైపు అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునే రీతిలో నిధులు వెచ్చిస్తూ వచ్చామని వివరించారు. కావేరి వ్యవహారంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన డీఎంకే, కాంగ్రెస్‌లు, అన్నదాతల జీవనాధారంపై దెబ్బ తీయడం లక్ష్యంగా మిథైన్ వాయువు తవ్వకాలకు అనుమతి ఇచినట్లు గుర్తు చేశారు. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం తనకు కల్పిస్తే మిథైన్ తవ్వకాల అనుమతిని రద్దు చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిథైన్ను అడ్డుకుని తీరుతానని డెల్టా అన్నదాతలకు భరోసా ఇచ్చారు. అన్నదాతలతో, పంటలతో చెలాగాటం ఆడే రీతిలో జన్యుమార్పిడి పద్ధతికి కేంద్రం విదేశీ సంస్థలతో కలసి పరిశోధనలకు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్నదాతలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు, ఒప్పందాలను జాతీయ స్థాయిలో రద్దు చేసి తీరుతానని ప్రకటించారు. రిజర్వేషన్లు: ముస్లిం, క్రైస్తవ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం తన ప్రభుత్వం శ్రమిస్తూ వస్తున్నదని జయలలిత వివరించారు. రాష్ట్రం నుంచి ఏటా హజ్ వెళ్లే యాత్రికుల సంఖ్యను పెంచుతూ వస్తున్నామని పేర్కొన్నారు. క్రైస్తవులు జెరూసలేంకు వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మైనారిటీలకు రాష్ట్రంలో 3.5 శాతం రిజర్వేషన్ అమల్లో ఉందని, దీనిని పెంచాలన్న డిమాండ్ పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నాగపట్నానికి చేరుకున్న జయలలితకు అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టారుు. సాయంత్రం మైలాడుతురైలో జరిగిన బహిరంగ సభలో జయలలిత ప్రసంగించారు. సెంబనర్ కోయిల్ యూనియన్ పరిధిలోని కాళహస్తికాపురంలో జరిగిన సభలో తమ అభ్యర్థి ఆర్కే భారతీ మోహన్ మద్దతుగా ప్రచారం చేశారు. -
‘నాగై’ బంద్!
సాక్షి, చెన్నై : జాలర్ల అరెస్టుకు నిరసనగా నాగపట్నంలో వాణిజ్య బంద్ విజయవంతం అయింది. దుకాణాలన్నీ మూత బడటంతో జనం తంటాలు పడ్డారు. ఆమరణ దీక్షలోకు పూనుకున్న వారిలో 20 మందికి అస్వస్థతకు లోనై స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలిం చారు. సచివాలయంలో సీఎం జయలలితతో జాలర్ల సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. నాగపట్నం జాలర్లు 200 మందికి పైగా శ్రీలంక చెరలో బందీగా ఉన్న విషయం తెలిసిందే. తమ వాళ్ల విడుదలకు డిమాండ్ చేస్తూ అక్కరై పేట, చీక్కినా కుప్పం తదితర ఎనిమిది గ్రామాల జాలర్ల కుటుంబా లు ఆమరణ దీక్షకు దిగాయి. చేపల వేటను నిషేధించా యి. నాగపట్నం తపాలా కార్యాలయం వద్ద వీరు వారం రోజులుగా దీక్ష చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు సైతం దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాలు, వర్తక సంఘాలు, లారీ యజమానులు, డ్రైవర్ల సంఘాలు కదిలాయి. వీరి నేతృత్వంలో ఆ జిల్లాలో ఆందోళనలు జరుగుతోన్నాయి. వాణిజ్య బంద్: సోమవారంతో దీక్ష తొమ్మిదో రోజుకు చేరింది. వీరి దీక్షకు మద్దతుగా నాగై జిల్లా వాణిజ్య బంద్‌కు వర్తక సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో జిల్లాలో అన్ని దుకాణాలు మూత బడ్డాయి. పూంబుహార్, తరంగంబాడి, వేదారణ్యం, నాగుర్ తది తర ప్రాంతాల్లో జాలర్లకు మద్దతుగా ఆందోళనలు జరి గాయి. ప్రజా సంఘాలు, పార్టీలు జాలర్లకు మద్దతు ప్రకటించాయి. దీక్ష చేస్తున్న వారిలో 20 మంది మహిళలు ఉదయం అస్వస్థతకు లోనయ్యారు. ఉన్నట్టుండి స్పృహ తప్పడంతో దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తంజావూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. సీఎంతో భేటీ: తమ మీద జరుగుతున్న దాడుల్ని ఏకరువు పెట్టేందుకు, ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ జాలర్ల సంఘాల ప్రతినిధులు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం జయతో భేటీ అయ్యారు. నాగపట్నం, పుదుకోట్టై, రామనాధపురం జిల్లాలకు చెందిన జాలర్ల సంఘాల ప్రతినిధులు వీరముత్తు, సెల్వన్, శివజ్ఞానం, వడి వేలు, విజయ్ తదితరులు సీఎంతో అరగంట పాటుగా సమావేశం అయ్యారు. శ్రీలంక నావికాదళం పైశాచికత్వాన్ని వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక చెరలో బందీలుగా ఉన్న జాలర్లను విడిపించాలని, పడవల్ని తిరిగి స్వాధీనం చేసుకోనేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామంటూ సీఎం జయలలిత చెప్పారు. నాగైలో సాగుతున్న దీక్షను విరమింప చేయాలని, జాలర్లకు ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. దీంతో జాలర్ల సంఘాలన్నీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు ప్రకటించారు. -
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తమిళనాడులోని నాగపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తమిళనాడు, పాండిచ్చేరిలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అయితే వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా పయనించి... వేదారణ్యం - పంబన్ల మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. మాది తుపాన్ మళ్లీ బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.